Gavaskar: ఆ ‘పిచ్‌’ ప్రచారం ఇకనైనా ఆపండి.. సునీల్‌ గావస్కర్ ఆగ్రహం

బాల్ టాంపరింగ్‌, విభిన్న బంతులు, పిచ్‌లో మార్పులు వంటి ఆరోపణలతో ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) ముగిసింది. ఐసీసీ అధికారికంగా స్పందించినా విమర్శకుల నోళ్లకు మాత్రం తాళం పడటం లేదు. దీంతో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ మరోసారి తీవ్రంగా స్పందించాడు.

Published : 23 Nov 2023 13:49 IST

ఇంటర్నెట్ డెస్క్: స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) మెగా టోర్నీ సందర్భంగా ఐసీసీ, బీసీసీఐపై చాలా ఆరోపణలు వచ్చాయి. మరీ ముఖ్యంగా సెమీస్‌లో భారత్‌కు అనుకూలంగా  పిచ్‌లో మార్పులు చేశారని పలువురు ఆరోపణలు చేశారు. వాటన్నింటినీ ఐసీసీ, బీసీసీఐ కొట్టిపడేశాయి. భారత క్రికెట్‌ దిగ్గజాలు కూడా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు మూర్ఖులంటూ తిప్పి కొట్టారు. ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌ ముగిసింది. అయినా, ఇంకా ఆ ఆరోపణలు మాత్రమే ఆగడంలేదు. తాజాగా సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) మరోసారి తీవ్ర అసహన వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘బీసీసీఐ కలగజేసుకుని పిచ్‌ను చివరి నిమిషంలో మార్చిందంటూ ఆరోపించడం అర్థరహితం. ఇప్పటికే ఐసీసీ, బీసీసీఐ వివరణ ఇచ్చాయి. అయినా, ఇలాంటి ఆరోపణలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. పిచ్‌ ఎంపిక అనేది ఐసీసీ కన్సల్టెంట్ ఎదురుగానే జరుగుతుంది. ప్రతినిధులంతా అక్కడే ఉంటారు. వారంతా సంతృప్తి చెంది ఆమోదం తెలిపితేనే మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఇవన్నీ తెలియని వారే ఆరోపణలు చేస్తుంటారు. స్పిన్నర్లకు అనుకూలంగా మార్చారని చెబుతున్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. 

నాకౌట్‌ మ్యాచులను కొత్త పిచ్‌లపైనే ఆడాలని ఎక్కడా చెప్పలేదు. అందుకే, భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య సెమీస్‌ కోసం అప్పటికే వాడిన పిచ్‌ను ఎంపిక చేశారు. ఇదేమీ రహస్యంగా జరగలేదు. భారత స్పిన్నర్ల కోసం పొడిబారిన పిచ్‌ను  వాడారనే ఆరోపణల్లో పసే లేదు. ఇప్పటికే సెమీస్‌లో అది నిరూపితమైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ కలిసి దాదాపు 724 పరుగులు చేశాయి. అలాగే ఒక్క పేసరే ఏడు వికెట్లు పడగొట్టాడు. భారత ఫాస్ట్‌ బౌలర్ షమీ అదరగొట్టాడు. ఆరోపణలు గుప్పించిన వారి ప్రకారం భారత స్పిన్నర్లే ఎక్కువ వికెట్లు తీయాలి కదా.. అలాంటిదేమీ జరగలేదు. ఆ తర్వాత న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ కూడా పిచ్‌తో తమకేమీ ఇబ్బంది లేదని చెప్పాడు’’ అని గావస్కర్‌ గుర్తు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు