Dhoni - Sehwag: మీరు ఇలానే చేస్తే ఐపీఎల్‌లో ధోనీని నిషేధిస్తారు: సెహ్వాగ్ వార్నింగ్‌

బౌలింగ్‌ విభాగంలో క్రమశిక్షణ తగ్గితే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings)కి మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ హెచ్చరించాడు. 

Updated : 20 Apr 2023 10:50 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ (IPL 2023)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడింట నెగ్గింది. బ్యాటింగ్‌ విభాగంలో బలంగా ఉన్న CSK.. బౌలింగ్‌లో మాత్రం కాస్త బలహీనంగా ఉంది. సీఎస్కే బౌలర్లు ప్రతి మ్యాచ్‌లోనూ భారీగా అదనపు పరుగులు సమర్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్కే (Chennai Super Kings) బౌలర్లకు భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. ఎక్స్‌ట్రాలు ఇవ్వడం తగ్గించకపోతే.. జట్టుకు ఇబ్బందులు తప్పవని ఘాటుగా హెచ్చరించాడు.

బౌలింగ్‌ విభాగంలో చెన్నైకి గాయాల బెడద ఎక్కువగా ఉంది. దీపక్‌ చాహర్‌, ముఖేశ్ చౌదరి, బెన్‌ స్టోక్స్‌ గాయాలతో మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నారు. దీంతో పెద్దగా అనుభవం లేని తుషార్‌ దేశ్‌పాండే, ఆకాశ్‌ సింగ్, రాజ్యవర్ధన్‌ హంగార్గేకర్‌ వంటి బౌలర్లతో బరిలోకి దిగుతోంది. వాళ్లు వైడ్లు, నోబాల్స్ ఎక్కువగా వేస్తూ స్లో ఓవర్ రేట్‌కు కారణమవుతున్నారు. ఎక్స్‌ట్రాలు ఇవ్వడం మానుకోకపోతే.. తాను కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni)వార్నింగ్ ఇచ్చినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. సోమవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ చెన్నై బౌలర్లు 12 అదనపు పరుగులిచ్చారు. ఇందులో లెగ్‌ బైలు 6, వైడ్లు 4, నో బాల్స్‌ 2 ఉన్నాయి. స్లో ఓవర్ రేట్ ఇలాగే కొనసాగితే.. ధోనీపై నిషేధం విధించే పరిస్థితి వస్తుందని, అలా జరిగితే  చెన్నై సూపర్‌ కింగ్స్‌ చాలా నష్టపోతుందని సెహ్వాగ్‌ చెప్పాడు. 

ధోనీ అసలు సంతోషంగా కనిపించడం లేదు. బౌలర్లు వైడ్లు, నోబాల్స్ తగ్గించుకోవాలని ముందే చెప్పాడు. ఆర్సీబీతోనూ ఒక ఓవర్ అదనంగా వేయాల్సి వచ్చింది. ఇదిలాగే కొనసాగితే ధోనీపై నిషేధం విధిస్తారు. ధోనీ లేకుండా చెన్నై బరిలోకి దిగాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు. మోకాలి గాయం కారణంగా ధోనీ మరికొన్ని మ్యాచ్‌లే ఆడే అవకాశం కనిపిస్తోంది. అతను ఎల్లప్పుడూ పూర్తి సామర్థ్యంతో ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, బౌలర్లు ఇలాగే వైడ్లు, నోబాల్స్ వేస్తే మాత్రం ధోనీ విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది

- వీరేంద్ర సెహ్వాగ్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని