Sumit Nagal: నగాల్‌ @ 77

భారత టెన్నిస్‌ అగ్రశ్రేణి సింగిల్స్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌కు పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు దాదాపుగా ఖాయమైనట్లే! కెరీర్‌లో అత్యుత్తమంగా 77వ ర్యాంకు సాధించిన అతను ఒలింపిక్స్‌లో ఆడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి.

Published : 11 Jun 2024 03:22 IST

కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకు

దిల్లీ: భారత టెన్నిస్‌ అగ్రశ్రేణి సింగిల్స్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌కు పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు దాదాపుగా ఖాయమైనట్లే! కెరీర్‌లో అత్యుత్తమంగా 77వ ర్యాంకు సాధించిన అతను ఒలింపిక్స్‌లో ఆడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. సోమవారం విడుదలైన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నగాల్‌ ఏకంగా 18 స్థానాలు ఎగబాకాడు. అతని ఖాతాలో 713 ఏటీపీ పాయింట్లున్నాయి. ఆదివారం జర్మనీలో ముగిసిన హెయిల్‌బ్రోన్‌ నెకర్‌కప్‌ ఏటీపీ ఛాలెంజర్‌ టోర్నీలో విజేతగా నిలవడంతో నగాల్‌ ర్యాంకు మెరుగైంది. నిబంధనల ప్రకారం పురుషుల, మహిళల సింగిల్స్‌లో టాప్‌-56 ప్లేయర్లు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. కానీ మెరుగైన ర్యాంకులో ఉన్నప్పటికీ ఒక్క దేశం నుంచి గరిష్ఠంగా నలుగురు ప్లేయర్లు మాత్రమే ఈ మెగా క్రీడల్లో పోటీపడాల్సి ఉంటుంది. దీంతో ఆ తర్వాతి ర్యాంకుల్లో ఉన్న వాళ్లకు ఆడే అవకాశం దక్కుతుంది. ఈ నేపథ్యంలో నగాల్‌ పారిస్‌ విమానమెక్కేలాగానే కనిపిస్తున్నాడు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఆటగాళ్ల జాబితాను ఆయా జాతీయ సమాఖ్యలకు బుధవారం లోపు అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య పంపిస్తుంది. చివరగా ఒలింపిక్స్‌ సింగిల్స్‌ ప్రధాన డ్రాలో 2012లో సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్‌ ఆడాడు. అప్పుడతను వైల్డ్‌కార్డు ద్వారా ప్రవేశం పొందాడు.

సినర్‌ తొలిసారి: ఏటీపీ ర్యాంకింగ్స్‌లో జానిక్‌ సినర్‌ తొలిసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. 1973లో కంప్యూటర్‌ ర్యాంకింగ్స్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఘనత సాధించిన మొదటి ఇటలీ ఆటగాడిగా అతను చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన సినర్‌.. తాజాగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లో అల్కరాస్‌ చేతిలో ఓడాడు. మోకాలి గాయంతో క్వార్టర్స్‌కు ముందు ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న జకోవిచ్‌ ఒకటి నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత అల్కరాస్‌ ఒక ర్యాంకు మెరుగై రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. జ్వెరెవ్‌ నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నాడు. మరోవైపు వరుసగా మూడోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన స్వైటెక్‌ మహిళల సింగిల్స్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలపర్చుకుంది. కోకో గాఫ్‌ అత్యుత్తమంగా రెండో స్థానాన్ని సాధించింది. సబలెంక, రిబాకినా వరుసగా 3, 4 నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఫైనల్లో స్వైటెక్‌ చేతిలో ఓడిన పౌలీని తొలిసారి టాప్‌-10లో అడుగుపెట్టింది. ఆమె ఏడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని