Hashimatullah Shahidi: తల్లి మరణాన్ని దిగమింగి

అఫ్గానిస్థాన్‌ ప్రజల్లో మోముల్లో నవ్వు చూడాలనే తండ్రి లక్ష్యం కోసం, జట్టుకు విజయాలు అందించాలనే తల్లి ధ్యేయం కోసం ఆ జట్టు కెప్టెన్‌ హష్మతుల్లా ముందుకు సాగుతున్నాడు.

Updated : 04 Nov 2023 14:48 IST

ప్రపంచకప్‌లో సత్తాచాటుతున్న హష్మతుల్లా

2018లో తండ్రి మరణం. ఆ లోటును దాటి అంతర్జాతీయ క్రికెట్లో సత్తాచాటే దిశగా పయనం.. అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌పై తనదైన ముద్ర వేసే ప్రయత్నాలు.. ఈ ఏడాది మేలో వన్డేల్లో, టెస్టుల్లో జాతీయ జట్టు పగ్గాలు.. ప్రపంచకప్‌లో జట్టును నడిపించేందుకు ఆ ఆటగాడు సన్నద్ధమవుతున్నాడు. కానీ ఇంతలోనే షాక్‌.. అన్నివేళలా అండగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్న తల్లి హఠాన్మరణం. ఆ బాధ తట్టుకోలేక ఆ క్రికెటర్‌ కుంగిపోయాడు. నిరాశలో మునిగిపోయాడు. అటు తల్లి మరణం.. ఇటు దగ్గరపడుతున్న ప్రపంచకప్‌.. అటు బాధ.. ఇటు కెప్టెన్‌గా జట్టును నడిపించాల్సిన బాధ్యత. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఆ ఆటగాడు బాధను దిగమింగాడు. దేశం కోసం, జట్టు కోసం ప్రపంచకప్‌లో అడుగుపెట్టాడు. బ్యాటర్‌గా, సారథిగా అద్భుతమైన ప్రదర్శనతో సాగుతున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా జట్టుకు అనూహ్య విజయాలు అందిస్తున్నాడు. అతనే.. హష్మతుల్లా షాహిది. అఫ్గానిస్థాన్‌ కెప్టెన్‌. 

శనివారం (నవంబర్‌ 4) 29వ పడిలోకి అడుగుపెట్టిన హష్మతుల్లా షాహిది.. అఫ్గానిస్థాన్‌ ప్రజల మోముల్లో నవ్వు చూడాలనే తండ్రి లక్ష్యం కోసం, జట్టుకు విజయాలు అందించాలనే తల్లి ధ్యేయం కోసం ముందుకు సాగుతున్నాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసిన అఫ్గానిస్థాన్‌.. ఈ ప్రపంచకప్‌ ముందు వరకూ కేవలం ఒక్క విజయం (స్కాట్లాండ్‌) మాత్రమే నమోదు చేసింది. కానీ ఈ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు షాకిచ్చి.. మాజీ ఛాంపియన్లు పాకిస్థాన్, శ్రీలంకను.. తాజాగా నెదర్లాండ్స్‌ను ఓడించి సెమీస్‌ రేసులో నిలిచింది. దీనికి కెప్టెన్‌ హష్మతుల్లా ప్రధాన చోదకశక్తి అనడంలో సందేహం లేదు. 

అప్పుడు తండ్రి.. ఇప్పుడు తల్లి

హష్మతుల్లా తండ్రి మహమ్మద్‌ హషీమ్‌ షాహిది ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌. సైన్స్‌ మీద ఆయన 44 పుస్తకాలు రాశారు. 9 నుంచి 12 తరగతులకు ఫిజిక్స్‌ పుస్తకాలు రూపొందించారు. హష్మతుల్లాను అగ్రశ్రేణి శాస్త్రవేత్తగా చూడాలన్నది ఆయన కోరిక. కానీ హష్మతుల్లా క్రికెట్‌ వైపు నడిచాడు. 2018లో తండ్రి చనిపోయారు. ఆ సమయంలో హష్మతుల్లా తండ్రి దగ్గర లేడు. దేశవాళీ క్రికెట్లో ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడుతున్నాడు. ఆ రోజు ఆట చివరకు 120 పరుగులతో అజేయంగా నిలిచిన అతను.. తండ్రికి ఫోన్‌ చేసి ద్విశతకం కోసం ప్రార్థించాలని కోరాడు. కానీ ఇంట్లో అతిథులు ఉండటంతో తర్వాత మాట్లాడతానని ఫోన్‌ పెట్టేశారు. ఆ రాత్రి పడుకున్న ఆయన మళ్లీ లేవలేదు. ఈ బాధ నుంచి కోలుకున్న హష్మతుల్లా క్రికెట్‌పైనే దృష్టి సారించారు. అంతర్జాతీయ క్రికెట్లో అంచెలంచెలుగా ఎదిగాడు. 2019 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో బౌన్సర్‌ దెబ్బకు హష్మతుల్లా కింద పడిపోయాడు. కానీ వెంటనే లేచి బ్యాటింగ్‌ కొనసాగించాడు. ఒకవేళ బయటకు వెళ్తే తనకు ఏమైందోనని తల్లి కంగారు పడుతుందనే కారణంతోనే బ్యాటింగ్‌ కొనసాగించినట్లు అప్పుడు హష్మతుల్లా వెల్లడించాడు. అలాంటిది ఈ ఏడాది ఆగస్టులో అనారోగ్యంతో తల్లి మరణించడంతో అతను తల్లడిల్లాడు. తీవ్రమైన బాధలో మునిగిపోయాడు. ఇప్పుడు అమ్మ కోసం జట్టును సెమీస్‌ తీసుకెళ్లాలనే సంకల్పంతో సాగుతున్నాడు.

సారథిగా శిఖరాలకు.. 

ఈ ఏడాది మేలో అఫ్గానిస్థాన్‌ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌గా హష్మతుల్లా నియమితుడయ్యాడు. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌ క్రికెట్లోనే అత్యుత్తమ సారథిగా పేరు సాధించాడు. ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంకపై విజయాలతో హష్మతుల్లా పేరు మార్మోగుతోంది. ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో జట్టును నడిపించడం కత్తిమీద సాములాంటిదే. సవాళ్లు ఉంటాయని తెలుసు... విజయం అంత సులువు కాదని తెలుసు.. అయినా వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు విజయాలు ముఖ్యమని నమ్మి హష్మతుల్లా ముందుకు సాగుతున్నాడు. బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. జట్టును గెలిపించే మైదానం వీడాలనే పట్టుదలతో ఉన్నాడు. తొందరపాటు లేకుండా.. క్రీజులో కుదురుకుని సింగిల్స్‌తో స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ, అప్పుడప్పుడూ బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించడం అతని ప్రతిభకు నిదర్శనం. ఓ వన్డే బ్యాటర్‌కు ఉండాల్సిన నైపుణ్యాలు అతనిలో ఉన్నాయి. ఈ టోర్నీలో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో 18, 80, 14, 8, 48 నాటౌట్, 58 నాటౌట్, 56 నాటౌట్‌ పరుగులు చేశాడు. భారత్‌పై 80 పరుగులు సాధించాడు. పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్‌పై ఛేదనలో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. టోర్నీలో ఇప్పటివరకూ 7 మ్యాచ్‌ల్లో 70.50 సగటుతో 282 పరుగులు చేసిన హష్మతుల్లా అఫ్గాన్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన అఫ్గాన్‌ ఆటగాడిగా రికార్డూ అతనిదే. 2021లో జింబాబ్వేపై ద్విశతకం సాధించిన అతను.. టెస్టుల్లో ఆ ఘనత సాధించిన తొలి అఫ్గాన్‌ క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పుడు నెదర్లాండ్స్‌పై విజయాన్ని తమ దేశ శరణార్థులకు అంకితమిచ్చి తన గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. 

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు