ODI World Cup 2023 : బెన్ కంటే ముందు ఇమ్రాన్

రెండు రోజులుగా ప్రపంచ క్రికెట్ వర్గాల్లో ఎక్కువగా చర్చనీయాంశం అవుతున్న పేరు.. బెన్ స్టోక్స్. ఈ ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ గత ఏడాది ఒత్తిడి పెరిగిపోతోందంటూ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసి టెస్టులు, టీ20లకు మాత్రమే పరిమితం అయ్యాడు. కానీ ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ కోసమని స్టోక్స్‌తో రిటైర్మెంట్ నిర్ణయాన్ని రద్దు చేయించి మరీ తిరిగి జట్టులోకి తీసుకుంది ఇంగ్లాండ్.

Updated : 20 Aug 2023 16:16 IST

 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వెనక్కి

రెండు రోజులుగా ప్రపంచ క్రికెట్ వర్గాల్లో ఎక్కువగా చర్చనీయాంశం అవుతున్న పేరు.. బెన్ స్టోక్స్(Ben Stokes). ఈ ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ గత ఏడాది ఒత్తిడి పెరిగిపోతోందంటూ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసి టెస్టులు, టీ20లకు మాత్రమే పరిమితం అయ్యాడు. కానీ ఈ ఏడాది వన్డే ప్రపంచకప్(ODI World Cup 2023) కోసమని స్టోక్స్‌తో రిటైర్మెంట్ నిర్ణయాన్ని రద్దు చేయించి మరీ తిరిగి జట్టులోకి తీసుకుంది ఇంగ్లాండ్. క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అనుకుంటే పొరపాటే. స్టోక్స్ కంటే ముందు పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఇలాగే రిటైర్మెంట్ నుంచి వెనక్కి వచ్చాడు. అంతే కాదు.. తన జట్టుకు వన్డే ప్రపంచకప్‌ను కూడా అందించాడు.

పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా ఎప్పటికీ నిలిచిపోతాడు ఇమ్రాన్ ఖాన్. అతడికి అంత గొప్ప పేరు రావడానికి కారణం 1992 ప్రపంచకప్. ఇమ్రాన్ లేకుంటే పాకిస్థాన్ ఆ టోర్నీలో విజేతగా నిలిచేదే కాదు అంటే అతిశయోక్తి కాదు. తన ఆటతో, నాయకత్వంతో పాక్‌ విజయంలో అంత కీలక పాత్ర పోషించాడు ఇమ్రాన్. నిజానికి ఆ టోర్నీలో ఇమ్రాన్ ఆడాల్సిందే కాదు. అంతకుముందు ఏడాదే వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడతను. అప్పటికే ఇమ్రాన్ రెండు ప్రపంచకప్‌ల్లో పాకిస్థాన్‌ను నడిపించాడు. 1983లో, 1987లో ఇమ్రాన్ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ ఆడిన పాక్.. మెరుగైన ప్రదర్శనే చేసింది. కానీ రెండుసార్లూ సెమీఫైనల్లోనే ఆ జట్టు ప్రయాణం ముగిసింది. తర్వాతి ప్రపంచకప్‌ కంటే ముందే ఇమ్రాన్ వన్డేల నుంచి రిటైరైపోయాడు. కానీ ఇమ్రాన్‌కు సరైన వారసుడిని గుర్తించలేకపోయింది పాక్. ఈ మెగా టోర్నీలో మరోసారి జట్టును నడిపించడానికి ఇమ్రానే సరైనవాడని పాక్ క్రికెట్ బోర్డు భావించింది. పీసీబీ విజ్ఞప్తి మేరకు ఇమ్రాన్ కూడా మనసు మార్చుకున్నాడు. ప్రపంచకప్‌లో మరో ప్రయత్నం చేసి కెరీర్‌కు టాటా చెప్పాలనుకున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో ఇమ్రాన్ పాక్‌ను నడిపించిన తీరు అద్భుతం. 8 మ్యాచ్‌ల్లో 185 పరుగులు చేయ‌డ‌మే కాక‌ 7 వికెట్లు పడగొట్టి ఆటగాడిగా తన స్థానానికి న్యాయం చేసిన ఇమ్రాన్‌.. జావెద్‌ మియాందాద్, సలీమ్‌ మాలిక్‌ లాంటి సీనియర్లు వసీమ్‌ అక్రమ్, ఇంజమాముల్‌ హక్‌ లాంటి జూనియర్లతో చక్కగా సమన్వయం చేసుకుని జట్టును ముందుకు నడిపించాడు. ముఖ్యంగా యువ ఆటగాడు ఇంజమామ్‌ను ఫించ్‌ హిట్టర్‌గా వాడుకున్న తీరు.. తన ప్రధాన బౌలింగ్‌ అస్త్రం వసీమ్‌ అక్రమ్‌ను ప్రత్యర్థులపైకి ప్రయోగించిన వైనం ప్రశంసలందుకుంది. అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన పాక్‌.. ఇమ్రాన్‌ స్ఫూర్తిదాయక నాయకత్వంతోనే అనూహ్య విజయాలు సాధించి కప్పు ఎగరేసుకుపోయింది. పాక్‌కు చిరస్మరణీయ విజయాన్నందించి సగర్వంగా కెరీర్‌కు ముగింపు పలికాడు ఇమ్రాన్‌. అతణ్ని రిటైర్మెంట్‌ నుంచి వెనక్కి తీసుకురావాలన్న నిర్ణయం నూటికి నూరు శాతం సరైందే అని తేలింది.

మ‌ళ్లీ సాధిస్తాడా?

ఇప్పుడు స్టోక్స్‌ పునరాగమనం అందరికీ ఇమ్రాన్‌ ఖాన్‌నే గుర్తుకు తెస్తోంది. ఇమ్రాన్‌ లాగే స్టోక్స్‌ కూడా ఆల్‌రౌండర్‌. అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండటం.. మరోవైపు టీ20 లీగ్స్‌ కూడా ఆడుతుండటంతో ఒత్తిడి ఎక్కువైపోతోందని నిరుడు అతను వన్డేలకు గుడ్‌బై చెప్పాడు. ఒక రకంగా లెక్కకు మిక్కిలి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడించేస్తున్న ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తీరుకు నిరసనగానే స్టోక్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఒకసారి రిటైర్మెంట్‌ ప్రకటించాక స్టోక్స్‌ వెనక్కి వస్తాడని కొన్ని నెలల ముందు వరకు ఎవరికీ అంచనా లేదు. కానీ ఇటీవల యాషెస్‌ సిరీస్‌లో స్టోక్స్‌ ప్రదర్శన, పోరాట పటిమ చూశాక తనలాంటి మేటి ఆల్‌రౌండర్‌ ప్రపంచకప్‌లో ఉండాలని ఇంగ్లిష్‌ అభిమానులు కోరుకున్నారు. స్టోక్స్‌ జట్టుకు చేకూర్చే విలువేంటో ఇంగ్లాండ్‌ బోర్డుకు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు కూడా బాగానే తెలుసు. అందుకే బట్లర్‌తో పాటు కోచ్‌ మ్యాట్, సెలక్టర్లు కలిసి స్టోక్స్‌ను ఒప్పించి రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకునేలా చేయగలిగారు. ఇమ్రాన్‌ ఖాన్‌లా స్టోక్స్‌ కెప్టెన్‌ కాకపోయినా.. ఆల్‌రౌండర్‌గా తన వంతు పాత్ర పోషిస్తే.. జట్టు నాయకత్వ బృందంలోనూ కీలకంగా వ్యవహరిస్తే జట్టుకెంతో ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు. 2019లో ఇంగ్లాండ్ తొలి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను గెల‌వ‌డంలో స్టోక్స్ పాత్ర కీల‌కం. ఇప్పుడు భార‌త్ వేదిక‌గా జ‌రిగే 2023 ప్ర‌పంచ‌క‌ప్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగుతోంది ఆ జ‌ట్టు. మరి ఇంగ్లాండ్‌ మ‌రోసారి కప్పు గెలవడంలో స్టోక్స్‌ ముఖ్య పాత్ర పోషిస్తాడేమో చూడాలి.

మొయిన్ కోసం స్టోక్స్.. స్టోక్స్ కోసం బట్లర్

స్టోక్స్‌ పునరాగమనంలో పరోక్షంగా ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ పాత్ర ఉంది. అలా అని అతను బెన్‌ను ఒప్పించడానికి రాయబారం ఏమీ నడపలేదు. మొయిన్‌ కొన్ని నెలల కిందట టెస్టు క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడు. అయితే ఇంగ్లాండ్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే యాషెస్‌ సిరీస్‌ ముంగిట స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ గాయపడటంతో సరైన ప్రత్యామ్నాయం కనిపించలేదు. ఆ స్థితిలో మొయిన్‌ అలీ వైపు దృష్టి మళ్లింది. టెస్టుల్లో కెప్టెన్‌ అయిన స్టోక్స్‌.. స్వయంగా మొయిన్‌తో మాట్లాడాడు. జట్టు ప్రయోజనాల కోసం రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకోవాలని కోరాడు. అతనా విన్నపాన్ని మన్నించాడు. ఇప్పుడు ప్రపంచకప్‌ కోసం స్టోక్స్‌ రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకుని జట్టులోకి రావాల్సిన అవసరాన్ని వన్డే కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ అతడికి వివరించాడు. తాను కోరితే మొయిన్‌ వచ్చినపుడు.. బట్లర్‌ అడిగితే స్టోక్స్‌ ఎలా కాదంటాడు? ఈ లాజిక్కే స్టోక్స్‌ రిటైర్మెంట్‌ రద్దులో కీలకమైంది.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని