World Cup: ప్రపంచకప్ ప్రకంపనలు.. మెగా టోర్నీలో ఘోర వైఫల్యంతో జట్లకు కష్టాలు

ఈ వన్డే ప్రపంచకప్‌లో ఫేవరెట్‌లుగా బరిలోకి దిగిన కొన్ని జట్లు దారుణ ప్రదర్శన చేశాయి. పసికూనల చేతిలో ఓడిపోయాయి. దీంతో రానున్న రోజుల్లో పలు జట్లలో పెను మార్పులు జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే శ్రీలంక క్రికెట్‌ బోర్డును ఆ దేశం రద్దు చేయగా, ఐసీసీ శ్రీలంకపై నిషేధం విధించింది.  

Updated : 14 Nov 2023 13:03 IST

వన్డే ప్రపంచకప్.. క్రికెట్లో అత్యున్నత టోర్నీ. టెస్టుల్లో ప్రపంచ ఛాంపియన్‌షిప్, టీ20ల్లో ప్రపంచకప్ ఉన్నప్పటికీ.. వన్డే ప్రపంచకప్‌నకు ఉన్న విలువ వేరు. ప్రతి క్రికెటర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ టోర్నీకి ఘన చరిత్ర ఉంది. గత కొన్నేళ్లలో వన్డేల ప్రాధాన్యం తగ్గినా.. ప్రపంచకప్‌ను మాత్రం ఇప్పటికీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఇందులో మెరుగైన ప్రదర్శన చేసి కప్పు గెలిచే జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పడతారు. కప్పు గెలవకపోయినా ప్రదర్శన బాగుంటే వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. కానీ ఇక్కడ పేలవ ప్రదర్శన చేస్తే మాత్రం అభిమానుల నుంచి తీవ్ర ఆగ్రహం ఎదుర్కోక తప్పదు. దాంతోపాటే తమ బోర్డుల నుంచి చర్యలూ ఎదుర్కోవాల్సిందే. ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత జట్ల ముఖచిత్రాలు మారిపోయిన సందర్భాలు చరిత్రలో చాలానే ఉన్నాయి.

2007 ప్రపంచకప్‌లో ఏం జరిగిందో గుర్తుందా? భారత జట్టు పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్ లాంటి దిగ్గజాలతో కూడిన జట్టు అంత ఘోరమైన ప్రదర్శన చేయడం అనూహ్యం. ఆ ప్రభావం భారత క్రికెట్ మీద బాగానే పడింది. టోర్నీ అవ్వగానే ద్రవిడ్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇంకొన్ని నెలల్లో జరిగిన టీ20 ప్రపంచకప్ నుంచి సచిన్, ద్రవిడ్ లాంటి సీనియర్లు తప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కోచింగ్ సిబ్బంది మొత్తం మారిపోయారు. అదే టోర్నీలో పాకిస్థాన్ కూడా గ్రూప్ దశలోనే నిష్క్రమించగా.. ఆ జట్టులో చాలా మార్పులు జరిగాయి. 2015లో ఇంగ్లాండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించగా.. జట్టు మొత్తాన్ని మార్చేసింది ఇంగ్లాండ్ బోర్డు. ప్రస్తుత ప్రపంచకప్‌లో కొన్ని జట్ల ప్రదర్శన తాలూకు ప్రభావం టోర్నీ ముగియక ముందే మొదలైపోయింది.

బోర్డే రద్దయిపోయింది

ఈ ప్రపంచకప్‌లో లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏడు ఓడిపోయింది శ్రీలంక. ఈసారి ఆ జట్టు సెమీస్ చేరుతుందన్న అంచనాలేమీ లేవు కానీ.. ఆసియా కప్, అంతకుముందు ప్రదర్శన బాగుండటంతో పెద్ద జట్లకు కొన్ని షాకులివ్వగలదేమో అనుకున్నారు. కానీ ఆ జట్టు తన కంటే స్థాయిలో తక్కువ అయిన అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ల చేతుల్లోనూ ఓడిపోయింది. ఆ జట్టును గాయాలు దెబ్బ తీసినా సరే.. ఇంత పేలవ ప్రదర్శన చేయడం ఆశ్చర్యకరం. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డునే మొత్తంగా రద్దు చేసి పడేసింది శ్రీలంక ప్రభుత్వం. జట్టులోనూ పలు మార్పులు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఐతే ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం బోర్డును రద్దు చేయడం లంక క్రికెట్లో సంక్షోభానికి దారి తీసింది. దీంతో శ్రీలంక మీద నిషేధం విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెట్ బోర్డుకు సంబంధించిన నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. ఏదైనా ఎన్నికల ప్రక్రియను అనుసరించి జరగాలి. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం బోర్డును రద్దు చేయడంతో ఇప్పుడు నిషేధం ఎదుర్కొంటోంది లంక క్రికెట్. ఇదంతా ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన ఫలితమే.

కత్తి వేలాడుతోంది

ప్రపంచకప్‌ పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఇంకో మూడు జట్లలో మార్పులు చూడబోతున్నాం. బంగ్లాదేశ్ జట్టుకు సంబంధించి ఇప్పటికే బౌలింగ్ కోచ్ అలెన్ డొనాల్డ్ తన పదవికి రాజీనామా చేశాడు. టోర్నీలో ఆ జట్టు కూడా రెండే విజయాలు సాధించింది. పసికూన నెదర్లాండ్స్ చేతిలోనూ పరాజయం చవిచూసింది. ఆ జట్టు కెప్టెన్ షకిబ్ అల్‌హసన్ మీదే వేటు పడటం లాంఛనమే అంటున్నారు. వ్యక్తిగతంగా అతడి ప్రదర్శన బాగా లేదు. కెప్టెన్సీలోనూ విఫలమయ్యాడు. దీనికి తోడు మాథ్యూస్ టైమ్డ్ ఔట్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అతను రాజీనామా చేయడమో, లేదంటే బోర్డే తప్పించడమో గ్యారెంటీ అంటున్నారు.

ఇక డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి టోర్నీ చరిత్రలోనే అత్యంత పేలవ ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్ జట్టుపై కఠిన చర్యలు తప్పవంటున్నారు. బట్లర్ కెప్టెన్సీకి రాజీనామా చేయడం లాంఛనమేనట. జట్టులో మరిన్ని మార్పులుంటాయని.. కోచింగ్ సిబ్బంది కూడా తప్పుకోనున్నారని ఇంగ్లాండ్ మీడియాలో ఇప్పటికే చర్చ నడుస్తోంది. భారత్‌కు కనీస పోటీ ఇవ్వకుండా చిత్తుగా ఓడిపోవడం, అఫ్గానిస్థాన్ చేతిలో షాక్ తిని సెమీస్‌కు దూరమైన పాకిస్థాన్ జట్టుపై స్వదేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేయడం, జట్టులో మార్పులు చోటు చేసుకోవడం పాక్ క్రికెట్లో కొత్త కాదు. ప్రస్తుత టోర్నీ తర్వాత బాబర్ అజామ్ కెప్టెన్‌గా తప్పుకోనున్నాడట. కోచ్ మికీ ఆర్థర్ కూడా తన బాధ్యతలకు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. లీగ్ దశ ముగిసిన వారం రోజుల్లోపు ఈ విఫల జట్లకు సంబంధించి మార్పులు చేర్పులకు సంబంధించి చాలా నిర్ణయాలే వెలువడబోతున్నట్లు తెలుస్తోంది.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని