Sourav Ganguly : క్రికెట్‌ మారింది.. టీమ్‌ఇండియా కూడా మారాలి : గంగూలీ

టీమ్‌ ఇండియా WTC Finalకు రెండో సారి చేరినా.. ఘోర ఓటమి చెందింది. దీంతో భారత్‌ పెద్ద టోర్నీలో గెలవాలంటే.. ఏం చేయాలో మాజీ కెప్టెన్‌ గంగూలీ(Sourav Ganguly) సూచించాడు.

Published : 18 Jun 2023 20:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  WTC Finalలో ఘోర ఓటమితో టీమ్‌ఇండియా(Team India)పై విమర్శలు పెరుగుతున్నాయి. పలువురు మాజీ దిగ్గజాలు రోహిత్‌ సేన ఆటతీరు, వ్యూహాలపై బాహాటంగానే మండిపడుతున్నారు. తాజాగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ(Sourav Ganguly) కూడా భారత ఆటతీరును విశ్లేషించి.. పలు సూచనలు చేశాడు. గత కొన్నేళ్లుగా క్రికెట్‌ ఆట మారిందని.. అయితే టీమ్‌ ఇండియా ఆటతీరు కూడా మారాల్సి ఉందని పేర్కొన్నాడు.

టెస్టుల్లో జట్లు నిలకడగా భారీ స్కోర్లు చేయడం గతంలో జరిగింది.. కానీ, ఇప్పుడు జరగడం లేదని గంగూలీ ఒప్పుకొన్నాడు. అయితే.. టీమ్‌ఇండియా ఈ ఫార్మాట్‌లో ముందుకు వెళ్లాలంటే.. తొలి ఇన్నింగ్స్‌ల్లో పెద్ద స్కోర్లు చేయాల్సిన అవసరముందని దాదా ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ సూచించాడు. ‘‘దూకుడుగా ఉండటం మంచిదే.. అయితే, దానితోపాటు మంచి ప్రదర్శన కూడా ఉండాలి కదా. గతంలో చూసుకుంటే.. 2001 నుంచి 2006 మధ్యలో భారత బ్యాటర్లు సిడ్నీ, బ్రిస్బేన్‌, నాటింగ్‌హామ్‌, ఓవల్‌, పెషావర్‌లాంటి పెద్ద వేదికలపై 500-600 పరుగులు చేశారు. ప్రత్యర్థి జట్లను ఒత్తిడిలోకి నెట్టారు’’

‘‘అయితే పదేళ్ల క్రితంతో పోల్చితే.. క్రికెట్‌లో కాస్త మార్పు వచ్చింది. పరిస్థితులు, పిచ్‌లు మారిపోయాయి. కానీ.. భారత్‌ టెస్టు క్రికెట్‌లో తొలి ఇన్నింగ్స్‌ల్లో 350-400 పరుగులు చేయాలి’’ అని గంగూలీ సూచించాడు. తొలి ఇన్నింగ్స్‌ల్లో పెద్ద స్కోర్లు ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి పెంచుతాయి.. అయితే టీమ్‌ ఇండియా నాకౌట్‌ మ్యాచ్‌ల్లో అలా చేయలేకపోతుందని వివరించాడు. WTC Finalలో రెండు ఇన్నింగ్స్‌ల్లో భారత్‌.. 300+ స్కోరును చేరుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక టీమ్‌పై తనకు పూర్తి నమ్మకముందని దాదా చెప్పాడు.

‘టీమ్‌పై నమ్మకం లేదంటే నేను అంగీకరించను. 2021లో ఇంగ్లాండ్‌లో బాగా ఆడాం. అంతకుముందు ఆస్ట్రేలియలో కూడా మంచి క్రికెటే ఆడాం. చివరి రోజు రిషభ్‌ పంత్‌ తన ఆటతో సిరీస్‌ గెలిపించాడు. ఇదంతా నమ్మకంతోనే జరుగుతుందని నేను భావిస్తా. అయితే.. ఎక్కువ క్రికెట్‌ ఆడటం, ఎక్కువ గంటలు ప్రయాణించడం ఆటగాళ్లపై ప్రభావం చూపిస్తాయి. కానీ.. ఆటగాళ్లు తిరిగి పుంజుకోవాలి. ఇది కచ్చితంగా సాధ్యమే అని నేను అనుకుంటున్నాను’ అని గంగూలీ విశ్లేషించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని