KKR: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్.. అతడికి డిప్యూటీ ఎవరంటే?

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (Kolkata Knight Riders) జట్టు సారథ్య బాధ్యతలను మళ్లీ శ్రేయస్‌ అందుకున్నాడు.

Published : 14 Dec 2023 18:43 IST

ఇంటర్నెట్ డెస్క్: వెన్ను నొప్పి కారణంగా గత ఐపీఎల్‌ (IPL) సీజన్‌కు దూరమైన శ్రేయస్‌ అయ్యర్‌ను (Shreyas Iyer) కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) తమ కెప్టెన్‌గా నియమించింది. అతడికి డిప్యూటీగా నితీశ్ రాణా ప్రకటించింది. గత సీజన్‌లో శ్రేయస్‌ గైర్హాజరీలో నితీశ్‌ రాణా నాయకత్వంలో కేకేఆర్‌ బరిలోకి దిగింది. వచ్చే సీజన్‌ కోసం ఇప్పటికే మాజీ కెప్టెన్‌ గౌతమ్ గంభీర్‌ను (Gautam Gambhir) తమ మెంటార్‌గా మేనేజ్‌మెంట్ నియమించుకున్న సంగతి తెలిసిందే. 

‘‘దురదృష్టవశాత్తూ గత సీజన్‌లో గాయం కారణంగా శ్రేయస్‌ అయ్యర్‌ ఆడలేకపోయాడు. ఇప్పుడు ఫిట్‌నెస్‌తోపాటు ఫామ్‌ సాధించిన శ్రేయస్‌ తిరిగి జట్టుతోపాటు చేరాడు. అతడికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. గాయం నుంచి కోలుకోవడానికి అతడెంతో కష్టపడ్డాడు. ఇటీవల మెగా టోర్నీలోనూ మంచి ఫామ్‌తో అలరించాడు. కెప్టెన్సీని వదులుకొని శ్రేయస్‌ సారథ్యంలో పనిచేసేందుకు అంగీకరించిన నితీశ్ రాణాకు అభినందనలు. ఈ క్రమంలో అతడినే జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా నియమించాం. శ్రేయస్‌కు మద్దతుగా నిలుస్తూ జట్టును విజయపథంలో సాగేలా చూస్తాడని ఆశిస్తున్నాం’’ అని కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్ వెల్లడించారు. 

నితీశ్‌ అద్భుతంగా నడిపించాడు: శ్రేయస్‌

‘‘గత సీజన్‌లో మా జట్టుకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. గాయం కారణంగా నేను సీజన్‌కు దూరమయ్యా. నితీశ్ రాణా అద్భుతంగా జట్టును నడిపించాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా నాయకత్వంతోనూ రాణించాడు. అతడిని కేకేఆర్‌ వైస్‌ కెప్టెన్‌గా నియమించడం సంతోషంగా ఉంది. తప్పకుండా నాయకత్వ గ్రూప్‌ను బలోపేతం చేస్తుందని భావిస్తున్నా’’ అని శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు. బ్యాటర్‌గా నితీశ్‌‌ రాణా 14 మ్యాచుల్లో 413 పరుగులు సాధించాడు. అతడి కెప్టెన్సీలో ఆరు విజయాలు సాధించిన కోల్‌కతా పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. అంతకుముందు శ్రేయస్‌ నాయకత్వంలో 2022 సీజన్‌లోనూ ఏడో స్థానానికి పరిమితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని