Team India: అది మాత్రం ప్రాక్టికల్‌గా వర్కౌట్‌ కాదు..: సౌరభ్‌ గంగూలీ

ఆటగాళ్లపై వర్క్‌లోడ్‌ను తగ్గించేలా బీసీసీఐ చర్యలు తీసుకోవాలనే సూచనలపై సౌరభ్‌ గంగూలీ స్పందించాడు. అలాగే వెస్టిండీస్‌ పర్యటనకు యశస్వి ఎంపిక నిర్ణయంపై మాట్లాడాడు.

Published : 30 Jun 2023 15:15 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC Final 2023) ఫైనల్‌ ముగిసి దాదాపు ఇరవై రోజులు కావొస్తోంది. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాకు పరాభవం ఎదురైంది. ఐపీఎల్‌ ప్రభావంతోనే భారత్‌ ఓడిందనే విమర్శ కూడా ఉంది. దీంతో, ఆటగాళ్లపై పనిభారం తగ్గించేలా ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ చర్చలు జరపాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచనలు చేశారు. అయితే, ఇలాంటివి ప్రాక్టికల్‌గా చాలా కష్టమని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ వ్యాఖ్యానించాడు. 

‘‘ఇలాంటి థియరీని నేను అంగీకరించను. ఎందుకంటే గత ఐపీఎల్‌లో ఆడిన అజింక్య రహానె కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడాడు. దానిలో కీలక ఇన్నింగ్స్‌లతో రాణించి మెప్పించాడు. కాబట్టి, వర్క్‌లోడ్‌ అనే థియరీని నమ్మను. ఆసీస్‌లోనూ కొందరు ఐపీఎల్‌లో ఆడి నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ఇంగ్లాండ్‌ వచ్చారు. కామెరూన్‌ గ్రీన్, డేవిడ్ వార్నర్ రెండింట్లోనూ ఆడారు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత కొంత సమయం కూడా ఉంది. టెస్టు ఫార్మాట్‌లోకి మారేందుకు తగినంత సమయం ఉందనేది నా భావన. గతంలోనూ ఇలా జరిగిన సందర్భాలున్నాయి. వన్డే లేదా టెస్టు క్రికెట్‌ ఆడినా పెద్దగా మార్పులు ఉండవు. కాబట్టే, ఇదేమీ పెద్ద సమస్య కాదు. ఐపీఎల్ ఆడి వచ్చినా సరే బ్యాటర్ త్వరగా తన టెక్నిక్‌, దూకుడును అడ్జస్ట్‌ చేసుకోగలిగితే టెస్టు మ్యాచ్‌లోనూ రాణించేందుకు ఎక్కువ అవకాశం లభిస్తుంది’’ అని గంగూలీ తెలిపాడు. 

యశస్విని ఎంపిక చేయడం బాగుంది

వెస్టిండీస్‌ పర్యటన కోసం ప్రకటించిన జట్టులో భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కింది. అయితే, సర్ఫరాజ్‌ ఖాన్‌తోపాటు అభిమన్యు ఈశ్వరన్‌ను తీసుకోకపోవడంపై గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘రంజీ, ఇరానీ, దులీప్‌ ట్రోఫీల్లో యశస్వి అద్భుతంగా రాణించాడు. అతడిని ఎంపిక చేయడం మంచి నిర్ణయం. అయితే, సర్ఫరాజ్‌ ఖాన్‌తోపాటు ఈశ్వరన్‌కు కూడా అవకాశం ఇస్తే బాగుండేది. గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో వారు పరుగుల వరద పారించారు’’ అని వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని