Verstappen: రికార్డుల రారాజు వెర్‌స్టాపెన్‌... ఈ రేసు వీరుడి కథ తెలుసా?

ఫార్ములా వన్‌ అనగానే.. పాత తరం అభిమానులకు గుర్తొచ్చే పేరు మైకెల్‌ షుమాకర్‌. ఇప్పటి అభిమానులైతే లూయిస్‌ హామిల్టన్‌ పేరు చెబుతారు. అసాధారణ వేగంతో ట్రాక్‌పై రయ్‌మంటూ విజయాల వేటలో సాగిన ఈ దిగ్గజాలు వేసిన ముద్ర అలాంటిది.

Published : 03 Sep 2023 10:17 IST

ఫార్ములా వన్‌ అనగానే.. పాత తరం అభిమానులకు గుర్తొచ్చే పేరు మైకెల్‌ షుమాకర్‌. ఇప్పటి అభిమానులైతే లూయిస్‌ హామిల్టన్‌ పేరు చెబుతారు. అసాధారణ వేగంతో ట్రాక్‌పై రయ్‌మంటూ విజయాల వేటలో సాగిన ఈ దిగ్గజాలు వేసిన ముద్ర అలాంటిది. మధ్యలో ఎంతో మంది వచ్చారు.. వెళ్లారు. కానీ ఈ ఇద్దరి పేర్లు మాత్రం ఎఫ్‌1 చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు వీళ్ల బాటలోనే మరో సంచలన రేసర్‌ దూసుకొచ్చాడు. ఇప్పటికే వరుసగా రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అతను.. రికార్డుల వేటలో సాగుతూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. స్టీరింగ్‌ను మంత్రదండంలా మారుస్తూ.. నరాల్లోకి వేగాన్ని ఎక్కించి.. ట్రాక్‌పై కారుతో మెరుపులా దూసుకెళ్తున్నాడు. అతనే.. మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (max verstappen). ప్రస్తుతం ఎఫ్‌1 ట్రాక్‌పై తిరుగులేని రారాజు ఈ డచ్‌ రేసర్‌. 

రికార్డుల వేటలో..

వెర్‌స్టాపెన్‌ రేసింగ్‌ ప్రయాణమే ఓ సంచలనం. అతను కారుతో ట్రాక్‌పై అడుగుపెడితే రికార్డులు అతనికి సలాం కొడుతున్నాయి. ముఖ్యంగా గత మూడేళ్లుగా అతని ప్రదర్శన మామూలుగా లేదు. దిగ్గజం హామిల్టన్‌ను వెనక్కి నెట్టి మరీ ఫార్ములావన్‌లో వెర్‌స్టాపెన్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. 2021లో తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఈ రెడ్‌బుల్‌ రేసర్‌.. 2022లోనూ ఆ టైటిల్‌ నిలబెట్టుకున్నాడు. ఈ ఏడాది కూడా హ్యాట్రిక్‌ టైటిల్‌ సాధించేలా కనిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో అయితే ట్రాక్‌పై అతని దూకుడు మరో స్థాయికి చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ 13 గ్రాండ్‌ ప్రి రేసులు జరిగితే.. వెర్‌స్టాపెన్‌ ఏకంగా 11 రేసుల్లో గెలవడం ట్రాక్‌పై అతని ఆధిపత్యానికి నిదర్శనం. 

ఇక వరుసగా గత 9 రేసుల్లో అయితే అతనిదే అగ్రస్థానం. మిగతా రేసర్లు పోటీ పడేది రెండో స్థానం కోసమే అన్నట్లు వెర్‌స్టాపెన్‌ దూసుకెళ్తున్నాడు. మరో గ్రాండ్‌ ప్రి రేసు నెగ్గితే.. ఎఫ్‌1 చరిత్రలోనే వరుసగా పది రేసులు గెలిచిన తొలి రేసర్‌గా వెర్‌స్టాపెన్‌ నిలుస్తాడు. ఆదివారం జరిగే ఇటాలియన్‌ గ్రాండ్‌ ప్రితో అతనా రికార్డు సాధించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ రేసులోనూ వెర్‌స్టాపెన్‌ 339 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఉన్న పీరెజ్‌ (201)కు వెర్‌స్టాపెన్‌కు మధ్య 138 పాయింట్ల అంతరం ఉంది. 

తండ్రి బాటలో.. 

బెల్జియంలో పుట్టిన 25 ఏళ్ల వెర్‌స్టాపెన్‌ నెదర్లాండ్స్‌ తరపున రేసుల్లో పోటీ పడుతున్నాడు. రెడ్‌బుల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వెర్‌స్టాపెన్‌ రక్తంలోనే రేసింగ్‌ ఉంది. అతని తండ్రి జోస్‌ వెర్‌స్టాపెన్‌ కూడా ఒకప్పటి ఎఫ్‌1 రేసరే. అతని తల్లి సోఫీ కుంపెన్‌కు కార్టింగ్‌లో ప్రవేశం ఉంది. దీంతో నాలుగేళ్ల వయసులోనే గో కార్టింగ్‌తో వెర్‌స్టాపెన్‌ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. క్రమంగా రేసింగ్‌పై పట్టు సాధించాడు. వేగాన్ని పెంచుకున్నాడు. పిన్న వయసులోనే ఎన్నో ఘనతలు సాధించాడు. ఎఫ్‌1 అరంగేట్రం చేసిన, గ్రాండ్‌ ప్రి రేసు గెలిచిన తక్కువ వయస్సు ఆటగాడిగా.. ఇలా ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. 

టోరో రోసో (ఇప్పుడు ఆల్ఫాటారి) తరపున 2015 ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ ప్రితో 17 ఏళ్లకే వెర్‌స్టాపెన్‌ ఎఫ్‌1లో తొలి అడుగు వేశాడు. 2016 నుంచి రెడ్‌బుల్‌తో కొనసాగుతున్నాడు. అదే ఏడాది 18 ఏళ్ల వయసులోనే స్పానిష్‌ గ్రాండ్‌ ప్రి గెలిచాడు. ఓ గ్రాండ్‌ ప్రి రేసు గెలిచిన, ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి డచ్‌ రేసర్‌ అతనే. పరిమితులను దాటి సాగాలనే అర్థం వచ్చేలా ట్విటర్‌లో తన గురించి చెప్పుకున్న వెర్‌స్టాపెన్‌ ట్రాక్‌పై అదే చేస్తున్నాడు. ఇప్పటివరకూ 176 రేస్‌లకు గాను 90 వాటిల్లో పోడియంపై స్థానం సంపాదించాడు. 46 విజయాలు సాధించాడు. 

- ఈనాడు, క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని