IND vs ENG: మేమూ ‘మాహీ భాయ్‌’ను మిస్‌ అవుతున్నాం..: శుభ్‌మన్‌ గిల్

‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్‌ మామూలుగా ఉండదు.  రాంచీ వేదికగానే టెస్టు జరుగుతుండడంతో ఇప్పుడందరి కళ్లూ ధోనీ కోసం వెతుకుతూ ఉంటాయి. 

Published : 23 Feb 2024 20:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రాంచీ వేదికగా భారత్‌ - ఇంగ్లాండ్‌ (IND vs ENG) నాలుగో టెస్టు మ్యాచ్‌ జరుగుతోంది. ‘కెప్టెన్ కూల్‌’ ఎంఎస్ ధోనీ సొంత మైదానంలో ఆడుతుండటంతో ‘తలా’ను ఎప్పుడు స్క్రీన్‌పై చూస్తామా? అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో భారత ఆటగాడు శుభ్‌మన్‌ గిల్ మాట్లాడుతూ.. యావత్ క్రికెట్ భారత్‌ మాహీ భాయ్‌ను మిస్ అవుతుందని వ్యాఖ్యానించాడు. రాంచీ లేదా ఎక్కడ ఆడినా ధోనీ లేని లోటు కనిపిస్తుందని పేర్కొన్నాడు. దాదాపు నాలుగేళ్ల కిందట మాహీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐపీఎల్‌లోనే ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. 

‘‘భారత్‌ క్రికెట్ అభిమానులు ఎంఎస్ ధోనీ భాయ్‌ను మిస్‌ అవుతున్నారు. అందులో మేం కూడా ఉన్నాం. కేవలం రాంచీలోనే కాకుండా.. ప్రపంచంలోని మరే మైదానాల్లో ఆడినా ఫ్యాన్స్‌ ‘ధోనీ’ అంటూ కేరింతలు కొడతారు’’ అని వ్యాఖ్యానించాడు. 

ధోనీ ప్రాక్టీస్ షురూ..

మార్చి 22 నుంచి ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడనుంది. ఇప్పటికే ధోనీ తన ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తున్నాడు. గత ఐపీఎల్‌ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకున్న ధోనీ.. కొత్త సీజన్‌ కోసం ఉత్సాహంగా బరిలోకి దిగనున్నాడు. 

కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌పై ద్రవిడ్‌.. 

ఫిట్‌నెస్‌ లేని కారణంగా కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులోనూ ఆడలేదు. కేఎల్‌ ఫిట్‌నెస్‌పై ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకు అతడు ఎంతమేరకు ఫిట్‌గా ఉన్నాడనేది తెలియదు. పూర్తిస్థాయిలో మాత్రం ఫిట్‌నెస్‌ సాధించలేదనేదే తెలుసు. బీసీసీఐ వైద్యబృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది ’’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని