Meg Lanning: ఏడు ప్రపంచకప్‌లు.. ఎన్నో రికార్డులు... ఆటకు లానింగ్‌ వీడ్కోలు

క్రీజులో అడుగుపెట్టిందంటే ఆమె ధనాధన్‌ బ్యాటింగ్‌కు ఫిదా కావాల్సిందే. కెప్టెన్‌గా మైదానంలో దిగి వ్యూహాలు పన్నిందంటే విజయం దక్కాల్సిందే. బ్యాటింగ్‌లో ఆమె విధ్వంసం.. కెప్టెన్సీలో ఆమె నైపుణ్యం.. మొత్తంగా ఆమె ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం. 

Published : 10 Nov 2023 02:21 IST

క్రీజులో అడుగుపెట్టిందంటే ఆమె ధనాధన్‌ బ్యాటింగ్‌కు ఫిదా కావాల్సిందే. కెప్టెన్‌గా మైదానంలో దిగి వ్యూహాలు పన్నిందంటే విజయం దక్కాల్సిందే. బ్యాటింగ్‌లో ఆమె విధ్వంసం.. కెప్టెన్సీలో ఆమె నైపుణ్యం.. మొత్తంగా ఆమె ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకూ ఏ కెప్టెన్‌ సాధించని రికార్డులు ఆమె సొంతం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు ప్రపంచకప్‌లు.. ఇందులో కెప్టెన్‌గా అయిదు ఆమె ఖాతాలో ఉన్నాయి. ‘ది మెగాస్టార్‌’గా పిలుచుకునే ఆమె మహిళల క్రికెట్లో నిజంగానే మెగాస్టార్‌. ఆమెనే 31 ఏళ్ల మెగ్‌ లానింగ్‌ (Meg Lanning). ఆసీస్‌ మహిళల జట్టును అత్యున్నత శిఖరాల వైపు నడిపించి.. అమ్మాయిల క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఆమె ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు తెరదించింది. అయినా ఆమె సాగించిన రికార్డుల ప్రయాణం.. విజయాల ప్రస్థానం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 

మేటి కెప్టెన్‌..

జట్టుకు ఒక్క ప్రపంచకప్‌ అందిస్తేనే ఆ కెప్టెన్‌ను దిగ్గజంగా అభివర్ణిస్తారు. ఆకాశానికి ఎత్తేస్తారు. అలాంటిది ఆసీస్‌కు అయిదు ప్రపంచకప్‌లు అందించిన లానింగ్‌ను ఏమని పిలవాలి? ఎంతని పొగడాలి? ఆమె ఖాతాలో 2012, 2014, 2018, 2020, 2023 టీ20 ప్రపంచకప్‌లు.. 2013, 2022 వన్డే ప్రపంచకప్‌లున్నాయి. కెప్టెన్‌గా 2022 వన్డే ప్రపంచకప్‌.. 2014, 2018, 2020, 2023 టీ20 ప్రపంచకప్‌లు.. 2015, 2019, 2022 యాషెస్‌ సిరీస్‌ విజయాలు సాధించింది. నిరుడు కామన్వెల్త్‌ క్రీడల్లో దేశానికి పసిడి అందించింది. 182 మ్యాచ్‌ల్లో ఆసీస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమె 80 శాతం విజయాలు ఉండటం విశేషం. 2014లో సారథ్య బాధ్యతలు చేపట్టిన ఆమె అతిపిన్న వయస్సు ఆసీస్‌ సారథిగా చరిత్ర సృష్టించింది. ప్రపంచ క్రికెట్లో అత్యధిక ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన కెప్టెన్‌ ఆమెనే. రికీ పాంటింగ్‌ (4)ను దాటింది. వన్డేల్లో, టీ20ల్లో వరుసగా 88.46, 76 విజయశాతాలతో ప్రపంచ రికార్డులూ తనే సొంతం చేసుకుంది. ఆమె సారథ్యంలో వన్డేల్లో ఆసీస్‌ వరుసగా 26 విజయాలు సాధించడమూ ప్రపంచ రికార్డే. చివరగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో జట్టుకు సారథిగా వ్యవహరించింది. 

సింగపూర్‌లో పుట్టి..

లానింగ్‌ సింగపూర్‌లో జన్మించింది. ఆ తర్వాత సిడ్నీకి వలస వెళ్లిన ఆమె కుటుంబం, అనంతరం మెల్‌బోర్న్‌లో స్థిరపడింది. రికీ పాంటింగ్, పాల్‌ కెల్లీ లాంటి ప్లేయర్లను ఆరాధిస్తూ క్రికెట్లో ఎదిగింది. 2010 డిసెంబర్‌లో టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో లానింగ్‌ అడుగుపెట్టింది. 2011లో వన్డే అరంగేట్రం చేసింది. ఇంగ్లాండ్‌పై 18 ఏళ్ల వయసులోనే శతకం చేసి ఆసీస్‌ తరపున సెంచరీ చేసిన అతిపిన్న వయస్సు క్రికెటర్‌ (పురుషుల క్రికెట్లో కలిపి)గా రికార్డు నమోదు చేసింది. న్యూజిలాండ్‌పై 45 బంతుల్లోనే శతకం చేసిన ఆమె.. వన్డేల్లో ఆస్ట్రేలియా తరపున అత్యంత వేగంగా శతకం చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. 2013 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. 2013 మహిళల యాషెస్‌ సిరీస్‌తో లానింగ్‌ టెస్టుల్లో అడుగుపెట్టింది. 2014 టీ20 ప్రపంచకప్‌లో సారథ్యంతో పాటు బ్యాటర్‌గానూ లానింగ్‌ సత్తాచాటింది.

ఆరు ఇన్నింగ్స్‌ల్లో 257 పరుగులతో టోర్నీ టాప్‌స్కోరర్‌గా నిలిచింది. అంతే కాకుండా కెప్టెన్సీతో సత్తాచాటి జట్టును విశ్వవిజేతగా నిలిచింది. ఆ టోర్నీలో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో కేవలం 65 బంతుల్లోనే 126 పరుగులు చేసి అప్పుడు మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో 2 వేల పరుగులు చేసిన తొలి ఆసీస్‌ బ్యాటర్ ఆమెనే. మహిళల క్రికెట్లో అత్యధిక వన్డే సెంచరీల (15) రికార్డూ తనదే. టీ20ల్లో రెండు శతకాలు సాధించింది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆసీస్‌ మహిళా క్రికెటర్‌ ఆమెనే. 241 మ్యాచ్‌ల్లో 8,352 పరుగులు చేసింది. అయితే 2016 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో వెస్టిండీస్, 2017 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత్‌ చేతిలో ఆసీస్‌ ఓడటం, 2017లో భుజానికి శస్త్రచికిత్స కారణంగా ఆటకు దూరమవడంతో లానింగ్‌ పనైపోయిందనే విమర్శలు వచ్చాయి. కానీ ఆరు నెలల తర్వాత మళ్లీ తిరిగొచ్చి అదరగొట్టింది.

వరుసగా 2018, 2020 టీ20 ప్రపంచకప్‌ల్లో జట్టును విజేతగా నిలిపింది. 2022 ఆగస్టులో వ్యక్తిగత కారణాల వల్ల ఆటకు విరామం తీసుకుని తిరిగి 2023 జనవరిలో పునరాగమనం చేసింది. పొట్టికప్పులో దేశానికి మరో ట్రోఫీ అందించింది. లానింగ్‌ 6 టెస్టుల్లో 345 పరుగులు చేసింది. 103 వన్డేల్లో 53.51 సగటుతో 4602 పరుగులు, 132 టీ20ల్లో 3405 పరుగులు సాధించింది. అనారోగ్య కారణాలతో గత మూడు సిరీస్‌లకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌నే వదిలేసింది. లీగ్‌ల్లో మాత్రం కొనసాగుతానని ప్రకటించింది. మహిళల క్రికెట్లో ఇలాంటి కెప్టెన్, బ్యాటర్‌ను మళ్లీ చూసే అవకాశం లేదంటే అతిశయోక్తి కాదు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని