KL Rahul : రాహుల్‌ ఈ పరీక్షలో నెగ్గితే ప్రతీకారం... ఓడిపోతే కెప్టెన్సీకి పోటీ తీవ్రం!

దక్షిణాఫ్రికా సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) కెప్టెన్‌గా రాణిస్తాడా? అవకాశాలెంత? ఒకవేళ రాణించకపోతే...

Published : 08 Jun 2022 14:12 IST

కెరీర్‌లో చాలా ఆటుపోట్లు చూశాడు లోకేశ్‌ రాహుల్‌ ఉరఫ్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul). ఇప్పుడిప్పుడే జట్టులో కీలక సభ్యుడిగా ఎదుగుతున్నాడు. ఆటను మెచ్చి ఇటీవల కెప్టెన్సీ ఇచ్చారు. అయితే తొలి పరీక్షలో ఫెయిల్‌ అయ్యాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికా సిరీస్‌ (India vs South Africa Series) రూపంలో రెండో పరీక్ష మొదలవుతోంది. ఈ సిరీస్‌లో రాహుల్‌ కెప్టెన్‌గా ఏం చేస్తాడు అనేదే ప్రశ్న. ఈ నేపథ్యంలో భారత్‌ సిరీస్‌ నెగ్గితే ఏమవుతుంది, ఓడితే ఏమవుతుందో ఓసారి చూద్దాం!

జూన్‌ 9 నుంచి దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే టీ20 సిరీస్‌ భారత జట్టుకు చాలా కీలకం. విరాట్‌ కోహ్లి, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ లాంటి మేటి, సీనియర్‌ ప్లేయర్లు లేకుండా ఆడుతున్నారు. ఇందులో భారత్‌ విజయం సాధిస్తే సీనియర్లు లేకున్నా గెలిచారనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే ఇది జట్టుగా చూస్తే. కెప్టెన్సీ ప్రకారం చూస్తే రోహిత్‌ శర్మ తర్వాత ఎవరు అనే ప్రశ్నకు... రాహులే అనే ఆన్సర్‌ దొరుకుతుంది. అయితే ఇదంత ఈజీ కాదు అంటున్నారు మాజీలు. కారణం రాహుల్‌ రీసెంట్‌ పర్‌ఫార్మెన్సే. ఆటగాడిగా కాదు, కెప్టెన్‌గా. 


కెప్టెన్‌గా అంతంతే...

కేఎల్‌ రాహుల్‌ ఇప్పటివరకు కెప్టెన్సీ చేసింది నాలుగు మ్యాచ్‌లకే. అందులో ఒకటి టెస్టు కాగా, మూడు టీ20లు. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్టుకి కెప్టెన్సీ వహించాడు. ఆ తర్వాత మూడు టీ20ల సిరీస్‌కి కూడా జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే ఈ నాలుగింటిలోనూ భారత్‌ ఓడిపోయింది. దీంతో రాహుల్‌ కెప్టెన్సీ మీద విమర్శలు, కౌంటర్లు, మీమ్స్‌ కనిపించాయి. కెప్టెన్‌గా రాహుల్‌ ఎంపిక సరైనదేనా? అనే ప్రశ్న టీమిండియా అభిమానుల్లో కలిగేలా చేశాడు. మరోవైపు టీ20 లీగ్‌లో కెప్టెన్సీలో లోపాలున్నాయని మాజీలు అంటున్నారు. అందుకే తొలుత బాగా ఆడినా ఫైనల్‌కు లఖ్‌నవూ చేరలేదని విశ్లేషించారు.

ఇప్పుడు మళ్లీ అదే దక్షిణాఫ్రికాతో మరో టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా చేస్తున్నాడు రాహుల్‌. అదే 9 నుంచి మొదలవుతుంది. ఇందులో భారత జట్టును రాహుల్‌ గెలిపిస్తే ప్రొటీజ్‌ జట్టు మీద ప్రతీకారం తీరినట్లు అవుతుంది. బోనస్‌గా కెప్టెన్సీ ఛాన్స్‌లు బలంగా ఉంటాయి. ఒకవేళ ఓడితే వెనుక మరో ముగ్గురు యువ క్రికెటర్లు కెప్టెన్సీ కోసం సిద్ధంగా ఉన్నారు. టీమిండియా చరిత్రలో ఇలా ఓ పార్ట్‌ టైమ్‌ కెప్టెన్‌కు ఇంతమంది పోటీ ఉండటం అరుదు అనే చెప్పాలి. 


పోటీ వీరి నుంచే... 

ప్రస్తుతం టీమిండియాలో చూస్తే రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, శ్రేయస్‌ అయ్యర్‌  లాంటి యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు. వీరి కెప్టెన్సీ ఎలా ఉంటుందో ఇప్పటికే టీ20లీగ్‌లో చూశాం కూడా. తొలుతగా రిషభ్‌ పంత్‌ను తీసుకుంటే... లీగ్‌లో దిల్లీని చక్కగానే నడిపించాడు. అందుకే జట్టు ఐదో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ప్రస్తుతం అతను వైస్‌ కెప్టెన్‌. కాబట్టి రాహుల్‌ విఫలమైతే తొలుత ఛాన్స్‌ వచ్చేది పంత్‌కే అంటున్నారు సీనియర్లు.

కెప్టెన్సీ పోటీదారుడిగా వైస్‌కెప్టెన్‌నే ఎందుకు ఉండాలి.. వేరే ఆటగాడు రేసులోకి రాకూడదా అనుకుంటే.. వినిపించే తొలి పేరు హార్దిక్‌ పాండ్య. ఈ ఏడాది టీ20 లీగ్‌లో గుజరాత్‌ను ముందుండి నడిపించి విజేతగా నిలిపాడు. అన్ని విభాగాలను ఎంతో పట్టుతో హ్యాండిల్‌ చేశాడని సీనియర్లు తెగమెచ్చేసుకున్నారు. నిజానికి విరాట్‌ కోహ్లీ తర్వాత కెప్టెన్సీ అర్హత ఉన్న కుర్ర క్రికెటర్లలో హార్దిక్‌ తొలి స్థానంలో ఉండేవాడు. ఫామ్‌ లేమి, గాయాలతో జట్టు నుంచి స్థానం కోల్పోయాడు. కెప్టెన్సీ పోటీదారుడి అర్హత కూడా కోల్పోయాడు. అయితే టీ20 లీగ్‌తో తిరిగి బలంగా పోటీలోకి వచ్చాడు. 

ఇక మిగిలింది శ్రేయస్‌ అయ్యర్‌. కెప్టెన్‌గా తొలిసారి కోల్‌కతా జట్టును ఈ ఏడాది లీగ్‌లో నడిపించాడు. అయితే జట్టు సమతూకంలో సమస్యలు వచ్చి ప్లే ఆఫ్స్‌కి చేరలేకపోయింది. కానీ శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో మాత్రం మ్యాజిక్‌ ఉందని సీనియర్లు అంటున్నారు. వచ్చే సీజన్లలో అయ్యర్‌ నుంచి ఆ మ్యాజిక్‌ చూడొచ్చంటున్నారు. ఆ లెక్కన శ్రేయస్‌ ఆఖరి పోటీదారుడు అవుతాడు. అయితే కెప్టెన్సీ పోటీలో తనకంటే ముందున్న పంత్‌, పాండ్య కంటే మైదానంలో శ్రేయస్‌ చాలా కూల్‌గా ఉంటాడు. ఇది బాగా కలిసొచ్చే అంశం. 


ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా సిరీస్‌ భారత భవిష్యత్తు కెప్టెన్‌ను నిర్ణయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రోహిత్‌ శర్మ వయసు రీత్యా ఇంకా ఎన్నాళ్లు కెప్టెన్సీ కొనసాగిస్తాడు అనేది తెలియడం లేదు. అందులో టీ20 లీగ్‌లో ముంబయి పేలవ ప్రదర్శన.. రోహిత్‌ టీ20 కెప్టెన్సీ మీద ప్రభావం చూపిస్తుందేమో అనే భయాలున్నాయి. దీంతోనే తర్వాతి కెప్టెన్‌ ఎవరు అనే ప్రశ్న, చర్చ, విశ్లేషణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని