ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లోనూ అదే జోరు.. పంజాబ్‌పై సన్‌రైజర్స్‌ ఘన విజయం

చివరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ అదరగొట్టింది. పంజాబ్‌పై ఘన విజయాన్ని నమోదు చేసింది.

Updated : 19 May 2024 19:44 IST

హైదరాబాద్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో మంచి ప్రదర్శన చేస్తూ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న హైదరాబాద్‌.. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. సొంత మైదానంలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ 19.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ట్రావిస్‌ హెడ్‌ మొదటి ఓవర్‌ తొలి బంతికే ఔటైనా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (66; 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) దంచికొట్టాడు. రాహుల్ త్రిపాఠి (33; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), నితీశ్‌ రెడ్డి (37; 25 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), హెన్రిచ్‌ క్లాసెన్ (42; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. అబ్దుల్ సమద్ (11), సన్వీర్ సింగ్ (6) నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ 2, హర్షల్ పటేల్ 2, హర్‌ప్రీత్ బ్రార్‌, శశాంక్‌ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు అథర్వ తైడే (46; 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (71; 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) శుభారంభం అందించారు. వన్‌డౌన్‌లో వచ్చిన రిలీ రోసో (49; 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించి త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. చివర్లో కెప్టెన్ జితేశ్‌ శర్మ (32*; 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో పంజాబ్ స్కోరు 200 దాటింది. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్ 2, కమిన్స్‌, విజయ్‌కాంత్ వియస్కాంత్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

రెండో స్థానంలోనే ఉంటుందా? 

ఈ విజయంతో సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టికలో 17 పాయింట్లతో రెండో స్థానంలోకి చేరింది. అయితే.. లీగ్‌ దశలో చివరి మ్యాచ్‌ అయిన రాజస్థాన్‌, కోల్‌కతా మ్యాచ్‌ ఫలితంపై హైదరాబాద్‌ రెండో స్థానంలో కొనసాగడం ఆధారపడి ఉంది. రాజస్థాన్‌ ఓడిపోతే హైదరాబాద్‌ రెండో స్థానంలోనే నిలిచి కోల్‌కతాతో క్వాలిఫయర్-1 ఆడుతుంది. ఒకవేళ రాజస్థాన్‌ గెలిస్తే హైదరాబాద్‌ మూడో స్థానానికి పడిపోయి ఆర్సీబీతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని