Siraj-Shreyas: ఈ ఇద్దరూ ఆడేస్తున్నారు.. ఇక టీమ్‌ఇండియాకు నో టెన్షన్‌

స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) అంచనాలను నిలబెట్టుకుంటూ.. కోట్లాది మంది భారత అభిమానుల ఆశలను నిలబెడుతూ.. టీమ్‌ఇండియా తిరుగులేని ఆధిపత్యంతో సాగుతోంది. వరుసగా ఏడు విజయాలతో ఈ టోర్నీలో సెమీస్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది.

Updated : 03 Nov 2023 14:11 IST

భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023).. టైటిల్‌ ఫేవరెట్‌గా టీమ్‌ఇండియా. ఆరు మ్యాచ్‌లు ముగిశాయి. ఆరు మ్యాచ్‌లూ గెలిచేశాం. సెమీస్‌కు దాదాపు చేరిపోయాం. ఇది శ్రీలంకతో పోరుకు ముందు భారత్‌ స్థితి. కానీ అంతా బాగానే ఉందని అనుకోవడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే జట్టులో ఇద్దరు కీలక ఆటగాళ్లు ఇంకా స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించకపోవడమే అందుకు కారణం. బ్యాటింగ్‌లో కీలకమైన మిడిలార్డర్‌లో ఆ ఆటగాడు.. బౌలింగ్‌లో ఈ పేసర్‌ తగిన ప్రదర్శన చేయలేకపోతున్నారనే ఆందోళన. కానీ శ్రీలంకతో మ్యాచ్‌ జట్టుకు భారీ విజయంతో పాటు సెమీస్‌ బెర్తు అందించడమే కాకుండా జట్టు ఆందోళనలను తీర్చేసింది. లంకపై ఆ ఇద్దరు ఆటగాళ్లు అదరగొట్టారు. ఫామ్‌ అందుకుంటూ అద్భుత ప్రదర్శనతో సాగారు. ఆ ఇద్దరే శ్రేయస్‌ అయ్యర్, మహమ్మద్‌ సిరాజ్‌. ఈ ఇద్దరూ రాణించడంతో ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు ఇక నో టెన్షన్‌! 

స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో అంచనాలను నిలబెట్టుకుంటూ.. కోట్లాది మంది భారత అభిమానుల ఆశలను నిలబెడుతూ.. టీమ్‌ఇండియా తిరుగులేని ఆధిపత్యంతో సాగుతోంది. వరుసగా ఏడు విజయాలతో ఈ టోర్నీలో సెమీస్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇక కప్పు కలను నెరవేర్చుకోవడానికి.. 12 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికి మూడోసారి వన్డే విశ్వ విజేతగా నిలిచేందుకు రోహిత్‌ సేన మరో రెండు అడుగుల దూరంలోనే ఉంది. ఎలాగో సెమీస్‌ చేరిన జట్టు.. కీలకమైన నాకౌట్‌ సమరంలో ఇదే ఆధిపత్యం కొనసాగించి నవంబర్‌ 19న ప్రపంచంలోనే పెద్దదైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సగర్వంగా కప్పును ముద్దాడాలన్నది ప్రతి ఒక్క భారతీయుడి ఆకాంక్ష. ఆ దిశగా సాగుతున్న జట్టుకు ఇప్పుడు ఏ ఇబ్బంది ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు వరకూ శ్రేయస్, సిరాజ్‌ ఫామ్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ ఇద్దరి ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. జట్టులో నుంచి వీళ్లను తప్పించాలనే వాదనలూ వినిపించాయి. కానీ లంకపై రెచ్చిపోయిన ఈ ఇద్దరూ.. తమ ఆటతీరుతోనే విమర్శలకు బదులిచ్చారు. 

సిరాజ్‌ జోరు..

టీమ్‌ఇండియాలో ఇటీవల కాలంలో నిలకడగా రాణిస్తున్న పేసర్‌ సిరాజ్‌. కచ్చితమైన లైన్, లెంగ్త్‌తో సరైన ప్రదేశాల్లో బంతులు వేస్తూ ఈ హైదరాబాద్‌ బౌలర్‌ దెబ్బకొడుతున్నాడు. కొత్తబంతితో ఆరంభంలో జట్టుకు వికెట్లు అందిస్తూ భారత విజయానికి బాటలు వేస్తున్నాడు. అందుకే ప్రపంచకప్‌లోనూ చోటు దక్కించుకున్నాడు. అతని ఫామ్, నైపుణ్యాలు తెలుసు కాబట్టే సీనియర్‌ పేసర్‌ షమిని కాదని బుమ్రాతో పాటు సిరాజ్‌ను ఆడిస్తూ వచ్చారు. కానీ సిరాజ్‌ అంచనాలను అందుకోలేకపోయాడు. తొలి ఆరు మ్యాచ్‌ల్లో వరుసగా 1/26, 0/76, 2/50, 2/60, 1/45, 0/33 గణాంకాలు మాత్రమే నమోదు చేశాడు. ఆరు వికెట్లే తీసుకున్నాడు. దీంతో ఆలస్యంగా జట్టులోకి వచ్చిన షమి విజృంభిస్తుండటంతో సిరాజ్‌కు జట్టులో చోటు కూడా ప్రశ్నార్థకంగానే మారింది. గాయం నుంచి హార్దిక్‌ కోలుకుని వస్తే అప్పుడు సిరాజ్‌ను తప్పించాలనే వాదనలు వినిపించాయి. కానీ లంకపై సిరాజ్‌ మూడు వికెట్లతో చెలరేగాడు. ఈ ప్రత్యర్థితో మ్యాచ్‌ అంటే చాలు వికెట్ల వేటలో దూసుకెళ్లే అతను మరోసారి అదే మాయ చేశాడు. బ్యాటర్లు ఆడలేని విధంగా బంతులేసి, ప్రతి బంతికి వికెట్‌ పడగొట్టేలా కనిపించి తిరిగి లయ అందుకున్నాడు. ముఖ్యంగా కుశాల్‌ మెండిస్‌ను బౌల్డ్‌ చేసిన తీరైతే హైలైట్‌ అని చెప్పొచ్చు. 

శ్రేయస్‌ హోరు..

ఇక వెన్నెముక శస్త్రచికిత్స కారణంగా దాదాపు ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. పునరాగమనంలో అతను జోరందుకోవడానికి సమయం పట్టింది. ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న అతణ్ని మరో స్వల్ప గాయం వేధించింది. దీని నుంచి బయటపడి ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన శ్రేయస్‌ తొలి మ్యాచ్‌ (ఆస్ట్రేలియా)లోనే డకౌటయ్యాడు. అఫ్గానిస్థాన్‌ (25 నాటౌట్‌), పాకిస్థాన్‌ (53 నాటౌట్‌) మీద ఛేదనలో చివరివరకూ నిలబడటంతో ఫామ్‌ అందుకున్నట్లే కనిపించాడు. కానీ షార్ట్‌పిచ్‌ బంతులకు తడబడే బలహీనత కారణంగా బంగ్లాదేశ్‌ (19), న్యూజిలాండ్‌ (33), ఇంగ్లాండ్‌ (4)తో మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. జట్టుకు అవసరమైన సమయంలోనూ వికెట్‌ పారేసుకుని పెవిలియన్‌ చేరాడు. దీంతో శ్రేయస్‌ స్థానంపైనా సందేహాలు రేకెత్తాయి. ఇప్పుడున్న జట్టులో హార్దిక్‌ వస్తే సూర్యను బయట కూర్చోబెట్టే పరిస్థితులున్నాయి. కానీ ఫామ్‌లేమి కారణంగా శ్రేయస్‌పై వేటు వేసి సూర్యను కొనసాగించాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో లంకపై శ్రేయస్‌ జూలు విదిల్చాడు. స్వల్ప వ్యవధిలో శుభ్‌మన్, కోహ్లి.. ఆ తర్వాత రాహుల్, సూర్య ఔటైన సమయంలో శ్రేయస్‌ నిలబడ్డాడు. భారీ షాట్లతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఓ దశలో 300కే పరిమితమయ్యేలా కనిపించిన జట్టు 350కి పైగా పరుగులు చేసిందంటే అందుకు కారణం శ్రేయస్‌. సెంచరీ దిశగా సాగిన అతను 82 పరుగుల వద్ద ఔటయ్యాడు. శతకం సాధించలేకపోయినా ఆత్మవిశ్వాసం పెరిగేలా మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు