Rohit - Dravid: అలా చేయమని చెప్పడానికి మీరెవరు?: సౌరభ్‌ గంగూలీ

ఆసీస్‌ చేతిలో డబ్ల్యూటీసీ ఫైనల్‌(WTC Final) ఓటమి తర్వాత భారత ప్రధాన కోచ్, కెప్టెన్‌ కొనసాగింపుపై చర్చకు తెరలేసింది.

Updated : 14 Jun 2023 14:28 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final)లో ఘోర ఓటమితో టీమ్‌ఇండియాపై సర్వత్రా విమర్శలు రేగాయి. రెండో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా టెస్టు ‘గద’ను దక్కించుకొంది. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ ద్వయం కొనసాగింపుపై సందేహం నెలకొంది. వీరి కాంబినేషన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రావడం మినహా.. గొప్పగా సాధించిందేమీ లేదనే అభిప్రాయం ఉంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌, ఆసియా కప్‌ టోర్నీల్లో టీమ్‌ఇండియా ఓటమి చవిచూసింది. దీంతోవారిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లూ సోషల్‌ మీడియాలో తలెత్తాయి. విపరీతంగా ట్రోలింగ్‌ చేస్తూ మీమ్స్‌ వచ్చాయి. దీనిపై టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పందించాడు. ఆ బాధ్యత చూసుకోవడానికి సెలెక్టర్లు ఉన్నారని, మార్పులు చేసే పని వారిదేనని పేర్కొన్నాడు. 

‘‘జట్టుకు సంబంధించి ఏవైనా మార్పులు చేయాలంటే ఆ బాధ్యత సెలెక్టర్లదే. అందులో సోషల్‌ మీడియా ఎలా ప్రభావితం చేస్తుంది..? రెండేళ్ల కిందట విరాట్ కోహ్లీ కూడా టెస్టు కెప్టెన్సీ వద్దనుకోని దిగిపోయాడు. ఇప్పుడు భారత కెప్టెన్‌, కోచ్‌గా ఎవరు ఉంటే బాగుంటుందని నన్ను అడుగుతారు? కానీ,  రోహిత్, రాహుల్‌ ద్రవిడ్‌ తమ బాధ్యతలను సరిగ్గానే నిర్వర్తిస్తున్నారని అనుకుంటున్నా. వచ్చే ప్రపంచ కప్‌ వరకు వీరి కాంబినేషన్‌ను కొనసాగించాలి. ప్రపంచ కప్‌ తర్వాత రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో నాకైతే తెలియదు. ఇప్పుడైతే వీరిద్దరు అత్యుత్తమమే అనిపిస్తోంది. భవిష్యత్తులో మంచి విజయాలు నమోదు చేయాలని ఆశిస్తున్నా. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ రెండో రోజు ఆట సందర్భంగా మహ్మద్ సిరాజ్‌ ఆసీస్‌ బ్యాటర్‌ స్టీవ్ స్మిత్‌ వైపుగా బంతిని విసిరాడు. అప్పటి నుంచే భారత బౌలింగ్‌ కాస్త గతి తప్పింది. అప్పటి వరకు పదునైన బౌలింగ్‌ వేసిన భారత్‌ ఆ తర్వాత వెనుకబడిపోయింది’’ అని గంగూలీ తెలిపాడు. 

ఫీల్డింగ్‌ కూడా ఓ కారణమే: కైఫ్‌

‘‘భారత్‌ ఓడిపోవడంలో బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌ వైఫల్యం కూడా ప్రధాన కారణమే. ఆసీస్‌ బ్యాటర్లు ఇచ్చిన అవకాశాలను వదిలేయడంతో భారీ మూల్యం చెల్లించుకోకతప్పలేదు. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో విలువైన పరుగులు చేసిన అలెక్స్‌ కేరీ వికెట్‌ను దక్కించుకొనే అవకాశం భారత్‌కు చేజారింది. స్లిప్‌లో అలెర్ట్‌గా ఉండాల్సిన పుజారా, కోహ్లీ వదిలేయడం ఆశ్చర్యంగానూ ఉంది. అలాగే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన స్మిత్‌ కొట్టిన బంతి స్లిప్‌లోని కోహ్లీకి కాస్త ముందుగా పడింది. ఒకవేళ అది అందుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో’’ అని మహ్మద్‌ కైఫ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని