Kohli: అందరిలో ఒకడిగా మొదలై.. ఒకే ఒక్కడిగా..

సచిన్‌ను మించిన పరుగుల ప్రవాహంతో విరాట్‌ కోహ్లి క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాడు. ఒక్కో రికార్డును తన ఖాతాలో వేసుకుంటూ జర్నీని విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నాడు. 

Updated : 12 Nov 2023 11:33 IST

కోహ్లి ప్రయాణం.. ఒక స్ఫూర్తి పాఠం

సచిన్ టెండుల్కర్ క్రికెట్ నుంచి రిటైరవుతున్నపుడు అతడి రికార్డులను ఎవరైనా బద్దలు కొట్టగలరని అంటే నవ్వుకునే ఉంటారు. మానవమాత్రులకు సాధ్యమా అనిపించేలా పరుగులు, సెంచరీల పరంగానే కాక ఇంకా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు మాస్టర్ బ్లాస్టర్. అవన్నీ ఎప్పటికీ పదిలంగా ఉంటాయనే అనుకున్నారు అందరూ. కానీ విరాట్ కోహ్లి (Virat Kohli) అనే వేటగాడు వచ్చి ఒక్కో సచిన్ రికార్డును బద్దలు కొడుతూ సాగిపోతున్నాడు. సచిన్‌ను మించిన పరుగుల ప్రవాహంతో క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాడు. ఒక సామాన్య ఆటగాడిలా ప్రయాణం మొదలుపెట్టి.. సచిన్‌నే మించడం అంటే మాటలు కాదు. మాస్టర్ నుంచే కాక సుదీర్ఘ కాలం తనకు కెప్టెన్‌గా ఉన్న ధోని నుంచి పాఠాలు నేర్చుకుని.. విరాట్ తనను తాను దిద్దుకున్న తీరు.. ప్రపంచ క్రికెట్లో ఎదిగిన వైనం భావితరాలకు ఒక స్ఫూర్తి పాఠమే.

‘బిజినెస్‌మ్యాన్’ సినిమాలో హీరో ఒక మాటంటాడు. ‘‘నీ లక్ష్యం 10 మైళ్లయితే.. 11వ మైలును లక్ష్యంగా పెట్టుకో’’ అని. విరాట్ కోహ్లిది ఇలాంటి ఆలోచన తీరే కావచ్చు. ఎందుకంటే సచిన్ నెలకొల్పిన చాలా రికార్డులకు దగ్గరగా రావడం కూడా కష్టమనుకుంటే.. సచిన్ కంటే వేగంగా ఆ రికార్డులను అందుకుని.. తర్వాతి తరాల్లో ఎవ్వరూ అందుకోని కొత్త రికార్డులను అతను నెలకొల్పుతున్నాడు. ఇటీవలే విరాట్ వన్డేల్లో 49వ శతకంతో సచిన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే. సచిన్ 20 ఏళ్ల వ్యవధిలో సాధించిన ఆ రికార్డును 11 ఏళ్లకే అందుకుని ఔరా అనిపించాడు విరాట్. నిజానికి సచిన్ రోజుల్లో మాదిరి భారత జట్టు ఏడాది వ్యవధిలో ఇబ్బడిముబ్బడిగా వన్డేలేమీ ఆడట్లేదు. టీ20ల జోరు పెరిగి గత ఐదారేళ్లలో వన్డేల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయినా సరే.. ఇంత వేగంగా సచిన్ రికార్డును అందుకోవడం అనూహ్యం. సచిన్ 463 మ్యాచ్‌లాడి 452 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధిస్తే.. విరాట్ 289 మ్యాచ్‌లు, 277 ఇన్నింగ్స్‌ల్లోనే 49వ శతకాన్నందుకున్నాడు. సచిన్‌కు, కోహ్లికి మధ్య అంతరం 175 ఇన్నింగ్స్‌లు కావడం గమనార్హం. సచిన్ మొత్తంగా 18426 పరుగులు సాధిస్తే.. కోహ్లి అప్పుడే 13626 పరుగులకు చేరుకున్నాడు. మామూలుగా మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పటితో పోలిస్తే ఛేదనల్లో ఒత్తిడి ఎక్కువ కాబట్టి పరుగులు, శతకాలు తక్కువ ఉంటాయి. సగటు కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. 

కానీ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పటి కంటే రెండోసారి ఆడుతున్నపుడే కోహ్లి పరుగులు, శతకాలు, సగటు ఎక్కువగా ఉండడం విశేషం. విజయవంతమైన ఛేదనల్లో కోహ్లి సగటు 90కి పైనే. 96 ఇన్నింగ్స్‌ల్లో 23 శతకాలతో 5786 పరుగులు సాధించాడు. ఇందులోనూ సచిన్‌ను అధిగమించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అన్ని వన్డే ఛేదనల్లో కలిపి కోహ్లి 27 శతకాలు సాధించాడు. భారత్ తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు 22 శతకాలు చేశాడు. స్వదేశంలో 23 సెంచరీలు సాధించిన కోహ్లి.. విదేశాల్లో 26 సార్లు మూడంకెల స్కోరు చేయడం విశేషం. సచిన్ మొత్తంగా 100 అంతర్జాతీయ శతకాలు సాధించగా.. కోహ్లి ప్రస్తుతం 79 సెంచరీలపై ఉన్నాడు. మధ్యలో రెండు మూడేళ్లు సెంచరీలు లేక ఇబ్బంది పడ్డాడు కానీ.. అప్పుడు కూడా రాణించి ఉంటే సచిన్‌కు మరింత చేరువగా ఉండేవాడే. అయినప్పటికీ.. ఇంకో మూణ్నాలుగేళ్లు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగి.. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సచిన్ వంద శతకాల రికార్డును కూడా అందుకోవడం కష్టమేమీ కాకపోవచ్చు.

ఫిట్‌నెస్, పట్టుదల కలిపి..

కెరీర్ ఆరంభంలో విరాట్ ఆటతీరు చూసిన వాళ్లు సచిన్‌ స్థాయికి చేరుకుంటాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. అతను అందరిలో ఒకడిలాగే కనిపించాడు. ఓ మోస్తరు ప్రదర్శనే చేశాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన కోహ్లి.. బంగ్లాదేశ్‌పై సెంచరీ మినహాయిస్తే అంత గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. ఆ టోర్నీలో కోహ్లి కూడా ఉన్న సంగతి అభిమానులకు పెద్దగా గుర్తుండదు. కానీ తర్వాతి సంవత్సరాల్లో కోహ్లి ఆటగాడిగా ఎదిగిన తీరు.. అతను సాగించిన పరుగుల ప్రవాహం గురించి ఎంత చెప్పినా తక్కువే. సచిన్‌, ధోని లాంటి దిగ్గజాల సహచర్యంలో అతను విలువైన పాఠాలు నేర్చుకున్నాడు. ఒక బ్యాటర్‌‌కు ఎలాంటి ఏకాగ్రత ఉండాలో, పరుగుల కోసం ఎలా తపించాలో సచిన్‌ను చూసే నేర్చుకున్నాడు విరాట్. మరోవైపు ఒత్తిడిలో ఎలా సంయమనంతో ఆడాలో ధోని అతడికి మార్గనిర్దేశం చేశాడు. మహి నుంచి నాయకత్వ లక్షణాలను కూడా అందిపుచ్చుకున్నాడు విరాట్. దీనికి తోడు సొంతంగా బ్యాటింగ్ టెక్నిక్ మీద ఎంతో కసరత్తు చేసి, నిరంతరం ఆటలో మెరుగు పడుతూ సాగాడు. భారత క్రికెట్లో అప్పటిదాకా లేని ఫిట్‌నెస్ ప్రమాణాలను అందుకుని.. అలవోకగా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యాన్ని సంపాదించాడు. 
వికెట్ల మధ్య పరుగు తీయడంలో.. సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించడంలో కోహ్లి నైపుణ్యమే వేరు. అందుకే చకచకా అతను 40, 50ల్లోకి వచ్చేస్తాడు. అర్ధశతకంతో అతను సంతృప్తి చెందడు. సెంచరీ చేసే వరకు అదే ఏకాగ్రత, పట్టుదలతో బ్యాటింగ్ చేస్తాడు.

మొదట బ్యాటింగ్ చేస్తుంటే జట్టు పెద్ద స్కోరు సాధించే వరకు నిలుస్తాడు. ఛేదనల్లో జట్టును గెలిపించే వరకు విశ్రమించడు. ఈ ప్రయత్నంలో ఎన్నోసార్లు విజయవంతం కావడం వల్లే విరాట్ అన్ని శతకాలు సాధించాడు. ఆ స్థాయిలో పరుగుల వరద పారించగలిగాడు. విరాట్ ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా సచిన్, ధోనిల మీద అతడికి అపారమైన గౌరవం ఉంది. అందుకే వాళ్లిద్దరి గురించి ఎఫ్పుడు మాట్లాడినా గురువుల మీద కృతజ్ఞతా భావాన్ని చూపించే ఒక విద్యార్థి లాగే కనిపిస్తాడు. సచిన్ సెంచరీల రికార్డును అందుకున్న సందర్భంగా ఆయనతో తనను పోల్చడాన్ని తాను అంగీకరించనని.. ఆయన స్థాయి వేరని.. సచిన్ రికార్డును సమం చేయడాన్ని ఒక గౌరవంగా భావిస్తాననే చెప్పాడు. సచిన్‌ను మించబోతూ కూడా అంత గౌరవ భావాన్ని ప్రకటించడం విరాట్ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. అందరిలో ఒకడిలా మొదలై.. ఒకే ఒక్కడిగా మారడం వెనుక విరాట్ కృషి అసామాన్యం. పరుగుల కోసం తపించడం, అత్యున్నత లక్ష్యాలు పెట్టుకుని వాటి కోసం శ్రమించడం, ఫిట్‌నెస్ విషయంలో అత్యున్నత ప్రమాణాలతో సాగడం, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు తనకిచ్చిన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించడం.. ఇలా విరాట్‌లో ఎన్నో లక్షణాలు యువ ఆటగాళ్లకు స్ఫూర్తి పాఠాలే.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని