South Africa: సఫారీ దూకుడు మామూలుగా లేదు.. ప్రపంచకప్‌లో చెలరేగుతున్న దక్షిణాఫ్రికా

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) దక్షిణాఫ్రికా జట్టు ఆటను చూస్తే మిగతా జట్లకు హడలెత్తుతోంది. తొలుత బ్యాటింగ్‌లో అదరగొట్టేసి.. ఆనక బౌలింగ్‌లో విజృంభిస్తూ ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతోంది.

Updated : 25 Oct 2023 14:18 IST

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ఆరంభమయ్యే ముందు దక్షిణాఫ్రికాపై పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే ఆ జట్టు గత చరిత్ర చూసుకున్నా.. వారి రికార్డులను తిరగేసినా సఫారీ జట్టును కప్‌నకు ఫేవరెట్‌గా పరిగణించలేని పరిస్థితి! కానీ ప్రపంచకప్‌ మొదలయ్యాక దక్షిణాఫ్రికా దూకుడు ఇంకోలా ఉంది. భీకరంగా ఆడుతూ ప్రత్యర్థులను బెదరగొడుతోంది. ఒక్క నెదర్లాండ్స్‌పై తప్పించి.. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ సఫారీల జోరు మాములుగా లేదు. మొదట బ్యాటింగ్‌కు దిగి పరుగుల వరద పారించి.. ఆపై బంతితో ప్రత్యర్థి భరతం పడుతోంది దక్షిణాఫ్రికా. గత అయిదు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో ఆ జట్టుది ఇదే వ్యూహం.

అటు డికాక్‌.. ఇటు క్లాసెన్‌

గత అయిదు మ్యాచ్‌ల్లో నాలుగుసార్లు సఫారీ జట్టు 300 పరుగులు అందుకుందంటే ఆ జట్టు ఎంత దూకుడుగా ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్రీలంక, ఇంగ్లాండ్‌పై అయితే ఆ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. లంకపై 400 దాటిన దక్షిణాఫ్రికా.. ఇంగ్లాండ్‌పై 399 పరుగులు చేసింది. నిజానికి బ్యాటింగ్‌ కన్నా బౌలింగే దక్షిణాఫ్రికాకు బలమని విశ్లేషకులు అనుకున్నారు. ఏబీ డివిలియర్స్‌ లాంటి దిగ్గజాలు లేని జట్టుపై బ్యాటింగ్‌లో ఎవరికీ పెద్దగా నమ్మకం లేదు. కానీ ఉన్నట్టుండి ఆ జట్టుకు బ్యాటింగే పెద్ద బలమైపోయింది. దీనికి కారణం ఓపెనర్‌ క్వింటాన్‌ డికాక్, మిడిల్డార్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌! ఈ ప్రపంచకప్‌లో వీర విధ్వంసం సృష్టిస్తున్న ఈ జోడీ ప్రత్యర్థి ప్రత్యర్థి బౌలర్లను లెక్కే చేయట్లేదు. డికాక్‌ ఆరంభంలో దూకుడుగా ఆడి పునాది వేస్తేంటే.. క్లాసెన్‌ స్లాగ్‌ ఓవర్లలో భీకరంగా ఆడుతూ బలమైన ఫినిషింగ్‌ టచ్‌ ఇస్తున్నాడు. ముఖ్యంగా డికాక్‌ 5 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలతో ఈ ప్రపంచకప్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. ప్రస్తుతం 81 పైన సగటుతో 407 పరుగులు చేసిన డికాక్‌.. టోర్నీలోనే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక క్లాసెన్‌ ఏమి తక్కువ తినలేదు. సిక్స్‌లతో చెలరేగుతున్న అతడు 5 మ్యాచ్‌ల్లో 288 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌పై చేసిన మెరుపు శతకాన్ని ఎవరూ మర్చిపోలేరు.

ఈసారి ఎందాకో!

ప్రపంచకప్‌ అంటే చాలు ఆ జట్టు బ్యాడ్‌లక్‌ను జేబులో పెట్టుకుని బరిలో దిగుతుంది దక్షిణాఫ్రికా. అలా అని ఆ జట్టు ప్రదర్శన ఎప్పుడూ తక్కువేం కాదు. ఇప్పటిదాకా ఆడిన 8 ప్రపంచకప్పుల్లో ఆ జట్టు నాలుగుసార్లు సెమీఫైనల్‌కు వెళ్లింది. ఆరంభంలో అదిరేలా ఆడడం నాకౌట్లో వెనుదిరగడం సఫారీలకు అలవాటు. ఈసారి ప్రపంచకప్‌లోనూ సఫారీ జట్టు గట్టిగానే మొదలుపెట్టింది. అయితే ఒకప్పుటికన్నా భీకరంగా.. మ్యాచ్‌ మ్యాచ్‌కు స్థాయిని పెంచుకుంటూ పోతోంది. 

నెదర్లాండ్స్‌పై అనూహ్యంగా తడబడినా.. ఆ తర్వాత ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌లకు చుక్కలు చూపించింది. ఆ జట్టుకు మొదట బ్యాటింగ్‌ అప్పగించాలంటే భయపడేలా ఉంది దక్షిణాఫ్రికా ఆట. ఈసారి ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు 6 సెంచరీలు చేస్తే అందులో ఓపెనర్‌ క్వింటాన్‌ డికాక్‌ ఒక్కడి వాటానే మూడు కావడం విశేషం. క్లాసెన్, వాండర్‌డసెన్, మార్‌క్రమ్‌ తలా శతకం బాదారు. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఆ జట్టు బ్యాటర్లకు బాగా పనికొస్తోంది. ఈ కప్‌లో ఆ జట్టు ఓడించింది మామూలు జట్లను కాదు. ఒకటి ప్రపంచ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ అయితే ఇంకోటి అయిదుసార్లు ఛాంపియన్‌ ఆస్ట్రేలియా. ఎనిమిది పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు చేరుకోవడం దాదాపు లాంఛనమే. నాకౌట్లో ఆ జట్టు ఆట ఎలా ఉంటుందో అన్నదాని మీదే ఈసారి సఫారీల భవిష్యత్‌ ఆధారపడి ఉంది. ఇదే జోరు మున్ముందు కూడా చూపితే తొలిసారి కప్‌ గెలవడం సఫారీలకు పెద్ద కష్టం కాబోదు. 

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని