DC vs RCB: విరాట్ దిల్లీపై సెంచరీ చెయ్‌.. అదే దాదాకు అసలైన కానుక: శ్రీశాంత్‌

గతంలో ఎప్పుడూ దిల్లీ - బెంగళూరు (DC vs RCB) జట్ల మధ్య మ్యాచ్‌ అంటే పెద్దగా ఆసక్తి ఉండేది లేదు. అయితే, ఈ సీజన్‌లో మాత్రం దాదా వర్సెస్ విరాట్ (Ganguly vs Virat) మాదిరిగా మారిపోయింది. ఇవాళ దిల్లీ వేదికగా ఇరు జట్ల మధ్య రాత్రి 7.30గంటలకు మ్యాచ్‌ జరగనుంది.

Published : 06 May 2023 13:30 IST

ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ - గంభీర్‌ (Virat Kohli- Gautam Gambhir) మధ్య వాగ్వాదం జరగకముందు మరో కీలక సంఘటన చోటు చేసుకున్న విషయం తెలుసు కదా..? అదేనండి బెంగళూరు - దిల్లీ మ్యాచ్‌ సందర్భంగా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీకి కరచాలనం ఇచ్చేందుకు కూడా విరాట్ కోహ్లీ  (Virat Kohli) విముఖత చూపించాడు. అప్పుడు సోషల్‌ మీడియాలో ఇది తెగ వైరల్‌గా మారిపోయింది. ఇప్పుడు మరోసారి ఇరు జట్లూ దిల్లీ వేదికగా (DC vs RCB) తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇలాంటి పరిస్థితే ఎదురువుతుందా...? అనే సందిగ్ధంలో క్రికెట్‌ అభిమానులు ఉన్నారు. అయితే, టీమ్ఇండియా మాజీ ఆటగాడు శ్రీశాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీ సాధించి గంగూలీకి అంకితమివ్వాలని వ్యాఖ్యానించాడు. దీనికి సంబంధించిన వీడియోను స్టార్‌ స్పోర్ట్స్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ మ్యాచ్‌కు సంబంధించి మూడు పాయింట్ల గురించి తన అభిప్రాయాలను శ్రీశాంత్‌ వెల్లడించాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో దిల్లీ - బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ 50వది. గోల్డెన్‌ మ్యాచ్‌. శ్రీశాంత్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

శ్రీశాంత్‌ మాటల్లో.. 

1. విరాట్ వర్సెస్ డేవిడ్‌ వార్నర్ ఆటను చూడాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో అద్భుతంగా పోరాడుతోంది. ఇప్పటికే దిల్లీపై గెలిచిన సమరోత్సాహంతో ఉంది.

2. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా మారిన ఆన్రిచ్‌ నోకియా బౌలింగ్‌లో బెంగళూరు బ్యాటర్లు ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారనుంది. 

3. ఇక మూడో పాయింట్‌ అత్యంత కీలకమని భావిస్తున్నా. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం చూడాలని ఉంది. దానిని దాదా (సౌరభ్ గంగూలీ)కు అంకితం ఇవ్వాలి. విరాట్ నువ్వు నీలా ఆడేసి ఆర్‌సీబీని గెలిపించు.

దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (DC vs RCB) జట్ల మధ్య బలాలపరంగా వ్యత్యాసం టాప్‌ ఆర్డర్‌లోనే ఉంది. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్ అద్భుతంగా రాణించడంతో బెంగళూరు విజయాలను నమోదు చేస్తోంది. మరోవైపు డేవిడ్ వార్నర్‌ ఆడుతున్నప్పటికీ.. స్ట్రైక్‌రేట్‌ మాత్రం దారుణంగా ఉంది. వార్నర్‌ రాణించకపోతే టాప్‌ ఆర్డర్‌ ఘోరంగా విఫలమవుతూ వస్తోంది. మిడిలార్డర్‌లో అక్షర్ పటేల్, మనీశ్‌ పాండే ఫర్వాలేదనిపిస్తున్నా పరాజయాలు మాత్రం తప్పడం లేదు.Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని