T20 World Cup: భయపెట్టే విండీస్‌.. నిలకడైన కివీస్‌

మైదానంలో దిగితే చాలు విధ్వంసకర ఆటతీరుతో  చెలరేగే వెస్టిండీస్‌. జట్టు నిండా అత్యుత్తమ ఆటగాళ్లతో విజయాల బాటలో దూసుకెళ్లే న్యూజిలాండ్‌. ఈ రెండు పెద్ద జట్లకు షాకిచ్చి సంచలనాలను కొనసాగించాలనే పట్టుదలతో అఫ్గానిస్థాన్‌.

Updated : 30 May 2024 04:10 IST

టీ20 ప్రపంచకప్‌ మరో 3రోజుల్లో 
ఈనాడు క్రీడావిభాగం

మైదానంలో దిగితే చాలు విధ్వంసకర ఆటతీరుతో  చెలరేగే వెస్టిండీస్‌. జట్టు నిండా అత్యుత్తమ ఆటగాళ్లతో విజయాల బాటలో దూసుకెళ్లే న్యూజిలాండ్‌. ఈ రెండు పెద్ద జట్లకు షాకిచ్చి సంచలనాలను కొనసాగించాలనే పట్టుదలతో అఫ్గానిస్థాన్‌. ప్రత్యర్థి జట్ల రికార్డుల వేటలో బలయ్యేందుకు రెండు పసికూనలు! ఇదీ క్లుప్తంగా టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-సి కథ. ఈ గ్రూప్‌లో విండీస్, కివీస్‌ అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నప్పటికీ.. అసాధ్యాలను అందుకునేందుకు అఫ్గాన్‌ వీరులు సై అంటున్నారు.


బాదుడే బాదుడు

పొట్టి క్రికెట్‌ అంటే చాలు పూనకాలు వచ్చినట్లు ఊగిపోయే జట్టు వెస్టిండీస్‌. టెస్టు, వన్డేల్లో ఆ జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా, టీ20లకు వచ్చేసరికి మాత్రం పూర్తి భిన్నంగా మారిపోతుంది. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చే పవర్‌ హిట్టర్లు.. బంతితో, బ్యాట్‌తో మాయ చేసే ఆల్‌రౌండర్లు.. నిప్పులు చెరిగే బౌలర్లు.. ఇలా ఈ ఫార్మాట్లో విండీస్‌ పటిష్ఠంగా ఉంటుంది. ఇప్పటికే రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ గెలిచిన ఆ జట్టు మరోసారి టైటిల్‌పై కన్నేసింది. పైగా ఈ సారి టోర్నీకి ఉమ్మడి ఆతిథ్య దేశం కూడా కావడం కలిసొచ్చే అంశం. కెప్టెన్‌ పావెల్‌తో పాటు పూరన్, ఛార్లెస్, హెట్‌మయర్, రూథర్‌ఫర్డ్, కింగ్, రసెల్, షెఫర్డ్‌.. ఇలా జట్టులో చాలా మందే మ్యాచ్‌ విన్నర్లున్నారు. అల్జారి జోసెఫ్, షమార్‌ జోసెఫ్, మెకాయ్‌తో పేస్‌ విభాగమూ బలంగానే ఉంది. స్పిన్‌ విభాగమే కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఇక గాయంతో స్టార్‌ ఆల్‌రౌండర్‌ హోల్డర్‌ దూరమవడమూ లోటే. నిరుడు చివర్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌పై సిరీస్‌ విజయంతో తామెంత ప్రమాదకరమో మరోసారి విండీస్‌ చాటింది. ఇటీవల దక్షిణాఫ్రికాపై సిరీస్‌ గెలిచిన ఉత్సాహంతో ఉన్న కరీబియన్‌ వీరులు గ్రూప్‌ దశ దాటడం పెద్ద కష్టమేమీ కాదు. నిలకడగా రాణిస్తే ఆ జట్టు మూడోసారి విజేతగా నిలిచినా ఆశ్చర్యమేమీ లేదు. 

ఉత్తమ ప్రదర్శన: 2012, 2016లో విజేత


నిరీక్షణకు తెరదించాలని..

జట్టు నిండా స్టార్‌ ఆటగాళ్లు. అనుభవజ్ఞులు, యువకులతో సమతూకంగా జట్టు. నిలకడైన ప్రదర్శన. కానీ ఇప్పటికీ ఆ జట్టుకు ప్రపంచకప్‌ అందని ద్రాక్షనే. ఈ మెగా టోర్నీల్లో దురదృష్టం వెంటాడే ఆ జట్టే న్యూజిలాండ్‌. 2015, 2019 వన్డే, 2021 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఓడిన ఆ జట్టు.. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా విశ్వవిజేతగా నిలవలేదు. ఈ సారి ఆ నిరీక్షణకు ముగింపు పలకాలని పకడ్బందీగా పొట్టికప్పుకు సిద్ధమైంది. గత టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఎక్కువగా ఈ ఫార్మాట్‌పై దృష్టి పెట్టిన ఆ జట్టు.. మిగతా ఐసీసీ పూర్తిస్థాయి సభ్య దేశాల కంటే ఎక్కువగా టీ20 (36)లు ఆడింది. నైపుణ్యాల పరంగా కివీస్‌ ఆటగాళ్ల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. జట్టు లోతు కూడా ఎక్కువే. ఇటీవల పాకిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను కివీస్‌ ద్వితీయ శ్రేణి జట్టు సమం చేయడమే అందుకు రుజువు. ఇక ఆరో టీ20 ప్రపంచకప్‌ ఆడబోతున్న కెప్టెన్‌ విలియమ్సన్‌ ఆ జట్టుకు కొండంత బలం. బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, బౌలర్లు ఇలా ఏ విభాగం చూసుకున్నా కివీస్‌ జట్టులో ఉత్తమ ఆటగాళ్లే కనిపిస్తున్నారు. ఫిన్‌ అలెన్, బ్రేస్‌వెల్, చాప్‌మన్, కాన్వే, డరిల్‌ మిచెల్, నీషమ్, ఫిలిప్స్,  రచిన్, శాంట్నర్, సోధితో జట్టు పటిష్ఠంగా ఉంది.   ఇక వెటరన్‌ పేస్‌ ద్వయం బౌల్ట్, సౌథీ వికెట్ల వేట కొనసాగిస్తూనే ఉన్నారు. గ్రూప్‌ దశను అలవోకగా దాటగలిగే కివీస్‌.. కీలక మ్యాచ్‌ల్లో తడబడకుండా ఉంటే కప్‌ కల నిజం చేసుకునే ఆస్కారముంది. 

ఉత్తమ ప్రదర్శన: 2021లో రన్నరప్‌


తలకిందులు చేస్తారు

చిన్నజట్టే కదా.. టీ20 ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉంది కదా.. అని అఫ్గానిస్థాన్‌ను ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం. ఇప్పటికే అంచనాలకు మించిన ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్లో అఫ్గాన్‌ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేని టీ20 ఫార్మాట్లో ఆ జట్టు ఆటతీరు కూడా అనూహ్యమే. తనదైన రోజున పెద్ద జట్లకు షాక్‌ ఇవ్వగలదు. నిరుడు వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంకను ఓడించిన అఫ్గాన్‌.. ఇప్పుడు పొట్టికప్పులోనూ సంచలనాలకు సిద్ధమవుతోంది. ఈ గ్రూప్‌లో రెండూ పసికూనలే ఉన్నాయి. ఇక విండీస్, కివీస్‌లో ఒక్క జట్టును ఓడించినా అఫ్గాన్‌కు ముందంజ వేసేందుకు అవకాశం ఉంటుంది. పాకిస్థాన్‌ను టీ20 సిరీస్‌లో ఓడించిన ఆ జట్టు ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది. రషీద్‌ ఖాన్, ముజీబుర్‌ రెహ్మాన్, నూర్‌ అహ్మద్‌తో కూడిన ప్రమాదకర స్పిన్‌ త్రయం ఆ జట్టుకు పెద్ద బలం. వీళ్లకు తోడు సీనియర్‌ నబి ఉండనే ఉన్నాడు. ఆ జట్టు బ్యాటింగ్‌ కూడా క్రమంగా మెరుగవుతోంది. ఇబ్రహీం జద్రాన్, ఇటీవల ఐపీఎల్‌ విజేత కేకేఆర్‌ తరపున ఆడిన రహ్మనుల్లా గుర్బాజ్‌తో పాటు ఒమర్‌జాయ్‌ కీలకం కానున్నారు. లోయర్‌ఆర్డర్‌లో రషీద్‌ ఖాన్‌ బ్యాటింగ్‌ మెరుపులు తెలిసిందే. కెప్టెన్‌ కూడా అయిన రషీద్‌.. గాయం నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి జాతీయ జట్టుకు ఆడబోతున్నాడు. 

ఉత్తమ ప్రదర్శన: 2016లో సూపర్‌- 10


బలి అయ్యేనా?

ఈ గ్రూప్‌లో విండీస్, కివీస్‌ బాదుడుకు రెండు పసికూనలు బలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచకప్‌ అరంగేట్రం చేయబోతున్న ఉగాండా ఏ స్థాయిలో పోటీనిస్తుందో చూడాలి. ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో మెరుగైన ప్రదర్శనతో జింబాబ్వేను ఓడించి మరీ ఈ ప్రపంచకప్‌కు ఉగాండా అర్హత సాధించింది. ఈ క్రమంలో కెన్యాపైనా గెలిచింది. ఈ ప్రపంచకప్‌లో అత్యంత వయసైన ఆటగాడిగా నిలవబోతున్న 43 ఏళ్ల ఫ్రాంక్‌ ఎన్సుబుగా, రియాజత్‌ అలీ, రోజర్‌ ముసాకా, సైమన్‌ సెసాజి, హెన్రీ సెన్యోండో ఆ జట్టులో కీలక ఆటగాళ్లు. మరోవైపు 2021 తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్‌ ఆడబోతున్న పాపువా న్యూగినీపైనా పెద్దగా అంచనాల్లేవు. తూర్పు ఆసియా పసిఫిక్‌ క్వాలిఫయర్‌లో అజేయంగా నిలిచి ఆ జట్టు పొట్టికప్‌ ఆడే అవకాశం కొట్టేసింది. టోనీ, ఛార్లెస్‌ అమినిపై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది.

పాపువా న్యూగినీ ఉత్తమ ప్రదర్శన: 2021లో తొలి రౌండ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని