Sourav Ganguly: టీ20ల్లో వీరిద్దరు ఎందుకు ఆడటం లేదు?: గంగూలీ

సీనియర్లు విరాట్, రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలోనూ ఆడాలని క్రికెట్ దిగ్గజం సౌరభ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో వారిని పక్కన పెట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు.

Published : 08 Jul 2023 13:28 IST

ఇంటర్నెట్ డెస్క్: గతేడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత నుంచి ఇప్పటి వరకు టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్‌లో ఆడలేదు. విండీస్‌తో టీ20 సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులోనూ స్థానం కల్పించలేదు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం (T20 World Cup 2024) హార్దిక్‌ పాండ్య నాయకత్వంలో కుర్రాళ్లను తీర్చిదిద్దేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎందుకు పక్కన పెట్టారనేది బీసీసీఐ లేదా సెలక్టర్లు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ స్పందించాడు. విరాట్, రోహిత్ ఇద్దరూ టీ20 జట్టులోనూ ఉండాలని సూచించాడు. 

‘‘ఎల్లవేళలా మంచి జట్టునే ఎంపిక చేసుకోవాలి. అందులో ఎవరనేది సెలక్టర్లు చూసుకుంటారు. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. వారు ఎందుకు ఆడటం లేదనే విషయం తెలియడం లేదు. ఐపీఎల్‌లో కోహ్లీ మంచి ఫామ్‌తోనే ఆడాడు. అందుకే, ఇద్దరినీ టీ20ల్లోకి తీసుకోవాలి. సీనియర్లు ఉండటం వల్ల జట్టులోని యంగ్‌ ప్లేయర్లకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.

విండీస్‌తో సిరీస్‌కు రింకు సింగ్, రుతురాజ్‌ గైక్వాడ్‌, జితేశ్‌ శర్మను ఎంపిక చేయలేదు. వారికి అవకాశం రాకపోయినా యశస్వి, తిలక్‌ వర్మ వంటి యువకులకే ఛాన్స్‌ వచ్చింది. కాబట్టి అవకాశం అనేది తప్పకుండా వస్తుంది. అప్పటి వరకు ఆడుతూనే ఉండాలి. నేర్చుకుంటూ ముందుకు సాగాలి. నిలకడైన ప్రదర్శన ఇస్తూ ఉంటే జట్టులోకి రావడం ఖాయం. ఎప్పుడైనా 15 మందినే తీసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ 11 మందే ఆడతారు. కొంతమందిని పక్కన పెట్టాలి. అయితే, తప్పకుండా అందరికీ అవకాశాలు వస్తాయనే నమ్మకం నాకుంది’’ అని గంగూలీ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని