IND vs NZ: కివీస్‌తో సెమీస్‌.. టాస్‌ గెలిస్తే భారత్‌ ఏం చేయాలంటే?: సునీల్ గావస్కర్

వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) న్యూజిలాండ్‌తో సెమీస్‌ పోరుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. వాంఖడే మైదానం కావడంతో ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Published : 15 Nov 2023 11:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వరల్డ్‌ కప్‌లో భారత్- న్యూజిలాండ్‌ (IND vs NZ) జట్ల మధ్య జరగబోయే సెమీఫైనల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగా మ్యాచ్‌ కావడంతో టాస్‌ గెలిచిన జట్టు ఏం ఎంచుకుంటుంది? అనేదీ కీలకం కానుంది. అయితే, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ మాత్రం టాస్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. భారత బౌలర్ల ఫామ్‌ను చూస్తుంటే టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నా ప్రత్యర్థిని కట్టడి చేయగలరని పేర్కొన్నాడు.

‘‘టాస్ అనేది ఇక్కడ సమస్యే కాదు. మరీ ముఖ్యంగా భారత బౌలర్లు అదరగొట్టేస్తున్నారు. వారు ముందు బౌలింగ్‌ చేస్తారా..? తర్వాత చేస్తారనే ప్రశ్నే ఉత్పన్నం కాని పరిస్థితి. ఎప్పుడు అవకాశం వచ్చినా టాప్‌ 3 పేసర్లు తమ సత్తా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే, టాస్‌ గెలిచి తొలుత టీమ్ఇండియా బ్యాటింగ్‌ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్‌ ఉంది. భారీ స్కోరును కివీస్‌ ఎదుట లక్ష్యంగా ఉంచితే.. ఆ జట్టుపై మన బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించగలరు. కాస్త తేమ ప్రభావం కూడా ఒక్కోసారి కలిసొచ్చే అవకాశం ఉంటుంది. కుల్‌దీప్‌ యాదవ్‌ వంటి స్పిన్నర్‌ బంతి స్కిడ్‌ కాకుండా బౌలింగ్‌ చేయగలడు. అయితే.. భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తే 400 పరుగులేమీ చేయనక్కర్లేదు. 260 నుంచి 270 పరుగులు చేసినా కివీస్‌పై ఒత్తిడి తేవచ్చు. 

కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడైన ఆటతీరును ఇలాగే కొనసాగిస్తాడని భావిస్తున్నా. ఇప్పటికే ఈ టోర్నీ ఆసాంతం ఇలానే ఆడాడు. అతడు వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడడు. ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేసి జట్టు ఆధిపత్యం చెలాయించేలా చేసేందుకు ఎటాకింగ్‌ గేమ్ ఆడతాడు. అందుకే తొలి పది ఓవర్లలోనే భారీగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాతి 40 ఓవర్ల ఆటలో మిగతా వారు స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయడానికి అవకాశం దక్కుతుంది. మరోవైపు శుభ్‌మన్ గిల్ రూపంలో మంచి పార్టనర్‌ దొరికాడు. స్ట్రోక్‌ప్లేతో రాణిస్తున్నాడు.

ఈసారి ముగ్గురు భారత క్రికెటర్లు తమ హోం గ్రౌండ్‌లో ఆడనుండటం గర్వకారణంగా ఉంది. రోహిత్, శ్రేయస్‌, సూర్యకుమార్‌యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. వాంఖడే స్టేడియంలో వీరంతా చాలా మ్యాచ్‌లు ఆడారు. కుటుంబ సభ్యులు, అభిమానులు భారీగా స్టేడియంలో ఉంటారు. కాబట్టి, ఇదంతా వారికి స్పెషల్. గల్లీ క్రికెట్‌ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ వరకు ఎదిగారు. జీవితంలో ఇది మరిచిపోలేని మ్యాచ్‌గా వారికి మిగిలిపోతుంది’’ అని సునీల్ గావస్కర్‌ వెల్లడించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని