Team India: అతడు టెస్టులు ఆడాలి.. నా విన్నపం వింటాడని ఆశిస్తున్నా: సౌరభ్‌ గంగూలీ

విండీస్‌తో టెస్టు సిరీస్‌ నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (2023-2025) మూడో సీజన్‌ మొదలు కానుంది. ఈ క్రమంలో యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించాలని భారత మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ సూచించాడు. ఇదే క్రమంలో సీనియర్‌ పేస్ ఆల్‌రౌండర్‌కూ ఓ విజ్ఞప్తి చేశాడు. 

Updated : 15 Jun 2023 16:10 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC Final 2023) ఓడిపోయింది. ఈ క్రమంలో మాజీలు విమర్శలు, సలహాలు ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) కూడా పలు సూచనలు చేశాడు. కొంతమంది వెటరన్‌ ప్లేయర్లు కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. అలాగే భారత పేస్‌ ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్యకు (Hardik Pandya) ఓ విన్నపం చేశాడు. తప్పకుండా టెస్టు క్రికెట్‌ ఆడటం మళ్లీ మొదలు పెట్టాలని సూచించాడు. జులై 12 నుంచి విండీస్‌తో టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఈ క్రమంలో యువకులకు అవకాశం ఇవ్వాలని గంగూలీ పేర్కొన్నాడు. 

‘‘కేవలం ఒక్క ఓటమితో టీమ్‌ఇండియా క్రికెట్‌ను తక్కువగా అంచనా వేయకూడదు. మన దగ్గర అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నారు. ఇప్పటికిప్పుడే విరాట్, పుజారాను పక్కన పెట్టేయాలని చెప్పను. ఎందుకంటే విరాట్‌కు ఇంకా 34 ఏళ్లే. అయితే, యువకులకు దారి ఇవ్వాల్సిన బాధ్యత వారిదే. రిజర్వ్‌ బెంచ్‌పై నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. ఇది కేవలం ఐపీఎల్‌ ప్రదర్శనను పరిగణలోకి తీసుకోవడం లేదు. టెస్టు క్రికెట్‌ పూర్తిగా విభిన్నమైంది. యశస్వి జైస్వాల్, రజత్ పటీదార్, అభిమన్యు ఈశ్వరన్‌, రుతురాజ్‌ .. ఇలా యంగ్‌ డైనమిక్‌ ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య నా మాటలు వింటాడని అనుకుంటున్నా. తప్పకుండా అతడు మళ్లీ టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టాలి. ఇలాంటి పరిస్థితుల్లో అతడి అవసరం చాలా ఉంది’’ అని గంగూలీ తెలిపాడు. 

హార్దిక్‌ పాండ్య చివరిసారిగా 2018లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో ఆడాడు. ఆ తర్వాత వెన్ను నొప్పి కారణంగా కొన్నాళ్లు క్రికెట్‌కు దూరమై.. తిరిగి వచ్చిన తర్వాత వన్డేలు, టీ20లకే పరిమితమయ్యాడు. ఇప్పటి వరకు 11 టెస్టులు ఆడిన హార్దిక్‌ 532 పరుగులు చేసి, 17 వికెట్లు తీశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని