Sri lanka Cricket Team: అలాంటి శ్రీలంక ఇలా ఎలా!

వరల్డ్‌ కప్‌ (ODI World Cup 2023) క్వాలియింగ్‌ టోర్నీలో విజేతగా నిలిచి వరుస విజయాలతో ప్రపంచకప్పులో అడుగుపెట్టిన శ్రీలంక ఊహించని తీరులో అధ్వాన్న ప్రదర్శన చేసి నాకౌట్‌కు దూరమైంది.

Published : 07 Nov 2023 16:39 IST

వరుసగా 13 వన్డే విజయాలు! ఆ జట్టేమీ భారత్‌ కాదు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ అంతకంటే కాదు. ఇప్పుడిప్పుడే పునర్‌ నిర్మాణంలో ఉన్న శ్రీలంక (Sri Lanka Cricket Team)!  క్వాలియింగ్‌ టోర్నీలో విజేతగా నిలిచి వరుస విజయాలతో ప్రపంచకప్పులో అడుగుపెట్టిన లంక ఊహించని తీరులో అధ్వాన్న ప్రదర్శన చేసి నాకౌట్‌కు దూరమైంది. అంతేకాదు ఆ దేశ ప్రభుత్వం క్రికెట్‌ బోర్డునే రద్దు చేసే పరిస్థితిని తెచ్చుకుంది.. మరి మొన్నటిదాకా అదరగొట్టిన లంక ఇలా ఎందుకు మారింది. ఆ స్థిరత్వం ఏమైపోయింది. ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌ లాంటి చిన్న జట్టు కూడా దక్షిణాఫ్రికాను ఓడించి సంచలనం రేపింది.. అఫ్గానిస్థాన్‌ ఏకంగా సెమీఫైనల్‌పైనే గురి పెట్టింది. మరి మాజీ ఛాంపియన్‌ శ్రీలంక ఎందుకు తేలిపోయింది. కనీస పోటీ ఎందుకు ఇవ్వలేకపోయింది. 8 మ్యాచ్‌ల్లో 2 విజయాలే సాధించి సెమీఫైనల్‌ రేసు నుంచి ఎందుకు నిష్క్రమించింది!

ఆ జోరుతో వచ్చి..

భారత్‌లో పిచ్‌లు లంకలో పిచ్‌లను పోలే ఉంటాయి. ఆ జట్టు ఆటకు సరిపోతాయి. పైగా లంక మామూలు జోరులో లేదు వరుసగా 13 వన్డేలు గెలిచింది. ప్రపంచకప్‌కు ముందు భారత్‌తో సిరీస్‌లో ఈ విజయపరంపరకు తెరపడినా.. లంకను ఎవరూ తక్కువ అంచనా వేయలేదు. ఎందుకంటే ఆ జట్టులో ప్రతిభావంతులకు కొదువలేదు. పైగా తమకు పరిచయం ఉన్న పరిస్థితులే. లంక స్పిన్నర్లు ప్రత్యర్థి పనిపట్టడం ఖాయంగా కనిపించింది. ఆ జట్టును కప్‌కు ఫేవరెట్‌ అని ఎవరూ అనుకోలేదు. సెమీఫైనల్‌కు వస్తుందని భావించలేదు. కానీ కచ్చితంగా ప్రభావం చూపించగలదని అనుకున్నారు. అయితే ప్రపంచకప్‌కు ముందు జోరు ఏమాత్రం లేదు. పైగా పసికూన మాదిరిగా మారిపోయింది. భారత్, దక్షిణాఫ్రికాలపై వణికిపోయింది. చివరికి చిన్న జట్లకు కూడా పోటీ ఇవ్వలేని స్థితికి చేరింది. అసలు ప్రపంచకప్‌లో ఆ జట్టు ఆరంభమే దారుణం. 

రికార్డులు సమర్పించుకుని

అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైన లంక ఆడిన తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ చిత్తయింది. పైగా ప్రత్యర్థికి రికార్డులు సమర్పించుకుంది. లంక బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ తొలి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికా 428 పరుగులు చేసి ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు రికార్డు సాధించింది. ఆ తర్వాత పాకిస్థాన్‌తో పోరులో 344 పరుగులు చేసి కూడా.. బౌలింగ్‌లో మళ్లీ విఫలమై ఓడిపోయింది. ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక ఛేదన. ఆ తర్వాత ఆస్ట్రేలియాపైనా చేతులెత్తేసింది. నెదర్లాండ్స్‌పై నెగ్గి గాడిలో పడిన లంక.. ఆ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు షాక్‌ ఇచ్చి మళ్లీ రేసులోకొచ్చినట్లు కనిపించింది. అయితే వాళ్ల ఆట అక్కడే ఆగిపోయింది. అక్కడి నుంచి ఆ జట్టుకి బ్యాడ్‌టైమ్‌ మళ్లీ మొదలైంది. ఈసారి మామూలు దెబ్బలు తగల్లేదు. అఫ్గానిస్థాన్‌ చేతిలో అనూహ్య ఓటమి చవిచూసింది. అఫ్గాన్‌ కన్నా మెరుగైన జట్టే అయినా పసికూనలా ఆడి ఓడింది. ఇక లంక ఓటములన్నీ ఒక ఎత్తయితే.. భారత్‌పై ఆట ఇంకో ఎత్తు. భారత్‌కు 355 పరుగులు సమర్పించుకున్న ఆ జట్టు.. ఛేదనలో కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్ల ధాటికి లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ విలవిలలాడింది. ఆ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ సైకిల్‌ స్టాండ్‌ను తలపించింది. ఈ ఓటమే ఆ జట్టును మానసికంగా బాగా దెబ్బ తీసింది. 

గాయాలే దెబ్బ తీశాయా

లంకను గాయాలు గట్టి దెబ్బ తీశాయి. టోర్నీ ఆరంభానికి ముందే ఆ జట్టు స్టార్‌ ఆటగాడు హసరంగను కోల్పోయింది. ప్రపంచకప్‌ సాగుతుండగా ఆ జట్టుకు మరో గట్టి షాక్‌ తగిలింది. కెప్టెన్, కీలక ఆటగాడు శానక గాయంతో నిష్క్రమించాడు. ఇదే ఆ జట్టు ఆటపై చాలా ప్రభావం చూపించింది. జట్టు సమతూకం దెబ్బ తింది. ఈ టోర్నీలో గాయాలతో నలుగురిని రీప్లేస్‌ చేసిన జట్టు లంకే. కుశాల్‌ మెండిస్‌కు పగ్గాలు అప్పగించినా అతడు మెరుగ్గా జట్టును నడిపించలేకపోయాడు. పైగా అతడి బ్యాటింగ్‌పై ప్రభావం పడింది. అప్పటిదాకా టోర్నీలో టాప్‌ స్కోరర్లలో ఒకడిగా ఉన్న మెండిస్‌.. విఫలం కావడం మొదలుపెట్టాడు. ఈ వైపల్యం లంకను దెబ్బ కొట్టింది. టోర్నీ తొలి రెండు మ్యాచ్‌లో సెంచరీ, అర్ధసెంచరీ సాధించి జోరు మీద కనిపించిన మెండిస్‌.. ఆ తర్వాత ఒక్కసారి కూడా 50 పరుగులు చేయలేకపోయాడు. శానక మాత్రమే కాదు లహిరు కుమార, పతిరన లాంటి ఆటగాళ్ల సేవలను గాయాల కారణంగా కోల్పోయింది ఆ జట్టు. మంచి రికార్డు, అనుభవం ఉన్న ఏంజెలో మాథ్యూస్‌ను తుది జట్టులో తీసుకున్నా అప్పటికే లంకకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రపంచకప్‌లో అధ్వాన్న ప్రదర్శనతో లంక క్రికెట్‌ బోర్డును ఆ దేశ ప్రభుత్వం రద్దు చేయడం ఇంకో షాక్‌. అప్పీలు న్యాయస్థానానికి వెళ్లగా రెండు వారాలపాటు బోర్డును పునరుద్ధరణ చేస్తూ నిర్ణయం వెలువరించింది. అది వేరే విషయం. మరి ఈ ప్రదర్శనను బయటపడి మున్ముందు లంక ఎలా కోలుకుంటుందో చూడాలి.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు