Yashasvi Jaiswal: బాదుడు సరే.. తొందరెందుకు యశస్వి.. కుదురుకోవాలి కదా!

పొట్టి ఫార్మాట్లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడటమే కావాలి. అదే సమయంలో వికెట్‌ కాపాడుకుంటూ.. క్రీజులో కుదురుకోవాలి. కానీ, యువ బ్యాటర్‌ యశస్వి జైశ్వాల్ మాత్రం.. పరుగుల వేటలో త్వరగా పెవిలియన్‌ చేరుతున్నాడు. ఇది పరిణామం మంచిది కాదంటున్నారు క్రికెట్ పండితులు.

Published : 04 Dec 2023 17:59 IST

తొలి బంతి నుంచే బాదుడు మొదలెట్టడం.. కొత్త బంతి అని చూడకుండా బౌండరీల వేట సాగించడం.. ప్రారంభంలోనే బౌలర్ల లయ దెబ్బతీయడం.. భారీ షాట్లతో జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వడం.. టీ20ల్లో టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) బ్యాటింగ్‌ తీరు ఇది. క్రీజులోకి వచ్చామా.. బౌలర్లపై ప్రతాపం చూపించామా అన్నట్లు అతను బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నాడు. పొట్టి ఫార్మాట్లో ఇలా ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో చెలరేగడమే కావాలి. కానీ భారీ షాట్లపై దృష్టి పెడుతున్న అతను వికెట్‌ కాపాడుకోవడం లేదు. తొందరపడి పెవిలియన్‌ చేరుతున్నాడు. క్రీజులో ఏ మాత్రం కుదురుకోవడం లేదు. 

పవర్‌ప్లేలోనే..

21 (8 బంతుల్లో), 53 (25), 6 (6), 37 (28), 21 (15).. ఇవీ ఆస్ట్రేలియాతో అయిదు టీ20ల సిరీస్‌లో యశస్వి వరుసగా చేసిన పరుగులు. 5 మ్యాచ్‌ల్లో కలిపి 138 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్‌ ఏకంగా 168.29 ఉండటం విశేషం. బ్యాటింగ్‌లో దూకుడు మంత్రంతో అతను సాగుతున్నాడు. ఉన్నది కొద్దిసేపైనా.. ఆడేది కొన్ని బంతులైనా సరే ఉన్నంత సేపు ధనాధన్‌ షాట్లతో అలరిస్తున్నాడు. టీ20 ఫార్మాట్లో ఓపెనర్‌గా అతని దృక్పథం సరైందే. కానీ ఇదే తొందరలో వికెట్‌ పారేసుకోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నది క్రికెట్‌ పండితుల మాట.

పొట్టి ఫార్మాట్లో పరిస్థితుల మేరకు వేగంగా ఆడాలి. కానీ అదే సమయంలో పరిణతి ప్రదర్శించాలి. వికెట్‌కు ప్రాధాన్యతనివ్వాలి. మంచి బంతులను గౌరవించాలి. సాధికారతతో కూడిన దూకుడు చాటాలి. కానీ యశస్వి మాత్రం పరుగుల వేటలో పడి త్వరగా పెవిలియన్‌ చేరిపోతున్నాడు. ఈ సిరీస్‌లో అతని సగటు కేవలం 27.60గానే ఉండటమే ఇందుకు నిదర్శనం. ఇదే అతని నిలకడ లేమిని చాటుతోంది. ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ అతను పవర్‌ప్లే (తొలి ఆరు ఓవర్ల) లోపే ఔటైపోయాడు. బంతిని గాల్లోకి లేపి నిష్క్రమించాడు. ముఖ్యంగా షార్ట్‌ పిచ్‌ బంతులను అంచనా వేయడంలో విఫలమవుతున్నాడు. 

పోటీలో నెగ్గాలంటే.. 

ఎన్నో కష్టాలు దాటి టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకున్న 21 ఏళ్ల యశస్వి జైస్వాల్‌ ప్రతిభ, నైపుణ్యాలపై ఎవరికీ సందేహాలు లేవు. ఇప్పటివరకూ భారత్‌ తరపున ఆడిన రెండు టెస్టుల్లో అతను ఓ సెంచరీ సహా 266 పరుగులు చేశాడు. 12 టీ20ల్లోనూ ఓ శతకంతో కలిపి 349 పరుగులు సాధించాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో కేవలం 25 బంతుల్లోనే 53 పరుగులు చేసి సత్తాచాటాడు. ఆసియా క్రీడల్లో నేపాల్‌పై 49 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున అతని బ్యాటింగ్‌ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఏడాది ఐపీఎల్‌లో కేవలం 13 బంతుల్లోనే అర్ధశతకం చేసి.. లీగ్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. అలాంటి హిట్టింగ్‌ సామర్థ్యాలు యశస్వి సొంతం. కానీ అతను నిలకడ అందుకోవాలి. ఓ వైపు భారీ షాట్లు ఆడుతూనే.. మరోవైపు వికెట్‌ను కాపాడుకోవాల్సి ఉంది.

వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఇప్పటికే జట్టులో ఓపెనర్‌ స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉంది. యశస్వితో పాటు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఈ స్థానం కోసం పోటీపడుతున్నారు. వీళ్లలో ఓ ముగ్గురిని వెనక్కి నెట్టి యశస్వి ఓపెనర్‌గా ఆడాలంటే మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే. 2024 పొట్టి ప్రపంచకప్‌కు ముందు టీమ్‌ఇండియా ఇంకా 6 టీ20లు మాత్రమే ఆడుతుంది. అది కాకుండా ఐపీఎల్‌ ఉంది. వీటిల్లో యశస్వి జాగ్రత్తగా ఆడి పరుగులు సాధించాల్సి ఉంది. సంయవమనంతో కూడిన బాదుడుతో క్రీజులో కుదురుకోడంపై యశస్వి దృష్టి పెట్టాల్సి ఉంది. కొన్ని ఓవర్ల పాటు క్రీజులో ఉంటేనే అతను ధారాళంగా పరుగులు రాబడుతున్నాడు. అదే మరికొంత సేపు క్రీజులో గడిపితే కచ్చితంగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడతాడు. అది అతనితో పాటు జట్టుకూ మేలు చేసేదే. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని