Rachin Ravindra: రాహుల్‌ + సచిన్‌ = రచిన్‌... అదరగొడుతున్న కివీస్‌ ఆల్‌రౌండర్‌

ఆ తల్లిదండ్రులకు బాబు పుట్టాడు. అతనికి ఏం పేరు పెట్టాలా? అని తెగ ఆలోచిస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు భారత క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ తెందుల్కర్, రాహుల్‌ ద్రవిడ్‌ ఆటంటే మహా ఇష్టం. దీంతో ఈ ఇద్దరు దిగ్గజాల పేరు కలిసేలా తనయుడికి నామకరణం చేశారు.

Updated : 12 Oct 2023 19:57 IST

ఆ తల్లిదండ్రులకు బాబు పుట్టాడు. అతనికి ఏం పేరు పెట్టాలా? అని తెగ ఆలోచిస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు భారత క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ తెందుల్కర్, రాహుల్‌ ద్రవిడ్‌ ఆటంటే మహా ఇష్టం. దీంతో ఈ ఇద్దరు దిగ్గజాల పేరు కలిసేలా తనయుడికి నామకరణం చేశారు. రాహుల్‌ పేరులో నుంచి ‘ర’.. సచిన్‌ పేరులో నుంచి ‘చిన్‌’ తీసుకుని రచిన్‌ అని మొదటి పేరు పెట్టారు. పూర్తిగా రచిన్‌ రవీంద్ర (Rachin Ravindra) అని పెట్టారు. ఈ పేరు ఇప్పుడు ఎక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారా? ఇప్పుడు జరుగుతున్న ప్రపంచకప్‌ (World Cup 2023)లో అందరూ మాట్లాడుకుంటుంది ఈ రచిన్‌ రవీంద్ర గురించే. న్యూజిలాండ్‌ (New Zealand) తరపున ఈ యువ ఆల్‌రౌండర్‌ అదరగొడుతూ.. తన పేరు మార్మోగేలా చేసుకున్నాడు. భారత సంతతి కుటుంబం, చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ప్రేమ, బాస్కెట్‌బాల్‌ దిగ్గజాన్ని ఆరాధించడం, అనంతపురంలో శిక్షణ.. ఇలా రచిన్‌ కథలో ఆసక్తికర అంశాలెన్నో ఉన్నాయి.

ఓ 13 ఏళ్ల వెనక్కి వెళ్తే.. అది లోవర్‌ హట్‌ వెల్లింగ్‌టన్‌లోని హట్‌ రీక్రియేషన్‌ మైదానం. అప్పుడు అక్కడ క్రికెట్‌ వెల్లింగ్‌టన్‌ యూత్‌ డెవలప్‌మెంట్‌ కోచ్‌గా ఉన్న ఇవాన్‌ టిసెరా.. 10 ఏళ్ల బాలుడిని ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్‌ చేయమన్నాడు. ఆ నాలుగున్నర అడుగుల బాలుడు ధైర్యంగా స్టంప్స్‌ ముందు నిలబడ్డాడు. ఎదురుగా చూస్తేనేమో సుమారు ఆరడగుల పేసర్‌ హెన్రీ వాల్ష్‌. ఈ బాలుడికి ఇతనితో ఎందుకు బౌలింగ్‌ చేయిస్తున్నాడని అక్కడున్న వాళ్లందరిలోనూ సందేహం కలిగింది. ఆ బాలుడు తట్టుకోగలడా? అనే ప్రశ్నలు రేకెత్తాయి. కానీ 20 నిమిషాలు గడిచాయి. అప్పుడందరూ ఆ బాలుడి బ్యాటింగ్‌ను మెచ్చుకుంటున్నారు. ఆ పేసర్‌ బౌలింగ్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌ నైపుణ్యాలను ప్రదర్శించిన ఆ బాలుడే రచిన్‌ రవీంద్ర. 

మన దగ్గరే..

రచిన్‌ తల్లిదండ్రులు రవి కృష్ణమూర్తి, దీప కృష్ణమూర్తి. రవి బెంగళూరులో క్లబ్‌ స్థాయి క్రికెట్‌ ఆడేవాడు. 1990ల్లో కుటుంబంతో న్యూజిలాండ్‌కు వలస వెళ్లారు. అయినా క్రికెట్‌పై ఇష్టంతో రవి.. అక్కడ హాట్‌ హాక్స్‌ క్రికెట్‌ క్లబ్‌ ఏర్పాటు చేశాడు. రవికి టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు జవగళ్‌ శ్రీనాథ్‌ మంచి మిత్రుడు. దీంతో తన క్లబ్‌ తరపున రవి భారత్‌కూ ఆటగాళ్లను తీసుకొస్తున్నాడు. వెల్లింగ్‌టన్‌లోనే పుట్టిన రచిన్‌కు చిన్నప్పటి నుంచే క్రికెట్‌ అంటే పిచ్చి పట్టుకుంది. మూడేళ్ల వయసులో ప్లాస్టిక్‌ బ్యాటు పట్టుకుని, బంతి వేయాలని తల్లిదండ్రులను అడిగేవాడు. ఇప్పుడు బ్యాట్, బంతి మారింది అంతే.. ఆటపై అతని ప్రేమ అలాగే కొనసాగుతోంది. అదే అతణ్ని ఈ స్థాయికి తెచ్చింది. 

తండ్రే అతనికి క్రికెట్‌ ఓనమాలు నేర్పాడు. రచిన్‌ కెరీర్‌లో తెలుగు గడ్డ పాత్ర కూడా ఉందనే చెప్పాలి. హాట్‌ హాక్స్‌ క్రికెట్‌ క్లబ్‌ తరపున వచ్చి అనంతపురంలోని రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌లో నాలుగేళ్ల పాటు శీతాకాలంలో ప్రాక్టీస్‌ కొనసాగించాడు. ఈ క్లబ్‌ తరపున ఉప్పల్‌ స్టేడియంలోనూ మ్యాచ్‌లాడాడు. మరోవైపు రచిన్‌ ధరించే 8వ నంబర్‌ జెర్సీ వెనుక మరో కథ ఉంది. దివంగత దిగ్గజ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ కోబి బ్రయాంట్‌ను ఆరాధించే రచిన్‌.. ఎన్‌బీఏలో మొదటిసారి ఆడినప్పుడు బ్రయాంట్‌ వేసుకున్న జెర్సీ నంబర్‌ 8నే ఇప్పుడు తన జెర్సీ నంబర్‌గా మార్చుకున్నాడు. 

ఎదిగాడిలా.. 

రచిన్‌ కివీస్‌ తరపున.. 2016, 2018లో అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడాడు. న్యూజిలాండ్‌- ఎ జట్టు, దేశవాళీల్లో వెల్లింగ్‌టన్‌ తరపున రాణించాడు. 2021లో బంగ్లాదేశ్‌తో టీ20లతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను భారత్‌పైనే తొలి టెస్టు ఆడటం విశేషం. నిరుడు ఇంగ్లాండ్‌ కౌంటీల్లోనూ డర్హం జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కౌంటీ అరంగేట్రంలోనే డబుల్‌ సెంచరీ బాదాడు. ఈ ఏడాదే వన్డేల్లో అడుగుపెట్టాడు. మైకెల్‌ బ్రాస్‌వెల్‌ గాయం రచిన్‌కు వరంగా మారింది. మొదట ఈ ప్రపంచకప్‌ జట్టు ఎంపిక పరిగణలో రచిన్‌ లేడు. కానీ బ్రాస్‌వెల్‌ గాయంతో అందుబాటులో లేకపోవడంతో రచిన్‌ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. భారత్‌లోని స్పిన్‌ పిచ్‌లపై అతను జట్టుకు కీలకమవుతాడని కివీస్‌ భావించింది. 

కానీ ఇప్పుడు టాప్‌ఆర్డర్‌ బ్యాటర్‌గానూ సత్తాచాటుతున్నాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అజేయ సెంచరీ చేశాడు. ప్రపంచకప్‌ అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ చేసిన మూడో కివీస్‌ ఆటగాడిగా నిలిచాడు. 82 బంతుల్లోనే మూడంకెల స్కోరు చేరుకున్న అతను.. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లోనూ అర్ధశతకం సాధించాడు. ఉప్పల్‌ పిచ్‌ పరిస్థితులపై అవగాహన ఉన్న రచిన్‌ పాకిస్థాన్‌తో వార్మప్‌ మ్యాచ్‌లో 97 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు పడగొడుతున్నాడు. 23 ఏళ్లకే గొప్ప పరిణతి ప్రదర్శిస్తున్న అతను.. భవిష్యత్‌లో అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదగడం ఖాయమనే చెప్పాలి.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని