Sarfaraz Khan - Musheer Khan: అన్న వచ్చేశాడు.. తమ్ముడు దంచేస్తున్నాడు

ముంబయి యువ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ఖాన్‌ ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ఎంపికయ్యాడు. మరోవైపు అతడి తమ్ముడు ముషీర్‌ఖాన్‌ (Musheer Khan) అండర్‌-19 ప్రపంచకప్‌లో అటు బ్యాట్‌, ఇటు బంతితో అదరగొట్టేస్తున్నాడు.

Published : 01 Feb 2024 02:03 IST

ఒక్క ఛాన్స్‌.. ఒక్క ఛాన్స్‌ అంటూ ఏళ్ల తరబడి భారత జట్టులో స్థానం కోసం ఎదురు చూశాడు ముంబయి యువ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ఖాన్‌ (Sarfaraz Khan). ఇప్పుడు అతడికి ఆ ఒక్క ఛాన్స్‌ వచ్చేసింది. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ఎంపికయ్యాడు. మరోవైపు అతడి తమ్ముడు ముషీర్‌ఖాన్‌ (Musheer Khan) అండర్‌-19 ప్రపంచకప్‌లో బ్యాట్, బంతితో అదరగొట్టేస్తున్నాడు. 

ఆనాడు ఏడ్చినవాడే

దేశవాళీలో ఎంత గొప్ప ప్రదర్శనలు చేసినా భారత జట్టుకు ఎంపిక కాకుండానే రిటైర్‌ అయిన ఆటగాళ్లు చాలామందే ఉన్నారు. జట్టులో స్థానం సంపాదించాలంటే ఒకప్పుడు పెద్ద పరీక్షగా ఉండేది. స్టార్లతో నిండిన టీమ్‌ఇండియాలో స్థానం అందని ద్రాక్షలా కనిపించేది. కానీ ఐపీఎల్‌ పుణ్యమా అని అనుభవం లేకపోయినా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు ఇప్పటి కుర్రాళ్లు. అయితే సర్ఫరాజ్‌ మాత్రం ఆ కోవలోకి రాడు. దేశవాళీలో పరుగుల వరద పారించినా.. సెంచరీల మీద సెంచరీలు చేసినా సెలక్టర్లు ఈ కుర్రాడిని పట్టించుకోలేదు. 45 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 3912 పరుగులు చేసిన అతడి ఖాతాలో 14 సెంచరీలు, 11 అర్ధసెంచరీలు ఉన్నాయి. 

ఆస్ట్రేలియా దిగ్గజం  బ్రాడ్‌మన్‌ (95.14) తర్వాత అత్యధిక ఫస్ట్‌క్లాస్‌ సగటు ఉన్న ఘనత అతడి(80.47)దే. 2022లో మధ్యప్రదేశ్‌తో రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ చేశాక ఈ యువ బ్యాటర్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎన్ని ఘనతలు సాధించినా సెలక్టర్లు తనను పట్టించుకోకపోవడమే అందుకు కారణం. బ్యాట్‌తో అదరగొట్టినా ఫిట్‌గా లేకపోవడం శాపంగా మారింది. ఫిట్‌గా ఉన్నోళ్లే దేశానికి ఆడుతున్నారా ప్రతిభతో పని లేదా అని సునీల్‌ గావస్కర్‌ లాంటి దిగ్గజం ప్రశ్నించాడు. ఆ తర్వాత కాస్త బరువు తగ్గించుకొని ఫామ్‌ని కొనసాగించిన రాజ్‌ ఎట్టకేలకు భారత జట్టులో ఆడే అవకాశాన్ని సంపాదించాడు. 

తుది జట్టులోకొస్తాడా!

భారత జట్టులోకి రావాలన్న కల తీరింది. మరి అతడు బరిలో దిగేది ఎప్పుడు? ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులోనే అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోహ్లి లాంటి సీనియర్లు లేక డీలా పడిన మిడిల్‌ ఆర్డర్‌లో  ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్‌ని చేర్చడం లాభమే అని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రజత్‌ పటీదార్‌ రూపంలో బ్యాకప్‌ బ్యాటర్‌ అందుబాటులో ఉన్నాడు. కానీ దేశవాళీలో అదరగొట్టిన సర్ఫరాజ్‌కే తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పటీదార్‌ ఇటీవల ఎర్ర బంతి కన్నా తెల్ల బంతి క్రికెట్‌నే ఎక్కువగా ఆడడం మరో కారణం. ఒకవేళ సర్ఫరాజ్‌కే చోటు దక్కితే ఇంగ్లిష్‌ స్పిన్నర్లను ఎదుర్కొంటాడో చూడాలి.

ముషీర్‌ అదరహో

మరోవైపు అతని తమ్ముడు ముషీర్‌ఖాన్‌ అండర్‌-19 ప్రపంచకప్‌లో చెలరేగుతున్నాడు. అతడు ఇప్పటిదాకా 4 మ్యాచ్‌లు ఆడి 81.25 సగటుతో 325 పరుగులు చేశాడు. అన్న మాదిరే దూకుడుగా ఆడుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. టోర్నీలో ప్రస్తుతం టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. భిన్నమైన షాట్లతో పరుగులు సాధిస్తున్న ముషీర్‌.. పేస్, స్పిన్‌ అనే తేడా లేకుండా బాదేస్తున్నాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో సెంచరీ సాధించే క్రమంలో బ్యాక్‌ఫుట్‌పై కొన్ని కళ్లు చెదిరే షాట్లు కొట్టాడు. రివర్స్‌ స్వీప్, ర్యాంప్‌ షాట్లతోనూ అదరగొట్టాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ అయిన ముషీర్‌ 4 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఛేంజ్‌ బౌలర్‌గా బరిలో దిగి భాగస్వామ్యాలు విడగొట్టి ప్రత్యర్థి జట్లను దెబ్బ కొడుతున్నాడు. ఇదే జోరు మున్ముందు ప్రదర్శిస్తే భారత్‌కు భవిష్యత్‌లో మరో ఆల్‌రౌండర్‌ సిద్ధమైనట్లే. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని