PV Sindhu: సెమీస్‌లో సింధు

సుదీర్ఘ విరామం తర్వాత తొలి సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ దిశగా సింధు కీలక అడుగు వేసింది.

Published : 25 May 2024 03:46 IST

మలేసియా మాస్టర్స్‌

కౌలాలంపూర్‌: సుదీర్ఘ విరామం తర్వాత తొలి సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ దిశగా సింధు కీలక అడుగు వేసింది. మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో టాప్‌సీడ్‌కు షాకిచ్చి సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్‌ సింధు 21-13, 14-21, 21-12 తేడాతో ఆరో ర్యాంకర్‌ హాన్‌ యూ (చైనా)ను మట్టికరిపించింది. తొలి గేమ్‌ ఆరంభంలో సింధుకు గట్టిపోటీ ఎదురైంది. స్కోరు 3-3తో సమమైంది. ఆ తర్వాత సింధు స్మాష్‌లు, డ్రాప్‌లతో చెలరేగిపోయి చూస్తుండగానే 11-5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. హాన్‌ పోరాడినా సింధు వదల్లేదు. వరుసగా అయిదు పాయింట్లతో సింధు తొలి గేమ్‌ ముగించింది. కానీ రెండో గేమ్‌లో సింధుకు పరాజయం తప్పలేదు. 5-0తో ఆధిపత్యం ప్రదర్శించిన హాన్‌ దూకుడుతో సాగిపోయింది. 15-2తో దూసుకెళ్లింది. ఆ తర్వాత గేమ్‌ గెలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం సింధు అసలు తగ్గలేదు. 11-3తో విరామానికి వెళ్లిన ఆమెకు ఎదురేలేకుండా పోయింది. ప్రత్యర్థికి కోలుకునేందుకు అసలేమాత్రం ఛాన్స్‌ ఇవ్వకుండా సింధు పని పూర్తిచేసింది. శనివారం సెమీస్‌లో బుసానన్‌ (థాయ్‌లాండ్‌)తో అయిదో సీడ్‌ సింధు తలపడుతోంది. మరోవైపు అష్మిత పోరాటం ముగిసింది. క్వార్టర్స్‌లో ఆమె 10-21, 15-21తో జాంగ్‌ యి మన్‌ (చైనా) చేతిలో ఓడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని