ODI WC 2023 - NZ: కివీస్‌ స్థిరత్వం అదరహో.. తొమ్మిదోసారి సెమీస్‌లోకి

సమీకరణాలు కలిసి రావడం, ఆఖర్లో పుంజుకోవడంతో కివీస్‌ మళ్లీ ప్రపంచకప్‌ గడప తొక్కింది. కానీ, ఈసారి కివీస్‌ను తక్కువగా అంచనా వేస్తే 2019 సెమీస్‌ ఫలితం పునరావృతమయ్యే ప్రమాదం ఉంది.

Updated : 14 Nov 2023 10:14 IST

పరిమిత ఓవర్ల ప్రపంచకప్‌ అనగానే గుర్తొచ్చే జట్టు న్యూజిలాండ్‌. ఇప్పటిదాకా కప్‌ గెలవలేదు కానీ ఆ జట్టు ప్రదర్శన మాత్రం చాలా స్థిరంగా సాగుతోంది. ఎంతగా అంటే తొమ్మిదిసార్లు సెమీఫైనల్‌ చేరేంతగా! ముఖ్యంగా 2007 నుంచి ఈ మెగా టోర్నీలో కివీస్‌ జట్టు సెమీస్‌ కంటే తక్కువ ప్రదర్శన చేయలేదు. ఈసారి టోర్నీలోనూ ఆ జట్టు సెమీఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంది. 2019 కప్‌ మాదిరే భారత్‌తో పోరుకు సై అంటోంది.

ప్రపంచకప్‌ అంటే చాలు

ప్రపంచకప్‌ అంటే చాలు కివీస్‌ ఆటే వేరే స్థాయిలో ఉంటుంది. ద్వైపాక్షిక సిరీస్‌లో సాధారణంగా కనిపించే ఆ జట్టు ప్రపంచ కప్పుల్లో అసాధారణ ప్రదర్శనలు చేస్తూ ఉంటుంది. 1975 తొలి ప్రపంచకప్‌ నుంచి బరిలో ఉన్నా కూడా న్యూజిలాండ్‌ ఏనాడూ కప్‌ను ముద్దాడింది లేదు. 2019లో అయితే ట్రోఫీ చేతుల్లోకి వచ్చినట్టే వచ్చి చేజారింది. అయితే కప్‌ గెలవకున్నా ఆ జట్టు స్థిరత్వానికి మారుపేరుగా నిలిచింది. 1975 ప్రపంచకప్‌ నుంచే కివీస్‌ తన ముద్ర వేసింది. అప్పుడు వెస్టిండీస్‌.. న్యూజిలాండ్‌ దూకుడుని అడ్డుకుంది. 1979 కప్‌లోనూ కివీస్‌ జోరుగానే ఆడింది. మళ్లీ సెమీస్‌ తలుపు తట్టింది ఈసారి ఇంగ్లాండ్‌ ఆ జట్టును ఆపేసింది. 1992లో ఆ జట్టు ఊపు చూస్తే కప్‌ కొట్టేస్తుందా అనిపించింది. వరుస విజయాలు ఆ జట్టు సొంతం.

కానీ సెమీస్‌లో మళ్లీ అదృష్టం కలిసి రాలేదు. ఈసారి పాకిస్థాన్‌.. కివీస్‌కు నిరాశను మిగిల్చింది. 1999 కప్పులోనూ పాకిస్థానే మళ్లీ కివీస్‌ను ఆపింది. 2007, 2011 కప్పుల్లో శ్రీలంక చేతుల్లో ఓడి మళ్లీ ఉసూరుమంది. అయితే 2015, 2019ల్లో ఆ జట్టు ఓ మెట్టు ఎక్కింది. రెండు టోర్నీల్లో తుదిపోరుకు అర్హత సాధించింది. 2015 ఫైనల్లో ఆస్ట్రేలియా ఆ జట్టుకు కళ్లెం వేస్తే.. 2019 కప్‌ తుది పోరులో కివీస్‌కు తీరని వేదనను మిగిల్చింది. ఇంగ్లాండ్‌తో ఫైనల్లో గొప్పగా పోరాడినా.. ఇక విజయం తమదే అన్న ధీమా కలిగినా బెన్‌ స్టోక్స్‌ పట్టుదలతో మ్యాచ్‌ను టై చేశాడు. బౌండరీల లెక్కల్లో అదృష్టం ఇంగ్లాండ్‌ను వరించి విజేతగా నిలిచింది. మరి మళ్లీ సెమీస్‌ తలుపు తట్టిన కివీస్‌ ఈసారి ఏం చేస్తుందో చూడాలి.

ప్రయోగాలకు పెట్టింది పేరు

1992 ప్రపంచకప్‌లో భిన్నమైన ప్రయోగాలతో కివీస్‌ అభిమానులను ఆకట్టుకుంది. 15 ఓవర్లలోపు ఫీల్డింగ్‌ నిబంధనలు ఉండే సమయంలో గ్రేట్‌బ్యాచ్‌తో హిట్టింగ్‌ చేయించడం, దీపక్‌ పటేల్‌ లాంటి స్పిన్నర్‌ను కొత్త బంతితో బౌలింగ్‌ చేయించడం లాంటి ప్రయోగాలు కివీసే చేసింది. 1992లో మార్టిన్‌ క్రో వ్యూహాలు ఆ జట్టుకు భలే కలిసొచ్చాయి. ప్రతి టోర్నీలోనూ భిన్నమైన ప్రణాళికలతో అందరికంటే ముందు తానే అన్నట్లుగా సాగుతూ ఉంటుంది కివీస్‌.

ఈసారి కప్‌లో కూడా జట్టు తక్కువ ప్రదర్శనేం చేయలేదు. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమే ఎరగకుండా సాగింది. కానీ ఆ తర్వాత  వరుస మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్‌కు ముందే నిష్క్రమిస్తుందా అనిపించింది. కానీ సమీకరణాలు కలిసి రావడం, ఆఖర్లో పుంజుకోవడంతో కివీస్‌ మళ్లీ ప్రపంచకప్‌ గడప తొక్కింది. 2019 మాదిరే మళ్లీ భారత్‌తో పోరుకు సిద్ధమైంది. ఈసారి సెమీస్‌లో టీమ్‌ఇండియాతో కాబట్టి.. మనం భారతే గెలవాలని అనుకుంటాం.. కానీ కివీస్‌ను తక్కువగా అంచనా వేస్తే 2019 కప్‌ సెమీస్‌ ఫలితం పునరావృతమయ్యే ప్రమాదం ఉంది.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు