ODI WC 2023: ఈ స్టార్ల మెరుపులేవీ? ప్రపంచకప్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్ల వైఫల్యం

పరుగుల వేటలో, వికెట్ల బాటలో సాగే కొందరు క్రికెటర్లు వన్డే ప్రపంచకప్‌ మెగా టోర్నీలో (ODI World Cup 2023) నామమాత్ర ఆటగాళ్లుగా మారిపోవడం గమనార్హం.

Published : 07 Nov 2023 11:48 IST

ఒక్కసారైనా ప్రపంచకప్‌ ముద్దాడాలని ప్రతి క్రికెటర్‌ కల కంటాడు. ప్రపంచకప్‌లో ఆడే అవకాశం వస్తే.. అత్యుత్తమ ప్రదర్శనతో సత్తాచాటాలని చూస్తారు. ఇక ఇలాంటి మెగా టోర్నీలో స్టార్‌ ఆటగాళ్లపై అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. ఒత్తిడిని తట్టుకుని.. మెరుగ్గా రాణించి జట్టును గెలిపిస్తారని ఆయా దేశాల అభిమానులు ఆశలు పెట్టుకుంటారు. కానీ భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో కొన్ని జట్ల స్టార్‌ ఆటగాళ్లు వరుసగా విఫలమవుతున్నారు. పరుగుల వేటలో, వికెట్ల బాటలో సాగే ఈ క్రికెటర్లు ఇప్పుడు నామమాత్ర ఆటగాళ్లుగా మారిపోవడం ఊహించని విషయమే. ఐపీఎల్‌ ద్వారా విదేశీ క్రికెటర్లకు భారత్‌లోని పిచ్‌లపై అవగాహన ఏర్పడింది. ఇక్కడి పరిస్థితులూ వీళ్లకు అలవాటే. కానీ ప్రపంచకప్‌లో మాత్రం పూర్తిగా తేలిపోతున్నారు. తొలిసారి భారత్‌లో ఆడుతున్నట్లు.. ఇదే తొలి అంతర్జాతీయ టోర్నీ అయినట్లు తడబడుతున్నారు. 

ఫాబ్‌ 4లో కోహ్లి ఒక్కడే.. 

ఆధునిక క్రికెట్లో ‘ఫాబులస్‌ 4’గా విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్, కేన్‌ విలియమ్సన్, జో రూట్‌ పేరు పొందారు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో వీళ్ల ముద్ర అలాంటింది. కానీ ఈ ప్రపంచకప్‌లో వీళ్లలో కోహ్లి ఒక్కడే నిలకడగా సత్తాచాటుతుండగా.. మిగతా ముగ్గురూ అంచనాలను అందుకోలేకపోతున్నారు. అయితే గాయం కారణంగా రెండు మ్యాచ్‌లను మాత్రమే న్యూజిలాండ్‌ సారథి విలియమ్సన్‌ ఆడాడు. అందులోనూ 78, 95 పరుగులు చేయడం విశేషం. అతడిని మినహాయిస్తే స్మిత్, రూట్‌ ప్రదర్శన పేలవం. ఇప్పటివరకూ ఆడిన 6 మ్యాచ్‌ల్లో స్మిత్‌ 26.83 సగటుతో 161 పరుగులు, రూట్‌ 29.16 సగటుతో 175 పరుగులు మాత్రమే చేయగలిగారు. రూట్‌ రెండు అర్ధశతకాలు చేయగా.. స్మిత్‌ ఒక్కదాంతోనే సరిపెట్టుకున్నారు. ఈ ఇద్దరికీ భారత్‌లోని పిచ్‌లు కొత్తకాదు. పైగా మన దేశంలో వీళ్లకు మంచి రికార్డూ ఉంది. ప్రపంచకప్‌ ముందు వరకూ భారత్‌లో ఆడిన 19 వన్డేల్లో స్మిత్‌ 536 పరుగులు, 7 వన్డేల్లో రూట్‌ 295 పరుగులు చేశారు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే వీళ్లను ఔట్‌ చేయడం కష్టమనే సంగతి తెలిసిందే. కానీ ఈ టోర్నీలో అసలు వీళ్లకు కుదురుకునే అవకాశమే ఇవ్వకుండా బౌలర్లు పెవిలియన్‌ చేరుస్తున్నారు. వయసు దృష్ట్యా స్మిత్‌ (34 ఏళ్లు), రూట్‌ (32) మరో వన్డే ప్రపంచకప్‌ ఆడలేకపోవచ్చు. మరి తమకు చివరిదైన ఈ మెగా టోర్నీలో వీళ్ల నుంచి ఇలాంటి ప్రదర్శన ఏ మాత్రం ఊహించనిదే. 

ఇంగ్లాండ్‌కు కష్టాలు..

ఇంగ్లాండ్‌ జట్టులో అందరూ స్టార్‌ ఆటగాళ్లే. ఆరుగురు ఆల్‌రౌండర్లు. కానీ టోర్నీలో ఆ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన చేస్తోంది. ఇందుకు క్రికెటర్ల వైఫల్యమే కారణం. కెప్టెన్‌ బట్లర్‌ (6 మ్యాచ్‌ల్లో 17.50 సగటుతో 105 పరుగులు)తో సహా బెయిర్‌స్టో (23.50 సగటుతో 141), బ్రూక్‌ (32 సగటుతో 128), లివింగ్‌స్టన్‌ (11.60 సగటుతో 58) పూర్తిగా విఫలమయ్యారు. భారత పిచ్‌లపై ఐపీఎల్‌లో రెచ్చిపోయే బట్లర్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టన్‌ లాంటి ఆటగాళ్లు ప్రపంచకప్‌నకు వచ్చేసరికి మాత్రం పరుగుల వేటలో వెనుకబడుతున్నారు. తుంటి గాయంతో ఆలస్యంగా జట్టులోకి వచ్చిన స్టోక్స్‌ కూడా జోరు చూపించలేకపోతున్నాడు. ఈ ప్రపంచకప్‌ కోసమే అతను వన్డే రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకునేలా జట్టు ఒప్పించింది. కానీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అతను 16 సగటుతో 48 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బంగ్లాదేశ్‌ జట్టులో ప్రధాన బ్యాటర్లలో ఒకడు ముష్ఫికర్‌ రహీమ్‌ 7 మ్యాచ్‌ల్లో 28.50 సగటుతో 171 పరుగులే సాధించాడు. బంగ్లా సారథి, మేటి ఆల్‌రౌండర్‌ షకిబుల్‌ హసన్‌ (6 మ్యాచ్‌ల్లో 17.33 సగటుతో 104 పరుగులు, 7 వికెట్లు) ప్రదర్శన నామమాత్రం.

మరోవైపు దక్షిణాఫ్రికా కెప్టెన్‌ బవుమా బ్యాటింగ్‌ ప్రదర్శన గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. నిలకడగా రాణించలేకపోతున్న అతను.. 5 మ్యాచ్‌ల్లో 22.20 సగటుతో 111 పరుగులే చేశాడు. మరో ఆస్ట్రేలియా ప్రధాన ఆటగాడు లబుషేన్‌ (6 మ్యాచ్‌ల్లో 33.50 సగటుతో 201 పరుగులు) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. బౌలర్ల విషయానికి వస్తే అఫ్గానిస్థాన్‌కు మూల స్తంభమైన రషీద్‌ ఖాన్‌ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఈ స్టార్‌ స్పిన్నర్‌ 6 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు మాత్రమే తీశాడు. ఆస్ట్రేలియా ప్రధాన పేసర్‌ స్టార్క్‌ (6 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు) కూడా అంతే. బంగ్లాదేశ్‌ ప్రధాన పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ తీసిన వికెట్లు నాలుగే. ఇంగ్లాండ్‌ పేసర్‌ మార్క్‌వుడ్‌ (6 మ్యాచ్‌ల్లో 4) పరిస్థితి అంతే. మరి టోర్నీ ముందుకు సాగుతున్నా కొద్దీ ఈ ఆటగాళ్లు ఫామ్‌ అందుకుంటారేమో చూడాలి. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని