Shreyas Iyer: నెగెటివ్‌ పబ్లిసిటీ.. నియంత్రించడం మన చేతుల్లో ఉండదు: శ్రేయస్ అయ్యర్

ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో హైదరాబాద్‌తో కోల్‌కతా తలపడనుంది. ఈ సందర్భంగా కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు.

Published : 23 Mar 2024 10:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: శ్రేయస్‌ అయ్యర్ (Shreyas Iyer).. దేశవాళీ క్రికెట్‌లో ఆడకపోవడంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. గాయం కాకుండానే ఆటకు దూరంగా ఉండిపోయాడనే ప్రచారం అతడిపై పడింది. ఎన్‌సీఏ వైద్య బృందం శ్రేయస్‌ ఫిట్‌గా ఉన్నాడని ధ్రువీకరించింది. విమర్శల మధ్య రంజీ ట్రోఫీలో ఆడిన శ్రేయస్‌ కీలకమైన 95 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. ఇవాళ ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా హైదరాబాద్‌తో కోల్‌కతా తలపడనుంది. ఈ క్రమంలో విలేకర్ల సమావేశంలో కెప్టెన్ శ్రేయస్‌ పలు విషయాలపై మాట్లాడాడు. 

‘‘ఎన్‌సీఏ డాక్టర్‌ ఏం చెప్పాడనే దానిపై స్పందించను. గాయం ఏంటి? ఎలా అయింది? అనే విషయాలు ఇప్పుడు అనవసరం. వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే క్రికెట్‌పై దృష్టిపెట్టడం కష్టమని గతంలోనే చెప్పా. అందుకే, వాటన్నింటిని పక్కన పెట్టేసి మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నాం. ఐపీఎల్‌ కోసం సరైన సన్నద్ధతే లభించింది. అత్యుత్తమ క్రీడాస్ఫూర్తితో జట్టును నడిపించేందుకు ప్రయత్నిస్తా. ప్రతి అంశంపై దృష్టిపెట్టి విజయం సాధించేందుకు ఆడతాం. 

ఐపీఎల్‌లో చాలా ఏళ్లుగా ఆడుతున్నా. ఇప్పుడు మాత్రం మరింత ఉత్సాహంగా ఉన్నా. నా సన్నద్ధత ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది. దాని కోసం రెగ్యులర్‌గా సాధన చేస్తూనే ఉన్నా. భారీ షాట్లను ప్రాక్టీస్‌ చేశా. గంటలపాటు బ్యాటింగ్‌ చేశా. ఐపీఎల్‌లో మా జట్టు విజేతగా నిలిపేందుకు ప్రయత్నిస్తా. ప్రతి టీమ్‌ సారథి ఇదే మాట చెబుతాడు. గత సీజన్లలో మా ప్రదర్శన గొప్పగా లేదు. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని భావిస్తున్నా. వర్తమానంలో ఉండటమే నాకిష్టం. ఇప్పుడేం చేయగలమనేది మన చేతుల్లోనే ఉంటుంది. బయట నుంచి మాట్లాడేవారిని నియత్రించడం ఎవరి వల్లా కాదు. గతం లేదా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మరిన్ని తప్పులు చేస్తారని నేను గుర్తించా. అందుకే, గతం నుంచి నేర్చుకొన్నది ఇప్పుడు అమలు చేయాలి. నా పని మీద దృష్టిపెడతా. ఏదైనా పొరపాటు చేసినా బాధపడను. దాని నుంచి నేర్చుకొని ముందుకు సాగుతా’’ అని శ్రేయస్ తెలిపాడు. 

గంభీర్‌ అద్భుతం.. స్టార్క్‌ కీలకం: శ్రేయస్

‘‘కోల్‌కతాను రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ఆటగాడు గౌతమ్ గంభీర్‌. ఇప్పుడు అతడితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. గతంలో మేమిద్దరం వేరే ఫ్రాంచైజీ కోసం వర్క్‌ చేశాం. కొత్త ఆలోచనలతో దూకుడైన ఆటను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాడు. అతడి వద్ద చాలా ప్లాన్స్‌ ఉంటాయి. ప్రాక్టీస్‌ సమయంలో అతడితో చాలా విషయాలపై చర్చించా. ఇక మా ప్రధాన కోచ్‌ చంద్రకాంత్ పండిత్ అనుభవం అమోఘం. వారిద్దరితో కలిసి ఆడటం వల్ల ఎంతో నేర్చుకోవచ్చు. మా టీమ్‌లోని ప్రతి ఆటగాడు మంచి ఫామ్‌లోనే ఉన్నారు. మిచెల్‌ స్టార్క్‌ రాకతో బౌలింగ్‌ మరింత బలోపేతమైంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అత్యుత్తమంగా బౌలింగ్‌ వేయగల సమర్థుడు స్టార్క్’’ అని శ్రేయస్ వ్యాఖ్యానించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు