IND vs AUS: నా లక్ష్యమేంటో తెలుసు.. ఆ స్థానం మాత్రం అతడిదే: శ్రేయస్‌ అయ్యర్

ఆస్ట్రేలియాతో మూడువన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ ఉండగానే భారత్‌ (IND vs AUS) కైవసం చేసుకుంది. ఇందౌర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు విజృంభించడంతో 399/5 స్కోరు సాధించింది. అనంతరం వర్షం కారణంగా ఆసీస్‌ టార్గెట్‌ను 33 ఓవర్లకు 317 పరుగులకు కుదించారు. టీమ్‌ఇండియా బౌలర్ల దెబ్బకు ఆసీస్‌ 217 పరుగులకే ఆలౌట్‌ అయింది.

Published : 25 Sep 2023 08:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫామ్‌తోపాటు గాయం నుంచి కోలుకున్నాడో లేదో అనే అనుమానాలకు భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (105) ఒక్క ఇన్నింగ్స్‌తో తెరదించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో శతకం సాధించి ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో వరల్డ్ కప్‌ జట్టులో శ్రేయస్‌ (Shreyas Iyer) స్థానం సుస్థిరమైనట్లేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శతకంతో ఫామ్‌ను అందిపుచ్చుకోవడంపై శ్రేయస్‌ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘క్రీడల్లో ఎత్తుపల్లాలతో కూడిన ప్రయాణం తప్పదు. అయితే, ఇప్పుడు ఈ సెంచరీ సాధించడం అద్భుతమనిపిస్తోంది. నాకు మద్దతుగా నిలిచిన సహచరులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. టీవీల్లో మ్యాచ్‌లు చూసినప్పుడు నేను కూడా ఆడితే బాగుంటుందని అనిపించేది. ఇప్పుడు భారత్‌ తరఫున ఆడుతున్నా. అయితే, గాయాలు ఇబ్బంది పెట్టాయి. నాపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నా లక్ష్యాలేంటో నాకు తెలుసు. వాటి కోసం కష్టపడుతున్నా. ఆసీస్‌తో మ్యాచ్‌లో నా ప్రణాళికలను పక్కాగా అమలు చేశా. ఏ విషయాన్నీ సంక్లిష్టం చేసుకోను. జట్టు కోసం ఎలాంటి స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధం. కానీ, నెంబర్‌ 3 స్పాట్‌ మాత్రం విరాట్ కోహ్లీదే. అతడి నుంచి ఎవరూ తీసుకోలేరు. అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ ఒకడు’’ అని శ్రేయస్‌ అన్నాడు.

ఆ సిక్స్‌ నాకెంతో ప్రత్యేకం: గిల్

ఆసీస్‌తో తొలి వన్డేలో హాఫ్‌ సెంచరీ చేసిన భారత ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్.. రెండో వన్డేలో సెంచరీ(104)తో కదం తొక్కాడు.  మ్యాచ్‌ అనంతరం గిల్ మాట్లాడుతూ.. ‘‘అద్భుత విజయం సాధించడం ఆనందంగా ఉంది. జట్టుగా సరైన సమయంలో మేం ఊపు అందుకోగలిగాం. పరిస్థితికి అనుగుణంగా ఆటను మారుస్తూ ముందుకు సాగాం. వరల్డ్ కప్ ముంగిట తప్పకుండా మాకు ఎంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శ్రేయస్‌తో కలిసి మంచి ఇన్నింగ్స్‌ ఆడా. ఆ తర్వాత కేఎల్, సూర్య ఇదే ఊపును కొనసాగించడంతో భారీ స్కోరు చేయగలిగాం. కామెరూన్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్‌ నాకు ఎంతో ప్రత్యేకమైంది’’ అని గిల్ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని