Rinku Singh: రింకూ ఆ పాత్రకు సరిపోతాడా!

భారత క్రికెట్‌ జట్టులో అయిదు-ఆరు స్థానాలు చాలా కీలకం! ఎందుకంటే మొదట బ్యాటింగ్‌ చేసినా.. లేక ఛేదనకు దిగినా ఆ స్థానంలో వచ్చే బ్యాటర్‌ మీద ఎంతో బాధ్యత ఉంటుంది. మరెంతో ఒత్తిడి ఉంటుంది. 

Updated : 04 Dec 2023 19:51 IST

భారత క్రికెట్‌ జట్టులో అయిదు-ఆరు స్థానాలు చాలా కీలకం! ఎందుకంటే మొదట బ్యాటింగ్‌ చేసినా.. లేక ఛేదనకు దిగినా ఆ స్థానంలో వచ్చే బ్యాటర్‌ మీద ఎంతో బాధ్యత ఉంటుంది. మరెంతో ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు టెయిలెండర్ల అండతో జట్టుకు విజయాన్ని అందించాల్సి వస్తుంది. ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. ఇలాంటి పాత్రను ఒకప్పుడు మహేంద్రసింగ్‌ ధోని అద్భుతంగా పోషించాడు. యువరాజ్, రైనా కూడా కొన్నేళ్లు ఈ స్థానాల్లో ఒదిగిపోయారు. కానీ వాళ్లెవరూ ఇప్పుడు జట్టులో లేరు. ఆ తర్వాత చాలామంది వచ్చినా కుర్చీల ఆటలో మారిపోయింది ఫినిషర్‌ పాత్ర. కొత్తగా జట్టులోకి వచ్చిన రింకు సింగ్‌ (Rinku Singh) మాత్రం ఫినిషర్‌ పాత్రకు టైలర్‌మేడ్‌లా కనిపిస్తున్నాడు. కూల్‌గా ఆడుతూ జట్టును ఆదుకుంటున్నాడు. మరి అతడు ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయగలుగుతాడా!

ఐపీఎల్‌లో ఆ ఆట చూసి

2023 ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున రింకు సింగ్‌ ఆట చూసి అబ్బురపడని వాళ్లు లేరు. అంతగా ఆకట్టుకున్నాడీ లెఫ్ట్‌ హ్యాండర్‌. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో యశ్‌ దయాళ్‌ ఓవర్లో వరుసగా అయిదు సిక్స్‌లు బాదేసి కోల్‌కతాకు సంచలన విజయాన్ని అందించాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్‌ రింకూను ఎక్కడికో తీసుకెళ్లింది. అతడిపై అంచనాలను పెంచేసింది. అక్కడి నుంచి రింకూ ఫినిషర్‌గా మారిపోయాడు. అంచనాలను అందుకుంటూ ముందుకు సాగాడు. ఈ స్థిరత్వమే అతడికి భారత జట్టులో చోటు కల్పించింది. ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియాకు ప్రాతినిథ్యం వహించి జట్టు స్వర్ణం గెలవడంలో కీలకపాత్ర పోషించాడీ లెఫ్ట్‌ హ్యాండర్‌. పేద కుటుంబంలో పుట్టినా సీనియర్‌ క్రికెటర్ల అండతో ఎదిగిన రింకూ భారత జట్టుకు ఆడడం పెద్ద కలే.

👉 Follow EENADU WhatsApp Channel

కానీ ఐపీఎల్‌ అతడికి ఈ సువర్ణావకాశాన్ని తెచ్చి పెట్టింది. కోల్‌కతాకు ఫినిషర్‌గా సమర్థంగా పాత్ర పోషించిన రింకు.. ఇప్పుడు భారత జట్టుకు అదే పాత్ర ఒదిగిపోతున్నాడు. అతడు విధ్వంసక బ్యాటర్‌గా మారడం వెనుక కోల్‌కతా కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ది కీలకపాత్ర. ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ రింకు ఆకట్టుకున్నాడు. విశాఖపట్నంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్సర్‌ బాది వాహ్‌వా అనిపించాడు. మూడో టీ20లోనూ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఒత్తిడికి లొంగకుండా అతడు ఆడుతున్న తీరు మహేంద్రసింగ్‌ ధోనిని తలపిస్తోంది. వచ్చిన దగ్గర నుంచి బాదేయడం అంటే అందరికి కుదరదు. ముందు కుదురుకోవాలి. ఆ తర్వాత భారీ షాట్లకు దిగాలి అనే చూస్తారు. కానీ రింకు వాళ్లకు భిన్నం. తొలి బంతికి సిక్సర్‌ కొట్టగలడు. ఆఖరి బంతినీ స్టాండ్స్‌లోకి పంపగలడు. ఈ పవర్‌ హిట్టింగ్‌ ప్రత్యర్థి బౌలర్లలో కలవరం రేపుతోంది.

ముందుంది దక్షిణాఫ్రికా..

రింకు ప్రస్తుతం గొప్పగానే ఆడుతున్నాడు. ఐస్‌ కూల్‌ పెర్ఫార్‌మెన్స్‌లతో అదరగొడుతున్నాడు. కానీ అతడు మున్ముందు మరిన్ని పరీక్షలు ఎదుర్కొని రాటుదేలాలి. పేస్‌ బౌలింగ్‌కు అనుకూలించే దక్షిణాఫ్రికా పిచ్‌లపై సత్తా చాటడం రింకుకు అత్యావశ్యకం. ఆ తర్వాత 2024 ఐపీఎల్‌నూ ఆ ఫామ్‌ను కొనసాగిస్తే కచ్చితంగా వచ్చే ఏడాది వెస్టిండీస్‌-అమెరికా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో రింకును భారత జట్టులో చూడొచ్చు. సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లి టీ20 ప్రపంచకప్‌లో ఆడే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. ఈలోగా యువ ఆటగాళ్లు కుదురుకునే అవకాశం వచ్చింది. ఈ స్థితిలో ఫినిషర్‌గా రింకు కుదురుకుంటే భారత జట్టుకు ఓ ఇబ్బంది తప్పినట్లే. ఎందుకంటే రవీంద్ర జడేజా ఎడతెరిపి లేకుండా ఆడుతున్నాడు. హార్దిక్‌ పాండ్య గాయాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ స్థితిలో రింకు రిజర్వ్‌ ఫినిషర్‌గా ఉంటే కచ్చితంగా భారత్‌కు అది మేలే చేస్తుంది. 

             - ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని