INDW vs PAKW : దాయాదుల పోరు.. టీమ్‌ఇండియాదే ఆధిక్యం.. ఈసారి ఎవరిదో..?

కామన్వెల్త్‌ గేమ్స్‌ (Commonwealth Games)లో తొలిసారి జరుగుతోన్న మహిళా క్రికెట్‌ టోర్నీలో సత్తా చాటాలని ఎన్నో ఆశలతో టీమ్‌ఇండియా బరిలోకి ...

Published : 31 Jul 2022 01:29 IST

ఆదివారం భారత్, పాక్‌ మహిళా జట్ల మధ్య మ్యాచ్

ఇంటర్నెట్ డెస్క్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌ (Commonwealth Games)లో తొలిసారి జరుగుతోన్న మహిళా క్రికెట్‌ టోర్నీలో సత్తా చాటాలని ఎన్నో ఆశలతో టీమ్‌ఇండియా బరిలోకి దిగింది. అయితే తొలి మ్యాచ్‌లో ఆఖరి వరకు పోరాడినా విజయం మాత్రం వరించలేదు. ఆసీస్‌ చేతిలో పరాభవం తప్పలేదు. ఇక గ్రూప్‌ స్టేజ్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలిస్తేనే సెమీస్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆదివారం పాక్‌తో తలపడనుంది. మరి ఇంతవరకు టీ20 ఫార్మాట్‌లో పాక్‌ను ఎన్ని మ్యాచుల్లో భారత్‌ ఢీకొట్టింది.. ఎవరు ఆధిక్యత సాధించారో తెలుసుకుందాం..

ఆధిక్యం మనదే.. 

భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌ అంటే సర్వత్రా ఉత్కంఠ ఉంటుంది. పురుషుల జట్టైనా.. మహిళల జట్టైనా సరే.. ఏ ఫార్మాట్‌లో అయినా క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. మరోసారి భారత్‌, పాక్ మహిళా క్రికెట్లు జట్లు తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. దానికి వేదిక కామన్వెల్త్‌ గేమ్స్‌. అయితే ఇప్పటి వరకు ఇరు జట్లూ 11 టీ20ల్లో తలపడ్డాయి. అందులో భారత్‌దే ఆధిక్యం సాధించడం విశేషం. తొమ్మిది మ్యాచుల్లో టీమ్‌ఇండియా విజయం సాధించగా.. పాకిస్థాన్‌ మహిళల జట్టు కేవలం రెండే మ్యాచుల్లో గెలిచింది. టీ20 ప్రపంచకప్‌వంటి కీలక టోర్నీల్లోనూ పాక్‌పై భారత్‌ విజయాల పరంపరను కొనసాగించింది. ఆరు మ్యాచుల్లో భారత్‌ 4, పాకిస్థాన్‌ 2 మ్యాచుల్లో విజయం సాధించాయి. 

అత్యధిక స్కోరు.. అత్యల్ప స్కోరు

భారత్, పాకిస్థాన్‌ మహిళల జట్లు తలపడినప్పుడు భారీ స్కోర్లేమీ నమోదు కాకపోవడం విశేషం. టీమ్‌ఇండియా అత్యధిక స్కోరు 137/3. అదీనూ 2018 టీ20 ప్రపంచకప్‌ పోటీల సందర్భంగా జరిగిన మ్యాచ్‌లో భారత్ సాధించింది. ఇక 2012 ఆసియా కప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ కేవలం 63 పరుగులకే కుప్పకూలింది. అయితే ఇదే మ్యాచ్‌లో భారత్‌ కూడా 81 పరుగులే చేయడం గమనార్హం. పాక్‌పై మాజీ సారథి మిథాలీరాజ్‌ (73) అత్యధిక స్కోరర్. అలానే 2009లో ప్రియాంక రాయ్‌ (5/16) పాక్‌పై అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన చేసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించింది. 

మరి ఈసారి ఏం చేస్తారో..? 

మెగా టోర్నీ్ల్లో పాక్‌పై భారత్‌ ఎప్పుడూ ఆధిక్యత ప్రదర్శిస్తూనే ఉంది. ఈ క్రమంలో తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో కీలకమైన పోరుకు భారత్‌, పాక్‌ జట్లు సై అంటూ సిద్ధంగా ఉన్నాయి. ఇరు జట్లూ తమ తొలి మ్యాచుల్లో ఓడిపోవడం విశేషం. ఆసీస్‌పై భారత్‌.. బార్బోడస్‌పై పాక్‌ ఓడాయి. అయితే ఆస్ట్రేలియా మీద గెలుస్తుందని భావించినా ఆఖర్లో భారత ప్లేయర్లు చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. మరోవైపు బార్బోడస్‌ వంటి చిన్న జట్టుపై పాక్‌ పరాజయం పొందడంతో తదుపరి రెండు మ్యాచ్‌లు చాలా కీలకం. పాక్ బ్యాటర్లలో నిదా దార్‌ (50*) మినహా ఎవరూ రాణించలేదు. కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్ (52), షెఫాలీ వర్మ (48) ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశమవుతుంది. సెమీస్‌ బెర్తు దక్కాలంటే ఈ మ్యాచ్‌ ఇరు జట్లకూ జీవన్మరణ పోరాటమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని