Siraj vs SriLanka : లంక అంటే చాలు సిరాజ్‌కు పూనకాలే..

శ్రీలంకపై సిరాజ్‌(Mohammed Siraj) అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. తన పదునైన బంతులతో ఆ జట్టు బ్యాటర్లను వణికిస్తున్నాడు. 

Updated : 03 Nov 2023 11:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : శ్రీలంక(SriLanka) అంటే చాలు మన సిరాజ్‌ మియా (Mohammed Siraj) రెచ్చిపోతాడు. ఎక్కడాలేని ఉత్సాహం వస్తోంది. ఆ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ వెన్ను విరుస్తాడు. దీంతో ఆ జట్టు బ్యాటర్లకు అతడో పీడకలగా మారిపోయాడు. ఈ ప్రపంచకప్‌(odi world cup 2023)లో అప్పటి వరకూ పెద్దగా ప్రభావం చూపని సిరాజ్‌.. లంక (IND vs SL)తో మ్యాచ్‌ అనగానే ఒక్కసారిగా తన ప్రతాపం చూపించాడు. అతడు నిప్పులు చెరిగే బంతులతో చెలరేగుతుంటే.. మరోసారి ఆసియా కప్‌ ఫైనలే (asia cup final 2023) గుర్తుకువచ్చింది.

బంతులతోనే సమాధానమిస్తూ..

అప్పటి వరకూ ఆడిన మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపించడం లేదన్న విమర్శలు సిరాజ్‌పై వెల్లువెత్తాయి. గాయం బారిన పడి జట్టుకు దూరమైన హార్దిక్‌ జట్టులోకి తిరిగి వస్తే.. సిరాజ్‌ను ఆడిస్తారో లేదో అనే అనుమానాలు. అయితే, వీటన్నింటిని పటాపంచలు చేస్తూ ఈ హైదరాబాద్‌ మియాభాయ్‌ లంకపై రెచ్చిపోయాడు. తాను వేసిన తొలి ఓవర్‌ తొలి బంతికే ఓపెనర్‌ కరుణరత్నే వికెట్‌ తీశాడు. అదే ఓవర్‌ ఐదో బంతికి సమర విక్రమను పెవిలియన్‌ చేర్చాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్‌ తొలి బంతికి కెప్టెన్‌ కుశాల్‌ మెండీస్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ ప్రదర్శన చూస్తే.. ఆసియా కప్‌ ఫైనలే అందరికీ గుర్తుకువచ్చింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 7 ఓవర్లు వేసిన సిరాజ్‌.. 16 పరుగులే ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు రాబట్టాడు.  ఇక ఆ తర్వాత వచ్చిన షమీ.. లంక పతనాన్ని శాసించాడు.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లను దెబ్బతీయడానికి సిరాజ్‌ అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలను వాడటంలో ఏమాత్రం జాలి చూపించలేదు. లంక బ్యాటర్‌ అసలంక వికెట్ల వద్ద కుదురుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్న సమయంలో అతడి ఏకాగ్రత దెబ్బతీయడమే లక్ష్యంగా ఒక దశలో నోటికి పని చెప్పాడు. కానీ, జట్టు బ్యాటింగ్‌ పరిస్థితి అర్థం చేసుకొన్న అసలంక దీనికి కేవలం నవ్వుతూనే ప్రతిస్పందించాడు.

ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి..

సిరాజ్‌ అంటే లంక బ్యాటర్లకు ఓ పీడకల. ఎందుకంటే.. ఆసియాకప్‌ ఫైనల్‌ చేరిన ఆ జట్టును పేకమేడలా కుప్పకూల్చాడు. శ్రీలంక vs సిరాజ్‌ అన్నట్లుగా సాగిన ఆ ఫైనల్‌ పోరులో ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గానూ అవతరించాడు. దీంతో అప్పట్లో 50 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. సిరాజ్‌ ఈ మ్యాచ్‌లో మొత్తం 7 ఓవర్లు వేసి 21 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు.

తిరువనంతపురం వన్డేలోనూ..

జనవరిలో తిరువనంతపురం వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్లకు 390 పరుగులు చేస్తే.. లంక 73 పరుగులకే కుప్పకూలింది. ఆ మ్యాచ్‌లో 4 వికెట్లతో లంక పతనాన్ని సిరాజ్‌ శాసించాడు. 

ఇక ఈ ప్రపంచకప్‌లో అప్పటి వరకూ ఆడిన 6 మ్యాచ్‌ల్లో మొత్తం 6 వికెట్లే పడగొడితే.. లంకతో మ్యాచ్‌లోనే 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో శ్రీలంకపై సిరాజ్‌ ప్రదర్శన ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని