IPL 2024: రూ.10 కోట్లైనా వెచ్చిస్తామని గంగూలీ ప్రామిస్‌ చేశారు: కుమార్ కుశాగ్రా తండ్రి

కుమార్‌ కుశాగ్రా (Kumar Kushagra).. ఎంఎస్ ధోనీ వంటి మెరుపు వికెట్‌ కీపింగ్‌ చేస్తాడని దేశవాళీ క్రికెట్‌లో పేరు సంపాదించాడు. అదే అతడిని ఐపీఎల్‌ వేలంలో భారీ ధరను సొంతం చేసుకునేలా చేసింది.

Updated : 21 Dec 2023 14:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ వేలంలో (IPL 2024 Auction) అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ జాబితాలో యువ ఆటగాడు కుమార్‌ కుశాగ్రా రూ.7.20 కోట్లు దక్కించుకున్నాడు. వికెట్‌ కీపర్‌ అయిన కుమార్‌.. దేశవాళీ క్రికెట్‌లో ‘మరో ధోనీ’గా పేరు సంపాదించాడు. ఐపీఎల్‌ వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పోటీ పడిన దిల్లీ క్యాపిటల్స్‌ చివరికి అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలంలో తన కుమారుడి కోసం రూ.10 కోట్ల వరకైనా వెచ్చించేలా చూస్తానని దిల్లీ క్యాపిటల్స్‌ మెంటార్‌ సౌరభ్‌ గంగూలీ హామీ ఇచ్చారని కుమార్‌ కుశాగ్రా తండ్రి శ్రీకాంత్ వెల్లడించారు. కుమార్‌ వికెట్‌ కీపింగ్‌తోపాటు బ్యాటింగ్ నైపుణ్యాలను గంగూలీ స్వయంగా పరిశీలించినట్లు గుర్తు చేసుకున్నారు.

‘‘ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ట్రయల్స్‌ అనంతరం.. దిల్లీ క్యాపిటల్స్‌ జట్టులోకి తీసుకొంటామని గంగూలీ అన్నారు. అవసరమైతే రూ.10 కోట్ల వరకైనా వెచ్చిస్తామన్నారు. అప్పుడు ఆ మాటలు ఎంతో ఉత్సాహానిచ్చాయి. ట్రయల్స్‌లో కుమార్‌ హిట్టింగ్‌ గంగూలీని ఆకట్టుకుంది. మైదానంలో అతడి చురుకుదనం కూడా దాదాను మెప్పించింది. ఈ సందర్భంగా కుమార్‌లో ధోనీ లక్షణాలున్నాయని గంగూలీ చెప్పారు. అతడు బెయిల్స్‌ను పడగొట్టే తీరు అద్భుతమని ప్రశంసించాడు. రూ.20 లక్షల కనీస ధరతో కుమార్ వేలంలోకి వచ్చాడు. అప్పుడు గంగూలీ మాట ఇచ్చినా అదేదో కుమార్‌ను ప్రోత్సహించడానికేనని భావించా.. వేలంలో అతడి కోసం ఎవరూ ఆసక్తి చూపరని అనుకున్నా. బేస్‌ ప్రైస్‌కే దిల్లీ క్యాపిటల్స్‌ తీసుకుంటుందని నమ్మకంతో ఉన్నా. వేలంలో కుమార్‌ పేరు వచ్చిన కాసేపటి తర్వాత ఇతర ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి’’ అని శ్రీకాంత్ కుశాగ్రా వెల్లడించారు. 

నేనెప్పుడూ క్రికెట్‌ ఆడలేదు.. కానీ

‘‘నేను ఏ స్థాయిలోనూ క్రికెట్‌ ఆడలేదు. అయితే, ఆటను మాత్రం చాలా జాగ్రత్తగా ఫాలో అవుతా. కుమార్‌ ఐదేళ్ల వయసులోనే క్రికెట్‌పై ఆసక్తి చూపాడు. దీంతో నేనే కోచ్‌గా మారాలని నిర్ణయించుకున్నా. బాబ్‌ వూమర్‌ రచించిన ‘ఆర్ట్‌ అండ్‌ సైన్స్‌ ఆఫ్‌ క్రికెట్‌’ పుస్తకం చదవమని నా స్నేహితుడొకరు సూచించారు. దాంతో కనీసం నాలుగైదు సార్లు ఆ పుస్తకం చదివా. అదే నాకు శిక్షణ. నేను కుమార్‌కు కోచింగ్‌ ఇచ్చేలా చేసింది’’ అని శ్రీకాంత్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని