Asia Cup 2023: భారత్ X పాక్‌ మ్యాచ్‌లో ఎవరూ ఫేవరేట్‌ కాదు.. సిరాజ్‌ ఆడాల్సిందే!

వన్డే సంగ్రామం ముందు సన్నాహకంగా మినీ టోర్నీ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఆసియా కప్‌ (Asia Cup 2023) కోసం ఆరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.

Published : 25 Aug 2023 19:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) మినీ టోర్నీలో ఎవరూ ఫేవరేట్‌ కాదని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ (Ganguly) వ్యాఖ్యానించాడు. దాయాదుల పోరులోనూ ఎవరు అత్యుత్తమంగా బ్యాటింగ్‌ చేస్తారో.. వారిదే విజయమని స్పష్టం చేశాడు. భారత్ - పాకిస్థాన్‌ జట్ల (IND vs PAK) మధ్య సెప్టెబంబర్ 2న మ్యాచ్‌ జరగనుంది. దీంతో ఇప్పుడదే హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఆసియా కప్‌ను ఎవరు నెగ్గుతారనే అంశంపై గంగూలీ స్పందించాడు.  

Team India: ఇటు ముంబయివాలా.. అటు గుజరాతీ

‘‘ఆసియా కప్‌లో ఫేవరేట్‌ ఎవరని చెప్పడం కష్టంగానే ఉంది. ఎవరైనా గెలిచే అవకాశం ఉంది. భారత్, పాకిస్థాన్‌ జట్లు అద్భుతంగా ఉన్నాయి. బుమ్రా అందుబాటులోకి రావడం టీమ్‌ఇండియాకు అదనపు బలం. టీ20ల్లో తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. అయితే, ఆసియా కప్‌ వన్డే ఫార్మాట్‌ కావడంతో ఎలా బౌలింగ్‌ చేస్తాడనేది వేచి చూడాలి. సెలెక్షన్ కమిటీ ఉత్తమ జట్టునే ఎంపిక చేసిందని భావిస్తున్నా. ఉపఖండ పిచ్‌లపై ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం మంచిదే. అందుకోసం బ్యాటింగ్‌ కూడా చేయగలిగే అక్షర్ పటేల్ ఎంపిక సరైందే. ఆసియా కప్‌ అయినా, ప్రపంచకప్ అయినా బ్యాటింగ్‌ ఆర్డర్‌ రాణిస్తే విజయం సాధించడం సులువు. రెండు విభిన్న టోర్నీలు అయినా ఆడే విధానం మెరుగుపర్చుకుంటూ వెళ్లాలి’’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. 


తుది జట్టులో వారి కంటే సిరాజ్‌ బెటర్: ఆకాశ్ చోప్రా

వరల్డ్‌ కప్‌ తుది జట్టులో పేసర్ మహమ్మద్ సిరాజ్‌ తప్పకుండా ఉండాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా తెలిపాడు. వన్డేల్లో అద్భుతమైన గణాంకాలు అతడి సొంతమని పేర్కొన్నాడు. ఆసియా కప్‌లోనూ కీలకమవుతాడని వ్యాఖ్యానించాడు. ‘‘మహమ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌ విధానం అద్భుతం. తక్కువ కెరీర్‌లోనే 24 మ్యాచుల్లో 43 వికెట్లు తీశాడు. ఎకానమీ కూడా 4.78. బుమ్రా, షమీ కంటే కూడా గణాంకాల్లో ఎంతో మెరుగైన బౌలర్. అందుకే ఆసియా కంటే ఇతర దేశాల మీద అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఆల్‌రౌండర్‌గా శార్దూల్‌ ఠాకూర్‌ను లేదా యువ పేసర్ ప్రసిధ్ కృష్ణను ఆడించాలని చాలామంది చెబుతుంటారు. కానీ, వారిద్దరి కంటే సిరాజ్ తుది జట్టులో ఉండాల్సిందే. అతడితో మ్యాచ్‌లను ఆడించాలి’’ అని చోప్రా విశ్లేషించాడు.


నేటి నుంచి ప్రపంచకప్‌ టికెట్ల విక్రయం ప్రారంభం

ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచకప్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్ల విక్రయాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 25న రాత్రి 8 గంటల నుంచి బుక్‌మై షో ద్వారా టికెట్లను దక్కించుకోవచ్చు. అయితే, భారత్ ఆడే వార్మప్‌, టోర్నీ మ్యాచ్‌లు మినహా ఇతర దేశాల గేమ్‌లకు సంబంధించిన టికెట్లను పొందవచ్చు. భారత్ ఆడే మ్యాచ్‌లు ఆగస్ట్ 30, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 3 నుంచి టికెట్ల విక్రయం జరగనుంది. సెప్టెంబర్ 15 నుంచి రెండు సెమీస్‌లు, ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్ల అమ్మకాలు ఉంటాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా సంగ్రామం జరగనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని