Tony de Zorzi: డికాక్‌లా వచ్చాడు.. ఎవరీ జులపాల కుర్రాడు?

వన్డేలకు డికాక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత అతడి స్థానంలో ఓపెనర్‌గా ఆడే ఆటగాడు ఎవరు? అని దక్షిణాఫ్రికాతో పాటు క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసింది. ఇప్పుడా స్థానం తనది అంటూ దూసుకొచ్చాడు టోనీ డి జోర్జి. 

Published : 23 Dec 2023 19:18 IST

సూపర్‌ ఫామ్‌లో ఉండగానే వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్‌ డికాక్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చివరగా ఆడిన వన్డే ప్రపంచకప్‌లో అతను ఏకంగా 594 పరుగులు చేశాడు. కానీ ముందే ప్రకటించినట్లుగా వన్డేలకు గుడ్‌బై చెప్పేశాడు. టెస్టులకు ఇప్పటికే వీడ్కోలు పలికాడు. దీంతో డికాక్‌ స్థానంలో ఓపెనర్‌గా ఆడే ఆటగాడు ఎవరు? అని దక్షిణాఫ్రికాతో పాటు క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసింది. ఇప్పుడా స్థానం తనది అంటూ టోనీ డి జోర్జి (Tony de Zorzi) దూసుకొచ్చాడు. భారత్‌తో వన్డే సిరీస్‌లో ఓపెనర్‌గా సత్తాచాటాడు. దీంతో జోర్జి గురించి చర్చ మొదలైంది. 

ఈ సిరీస్‌లో అదుర్స్‌..

దక్షిణాఫ్రికాలో ఆడిన గత ఆరు వన్డే సిరీస్‌ల్లో భారత్‌ కేవలం ఒక్క సిరీస్‌ మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో ఇటీవల సఫారీ గడ్డపై అడుగుపెట్టిన భారత్‌ టీ20 సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. తొలి వన్డేలో విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను దూకుడుగా ఆరంభించింది. కానీ కఠినమైన పరిస్థితుల్లో, క్లిష్టమైన పిచ్‌పై జరిగిన రెండో వన్డేలో భారత్‌కు పరాజయం ఎదురైంది. ప్రత్యర్థి జట్టులో ఓ ఆటగాడు సెంచరీతో భారత్‌కు విజయాన్ని దూరం చేశాడు. ఆ ఆటగాడే టోనీ డి జోర్జి. మందకొడి పిచ్‌పై 212 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు అడ్డుగోడగా జోర్జి నిలిచాడు. 119 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించి మైదానం వీడాడు. టీమ్‌ఇండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని, పోరాట పటిమ ప్రదర్శించాడు. ఈ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్‌లో జట్టును గెలిపించి సిరీస్‌ ఆశలు నిలిపాడు. ఇక చివరిదైన మూడో వన్డేలోనూ జోర్జి రాణించాడు. 297 పరుగుల ఛేదనలో 81 పరుగులతో రాణించిన అతను ఓ దశలో జట్టును మళ్లీ విజయతీరాలకు చేర్చేలా కనిపించాడు. కానీ అతను అర్ష్‌దీప్‌ బుట్టలో పడ్డాడు. ఆ తర్వాత పట్టు బిగించిన టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికాను కుప్పకూల్చి సిరీస్‌ దక్కించుకుంది. అంతకుముందు తొలి వన్డేలోనూ జోర్జి ఆకట్టుకున్నాడు. మొదట దక్షిణాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలినప్పటికీ జోర్జి 28 పరుగులు సాధించాడు. 

డికాక్‌ లాగే..

డికాక్‌ లాగే జోర్జి కూడా లెఫ్టార్మ్‌ బ్యాటర్‌. ఓపెనర్‌గా ఆడతాడు. పరిస్థితులకు తగ్గట్లుగా, కండీషన్స్‌కు అలవాటు పడి ఆడగలడు. ఇన్నింగ్స్‌ నిర్మించడంలో, జట్టును గెలుపు తీరాలకు చేర్చడంలో ఉత్తమంగా కనిపిస్తున్నాడు. 26 ఏళ్ల జోర్జి.. మొదటి నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. 2016 అండర్‌-19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్లో పరుగుల వేటలో సాగుతూనే వచ్చాడు. ఈ ప్రదర్శనతోనే జాతీయ జట్టులోకి వచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో టెస్టుల్లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకూ రెండు టెస్టుల్లో ఓ అర్ధశతకం సహా 114 పరుగులు చేశాడు. మార్చిలో వెస్టిండీస్‌తో సిరీస్‌తోనే వన్డేల్లోకి వచ్చాడు. 5 వన్డేల్లో 69 సగటుతో 276 పరుగులు సాధించాడు. భారత్‌తో రెండో వన్డేలో సెంచరీతో తొలి అంతర్జాతీయ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. అన్ని రకాల షాట్లు ఆడగలనని చాటుకున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో నిలబడగలని రుజువు చేశాడు. ఇప్పుడు భారత్‌తో టెస్టుల్లోనూ రాణించేందుకు సిద్ధమవుతున్నాడు. డికాక్‌ వీడ్కోలుతో ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేసే సత్తా తనకుందని జోర్జి తన ప్రదర్శనతో చెప్పాడు. దక్షిణాఫ్రికా భవిష్యత్‌ స్టార్‌గా ఎదిగా దిశగా కనిపిస్తున్నాడు. అతను ఇదే నిలకడ కొనసాగిస్తే మరో డికాక్‌ అవుతాడనడంలో సందేహం లేదు. మరో వైపు భారత్‌తో వన్డే సిరీస్‌తో అరంగేట్రం చేసిన పేసర్‌ నంద్రీ బర్గర్‌ కూడా ఆకట్టుకున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 5 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌ మినీ వేలంలో బర్గర్‌ను రూ.50 లక్షలకు రాజస్థాన్‌ రాయల్స్‌ దక్కించుకుంది.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని