Dilshan Madushanka: బూట్లు అరువు తెచ్చుకున్నవాడే! ప్రపంచకప్‌లో అదరగొట్టిన మదుశంక..

ప్రపంచకప్‌లో శ్రీలంక అధ్వాన్న ప్రదర్శన చేసింది. ఒక మాదిరి జట్టే అయినా అఫ్గానిస్థాన్‌ స్థాయిలో కూడా ఆడలేకపోయింది. వరుస పరాభవాలతో సెమీఫైనల్‌కు దూరమైంది. కానీ ఆ జట్టులో ఒక్కడు మాత్రం అదిరే బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒకవైపు జట్టు ఓడుతున్నా తాను మాత్రం ప్రతి మ్యాచ్‌లోనూ శాయశక్తులా లంకను గెలిపించేందుకు ప్రయత్నించాడు అతడే దిల్షాన్‌ మదుశంక (Dilshan Madushanka).

Published : 11 Nov 2023 16:06 IST

 

ప్రపంచకప్‌లో శ్రీలంక (Sri Lanka) అధ్వాన్న ప్రదర్శన చేసింది. ఒక మాదిరి జట్టే అయినా అఫ్గానిస్థాన్‌ స్థాయిలో కూడా ఆడలేకపోయింది. వరుస పరాభవాలతో సెమీఫైనల్‌కు దూరమైంది. కానీ ఆ జట్టులో ఒక్కడు మాత్రం అదిరే బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒకవైపు జట్టు ఓడుతున్నా తాను మాత్రం ప్రతి మ్యాచ్‌లోనూ శాయశక్తులా లంకను గెలిపించేందుకు ప్రయత్నించాడు అతడే దిల్షాన్‌ మదుశంక (Dilshan Madushanka). ఈ యువ పేసర్‌ 9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. సెమీఫైనల్‌ చేరని జట్లలో ఇన్ని వికెట్లు పడగొట్టింది మదుశంక మాత్రమే. ఈ 23 ఏళ్ల కుర్రాడు లంక తరఫున ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. 

జాలరి కుటుంబం

మదుశంక పేద కుటుంబంలో పుట్టాడు. అతడి తండ్రి ఓ జాలరి. ఇంట్లో దుర్భర జీవితం ఉండేది. క్రీడల వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదక్కడ. కానీ క్రికెట్‌ అంటే ఎంతో ఆసక్తిని పెంచుకున్న మదుశంక మంచి క్రికెటర్‌ కావాలని కలలు కనేవాడు. అయితే క్రికెట్‌ ఖర్చుతో కూడుకున్నది కావడంతో అతడు ఈ ఆటలో కొనసాగలేకపోయాడు. క్రికెట్‌ పరికరాలు కొనే స్థోమత లేకపోవడంతో కొంతకాలం ఆట మానేశాడు. డబ్బులు తక్కువ ఖర్చయ్యే సాఫ్ట్‌బాల్‌ క్రికెట్‌ వైపు వెళ్లాడు. స్థానికంగా జరిగే మ్యాచ్‌ల్లో సత్తా చాటేవాడు. ఈ క్రమంలోనే మదుశంక ప్రతిభను గుర్తించిన ఓ కోచ్‌ అతడిని శ్రీలంక అండర్‌-19 జట్లకు నెట్‌బౌలర్‌గా ఎంపిక అయ్యేందుకు కృషి చేశాడు. ఈ నెట్‌ బౌలింగ్‌ సెషన్లకు వెళ్లడానికి కూడా అతడికి బూట్లు అందుబాటులో లేకపోవడంతో వేరే ఆటగాళ్లను అడిగి తీసుకుని వెళ్లేవాడు. ఇది అతడినెంతో బాధించేది. మంచి షూస్‌ కొనుక్కోవాలని ఆరాటపడేవాడు.

వాస్‌ మార్గనిర్దేశనంలో

అండర్‌-19 జట్లకు నెట్‌ బౌలర్‌గా ఉన్న సమయంలో శ్రీలంక దిగ్గజ పేసర్‌ చమిందా వాస్‌ కళ్లలో పడడం మదుశంకకు కలిసొచ్చింది. అతడిలో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడే సత్తా ఉందని గుర్తించిన వాస్‌.. మదుశంకను ప్రోత్సహించాడు. తనలాగే లెఫ్ట్‌ఆర్మ్‌ మీడియం పేసర్‌ అయిన అతడిని జాతీయ జట్టులో ఎంపిక చేయడంలో కీలకపాత్ర పోషించాడు. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు మదుశంక. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచి సత్తా చాటాడు. ఆ తర్వాత దుబాయ్‌లో జరిగిన ఆసియాకప్‌లోనూ ఆకట్టుకున్నాడు. రెగ్యులర్‌ పేసర్‌ చమీరకు గాయం కావడంతో ప్రపంచకప్‌ జట్టులో ఆడే బంగారు అవకాశాన్ని పట్టేశాడు మదుశంక. ఇప్పటిదాకా 14 వన్డేల్లో 31 వికెట్లు తీశాడీ కుర్రాడు. భారత్‌తో ప్రపంచకప్‌ మ్యాచ్‌లో అయిదు వికెట్లతో అదరగొట్టాడు. చక్కని లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు తోడు వైవిధ్యాన్ని జోడించి మదుశంక వికెట్ల వేటలో సాగాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో అతడి బౌలింగ్‌ ఆకట్టుకుంది. పొదుపుగా బంతులు వేస్తూనే వికెట్లు తీశాడీ కుర్రాడు. పేస్‌ బౌలింగ్‌కు అనుకూలించని పిచ్‌లపైనా రాణించడం ఈ కుర్రాడి సత్తాకు నిదర్శనం. తమ జట్టు సెమీస్‌ చేరకపోయినా అద్భుత బౌలింగ్‌తో భవిష్యత్‌ తారగా నిలిచాడు మదుశంక. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని