IND vs SA: సిరీస్‌ కొట్టేయాలంటే... టీమ్‌ఇండియా వీటిపై ఓ లుక్కేయాలి!

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య గువహటి వేదికగా రెండో మ్యాచ్‌ జరగనుంది. తొలి టీ20లో భారత్‌ విజయం సాధించి ఊపు మీదుంది. రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఎదురు చూస్తోంది.

Published : 01 Oct 2022 20:02 IST

ఆదివారం దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్‌

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా-భారత్‌ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌..  పొట్టి ప్రపంచకప్‌ ముంగిట టీమ్‌ఇండియా ఆడుతున్న ఆఖరి టీ20 సిరీస్‌ ఇదే కావడం విశేషం. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత్‌.. సిరీస్‌పై కన్నేసింది. ఆదివారం ఇరు జట్ల మధ్య గువహటి వేదికగా రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. మొదటి మ్యాచ్‌లో ఘోర పరాభవం పొందిన దక్షిణాఫ్రికా పుంజుకొనే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా దృష్టిసారించాల్సిన అంశాలేంటో ఓ సారి చూద్దాం.. 

బౌలింగ్‌ అదుర్స్‌.. కానీ

తొలి టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లను టపాటపా పడగొట్టడంలో దీపక్ చాహర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించారు. కేవలం 15 బంతుల్లో 9 పరుగులకే ఐదు వికెట్లు తీశారు. కానీ ఆ తర్వాత కాస్త పట్టు సడలించడంతో దక్షిణాఫ్రికా వందకుపైగా రన్స్ చేయడం గమనార్హం. మార్‌క్రమ్‌ (25)తోపాటు ఏడో స్థానంలో దిగిన పార్నెల్ (24), ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కేశవ్‌ మహరాజ్‌ (41) విలువైన పరుగులు చేయడంతో భారత బౌలర్ల నిర్లక్ష్యం కాస్త ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వారిని త్వరగానే ఔట్ చేసి ఉండే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 40లోపే ముగిసి ఉండేది. అందుకే టాప్‌ ఆర్డర్‌ను ఒత్తిడిలోకి నెట్టినట్లే మిగతా వికెట్లపైనా పట్టు విడవకుండా బౌలింగ్‌ చేయాల్సిన అవసరం ఉంది. 

టాప్‌ స్టార్లు ఇబ్బంది పడిన వేళ.. 

దక్షిణాఫ్రికా నిర్దేశించిన 107 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు షాక్‌ ఇస్తూ కెప్టెన్‌ రోహిత్ శర్మ (0), విరాట్ కోహ్లీ (3) ఘోరంగా విఫలమయ్యారు. మళ్లీ బయటకు వెళ్తున్న బంతిని వెంటాడి మరీ విరాట్ పెవిలియన్‌కు చేరడం గమనార్హం. అయితే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌ (51*), సూర్యకుమార్ యాదవ్ (50*) ఎంతో నింపాదిగా ఆడి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. రాహుల్‌ నెమ్మది ఇన్నింగ్స్ కాస్త విమర్శలకు దారి తీసినా.. పిచ్‌ పరిస్థితులకు అనుగుణంగా ఆడాడని అతడికి మద్దతుగా పలువురు నిలిచారు. అయితే టీ20ల్లో నిలకడ ఎంత ముఖ్యమో.. వేగంగా పరుగులు చేయడమూ కీలకం. అందుకే రాహుల్‌ కూడా తన బ్యాట్‌ స్పీడ్‌ను పెంచాలి. అలాగే తదుపరి మ్యాచ్‌లోనైనా విరాట్, రోహిత్ మళ్లీ గాడిలో పడాలి. టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఇంకో రెండు టీ20 లను మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఈ లోపు ఫామ్‌ను కొనసాగించి మెగా టోర్నీకి సిద్ధమైపోవాలి. జట్టు కూర్పుపై కసరత్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. 

సిరాజ్‌కు మంచి అవకాశం

వెన్ను నొప్పి తిరగబెట్టడంతో జస్ప్రీత్ బుమ్రా టీ20 సిరీస్‌ నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మహమ్మద్‌ సిరాజ్‌ వచ్చాడు. ఒక వేళ తుది జట్టులో స్థానం దక్కితే మాత్రం.. సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రాణిస్తే.. బుమ్రా గైర్హాజరీలో టీ20 ప్రపంచ కప్‌ కోసం స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపికకు మార్గం సుగమమవుతుంది. భారత టీ20 లీగుల్లో ఫర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. టీమ్‌ఇండియా తరఫున మాత్రం స్థానం సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు వచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. 

దక్షిణాఫ్రికాతో సులభం కాదు

ఓటమితో ఉన్న దక్షిణాఫ్రికాను తేలిగ్గా తీసుకుంటే మాత్రం భారత్‌కు ఎదురు దెబ్బ తగలక తప్పదు. తొలి మ్యాచ్‌లో విఫలమైన డికాక్, బవుమా, రోసోవ్‌ను తక్కువగా అంచనా వేయొద్దు. అలాగే మార్‌క్రమ్‌, డేవిడ్ మిల్లర్‌ డేంజరస్‌ ఆటగాళ్లు. జూనియర్‌ మిస్టర్‌ 360గా పేరొందిన ట్రిస్టన్ స్టబ్స్‌ క్రీజ్‌లో నిలదొక్కుకుంటే మాత్రం వీరబాదుడు బాదుతారు. టాస్‌ కీలకంగా మారే అవకాశం ఉండటంతో తొలుత బ్యాటింగ్‌ చేస్తే మాత్రం టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధించాలి. లేకపోతే పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన దక్షిణాఫ్రికాకు  200 స్కోరు కూడా కష్టమేమీ కాదు. 

తుది జట్లు (అంచనా): 

భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్‌ పంత్‌, దినేశ్‌ కార్తిక్‌, అశ్విన్‌, అక్షర్‌ పటేల్, హర్షల్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్, దీపక్‌ చాహర్‌

దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, బవుమా (కెప్టెన్), రోసోవ్, ఐదెన్ మార్‌క్రమ్‌, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, పార్నెల్, కేశవ్ మహరాజ్‌, రబాడ, నోకియా, షంసి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని