ODI WC 2023: ధోనీ తరహా కెప్టెన్సీ అవసరం.. మిడిలార్డర్‌లో వీరిద్దరు.. సెమీస్‌లో ఆ నాలుగు!

భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) విజేతగా నిలవాలంటే రోహిత్‌ సేన ఏం చేయాలి..? సెమీస్‌కు చేరే నాలుగు జట్లేవి? మిడిలార్డర్‌లో ఎవరు అయితే బెటర్..? ఇలాంటి అంశాలపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

Updated : 18 Aug 2023 17:59 IST

ఇంటర్నెట్ డెస్క్: పదేళ్ల నుంచి ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్న టీమ్‌ఇండియాకు (Team India) స్వదేశంలోనే అద్భుతమైన అవకాశం వచ్చింది. మరో ఏడు వారాల్లోనే భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్‌ (ODI WC 2023) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చివరిసారిగా 2013లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వంలోని భారత జట్టు ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలిచింది. ఆ తర్వాత ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే కోరిక నెరవేరలేదు. ఈ క్రమంలో భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌ బరిలోకి దిగనున్న రోహిత్ సేనపై విపరీతమైన ఒత్తిడి ఉండటం మాత్రం ఖాయం. ఇదే అంశంపై పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికకర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ నాయకత్వంలో భారత్ విశ్వ విజేతగా నిలుస్తుందన్న నమ్మకం ఉందని, కాకపోతే పొరపాట్లకు తావులేకుండా ఉండాలని వ్యాఖ్యానించాడు.

‘‘భారత జట్టుపై అత్యధిక స్థాయిలో ఒత్తిడి ఉంది. కప్‌ను సాధించుకు రావాలని అభిమానులు ఆశించడం సహజమే. ఇక అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే.. ఒత్తిడిని ఎవరు తట్టుకొని జట్టును విజేతగా నిలుపుతారనేది కీలకం. ఆ ఒత్తిడి నుంచి సహచరులను రక్షించాలి. ఎప్పుడూ జట్టులోని ఆటగాళ్లు ఒత్తిడిగా భావించకూడదు. ఇందులో ధోనీ అత్యుత్తమం. భారత్ 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని ధోనీ నాయకత్వంలో గెలిచింది. ఆ తర్వాత ధోనీ కెప్టెన్సీని ఎవరు స్వీకరిస్తారు? అనే సందేహం వచ్చింది. తొలుత రోహిత్‌ను చూసినప్పుడు.. కెప్టెన్సీని రోహిత్ అంగీకరిస్తాడా? అనే ప్రశ్నను సంధించుకున్నా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో రోహిత్ కంగారు పడుతుంటాడు. ఒత్తిడికి గురవుతాడు. ధోనీ తర్వాత కెప్టెన్‌గా విరాట్ వచ్చాడు. అతడి విషయంలోనూ ఇలానే జరిగింది. అందుకే మెగా టోర్నీల్లో భారత్ విజేతగా నిలవలేకపోతోంది. ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటే రోహిత్ నాయకత్వంలోని టీమ్‌ఇండియా వరల్డ్‌ కప్‌ను గెలిచే అవకాశాలూ ఉన్నాయి. బ్యాటర్‌గా కోహ్లీ కంటే రోహిత్ సూపర్ టాలెంటెడ్. కెప్టెన్సీలో ఒత్తిడికి గురి కాకుండా ఉంటే భారత్ తప్పకుండా వరల్డ్‌ కప్‌ను చేజిక్కించుకుంటుంది’’ అని షోయబ్ అక్తర్ తెలిపాడు. 


సెమీస్‌కు చేరేది ఆ నాలుగు జట్లే: ఏబీడీ

మరో ఏడు వారాల్లో భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. స్వదేశంలో వరల్డ్ కప్ కావడంతో టీమ్‌ఇండియా ఎలాగైనా విజేతగా నిలవాలని భావిస్తోంది. సెమీస్‌కు చేరే నాలుగు జట్లలో భారత్ ఉండటం ఖాయమని మాజీలు చెబుతున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌ కూడా ఏ నాలుగు జట్లు సెమీస్‌కు చేరతాయనేది వెల్లడించాడు. ‘‘తప్పకుండా భారత్ ఇందులో ఉంటుంది. మరోసారి విజేతగా నిలిచే అవకాశం లేకకపోలేదు. సెమీస్‌లో భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చేరతాయి. నాలుగో జట్టుగా పాకిస్థాన్‌ కంటే మా టీమ్‌ వస్తుందని భావిస్తున్నా. పాక్‌ కంటే దక్షిణాఫ్రికాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫైనల్‌కు మాత్రం ఇంగ్లాండ్, భారత్ చేరతాయనుకుంటున్నా. మా జట్టు కూడా అక్కడికి చేరాలని కోరుకుంటా. కానీ, పరిస్థితులు మాత్రం ఆ రెండు జట్లకే అనుకూలంగా ఉన్నాయి’’ అని ఏబీడీ విశ్లేషించాడు.


ఆసియాకప్‌.. మిడిలార్డర్‌లో వీరిద్దరూ: సబా కరీమ్

శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌ సాధించి వస్తే భారత మిడిలార్డర్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారిలో ఒకరు అందుబాటులో లేకపోతే అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో భారత జట్టు మాజీ సెలెక్టర్ సబా కరీమ్‌ ఆసియా కప్‌ కోసం ఇద్దరి పేర్లను సూచించాడు. ‘‘కేఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌ మొదటి ఎంపిక. వారిద్దరూ ఫిట్‌గా ఉంటే జట్టులోకి తీసుకోవాలి. మరో రెండు రోజుల్లో ఆసియా కప్‌ కోసం జట్టును ప్రకటిస్తారని తెలుస్తోంది. అప్పటిలోగా ఫిట్‌నెస్‌ నిరూపించుకోలేకపోతే.. వారిద్దరి స్థానంలో ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ మంచి ఎంపికవుతుంది. నాలుగో స్థానంలో ఇషాన్‌ కిషన్..ఐదో స్థానంలో సూర్యను ఆడించాలి. శ్రేయాస్ ఫిట్‌నెస్‌ సాధించకపోతే తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌, సూర్యకుమార్‌లో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు సూర్యకుమార్‌ బెస్ట్’’ అని సబా వ్యాఖ్యానించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని