Team India: సీనియర్లు లేని వేళ.. భరోసా ఇస్తున్న యువ పేసర్లు

సీనియర్లు లేకుండానే దక్షిణాఫ్రికా జట్టును టీ20, వన్డే సిరీసుల్లో భారత యువ బౌలర్ల బృందం అడ్టుకోగలిగింది. వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుని చరిత్ర కూడా సృష్టించింది.

Published : 23 Dec 2023 20:31 IST

భారత జట్టులో (Team India) కొన్నేళ్లుగా పేస్‌ భారాన్ని మోస్తున్నారు జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌. అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్‌ వల్ల వీళ్లకు విశ్రాంతి లేకుండాపోతోంది. వీళ్లను పక్కనపెడితే భారత జట్టు పేస్‌ విభాగం బలహీనమైపోతుంది. అందుకే చాన్నాళ్లు భారత జట్టులో ఈ త్రయమే అవిశ్రాంతంగా కొనసాగుతోంది. కానీ దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌కు ఉపశమనం లభించింది. యువ పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్, అవేష్‌ఖాన్, ముకేశ్‌ కుమార్‌ తామున్మామంటూ భరోసా ఇచ్చారు. క్లిష్టమైన పిచ్‌లపై ఈ త్రయం బౌలింగ్‌ చేసిన తీరు భవిష్యత్‌పై ఆశలు రేపుతోంది.

మూడు ఫార్మాట్లలో అతడు

ముకేశ్‌ కుమార్‌ ఇప్పుడు భారత్‌కు దొరికిన ఓ పేస్‌ ఆణిముత్యం. ఎందుకంటే భారత జట్టులో ఎంతోమంది పేసర్లు వస్తున్నా వెళ్తున్నా మూడు ఫార్మాట్లలో ఆడే బౌలర్లు కనిపించడం లేదు. ముఖ్యంగా టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్స్‌ వేసే సత్తా ఉన్న వాళ్లు అరుదుగా ఉంటున్నారు. యువ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ మాత్రం మిగిలిన పేసర్ల కంటే భిన్నమని నిరూపించుకున్నాడు. ఈ జులైలో వెస్టిండీస్‌పై టెస్టు, వన్డేల్లో అరంగేట్రం చేసిన ముకేశ్‌.. దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. వేగంతో పాటు  వైవిధ్యం ముకేశ్‌ ప్రత్యేకత. పిచ్‌ పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను అడ్జస్ట్‌ చేసుకుంటూ అతడు బౌలింగ్‌ చేసే తీరు ఆకట్టుకుంటుంది. మహ్మద్‌ షమి మాదిరే రనప్‌ కలిగి ఉన్న ముకేశ్‌ స్వింగ్‌ పిచ్‌లపై అదరగొట్టగలడు. రా పేస్‌కు స్వింగ్‌ మిక్స్‌ చేసి అతడు వేసే బంతులు బ్యాటర్లకు పరీక్ష పెడుతున్నాయి. కచ్చితంగా మహ్మద్‌ షమికి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు ఇతడిని. ఐపీఎల్‌ కారణంగా ఆటగాళ్లు గాయపడుతున్న నేపథ్యంలో భారత రిజర్వ్‌ బెంచ్‌ను ముకేశ్‌ బలోపేతం చేస్తున్నాడు. 

వాళ్లిద్దరు కూడా

అర్ష్‌దీప్‌ సింగ్, అవేష్‌ఖాన్‌.. ఐపీఎల్‌లో సత్తా చాటి వెలుగులోకి వచ్చారీ కుర్ర పేసర్లు. పంజాబ్‌ కింగ్స్‌కు అర్ష్‌దీప్, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ తరఫున అవేష్‌ఖాన్‌ కొన్ని అద్భుత ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ చేసిన తీరు అద్భుతం అనిపించింది. అయితే అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చేసరికి అర్ష్‌దీప్, అవేష్‌లకు ఆ పదును లోపించింది. పరుగులు ధారాళంగా ఇచ్చేయడం వారికి మైనస్‌గా మారింది. ముఖ్యంగా పవర్‌ ప్లేలో బంతిని నియంత్రణతో వేయడం వీరికి చాలా కష్టంగా అనిపించింది. అయితే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అర్ష్‌దీప్, అవేష్‌ గాడిలో పడ్డారు. ముఖ్యంగా అర్ష్‌దీప్‌ అయితే మూడు వన్డేల సిరీస్‌లో 10 వికెట్లు తీసి అదరగొట్టాడు. తొలి వన్డేలో అవేష్‌ గొప్పగా బౌలింగ్‌ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ప్రధాన బౌలర్లు బుమ్రా, షమి, సిరాజ్‌ లేని లోటును వీళ్లు సమర్థంగా భర్తీ చేశారు. స్వింగ్‌ను ఉపయోగించుకుంటూ బౌలింగ్‌ చేసిన తీరు అద్భుతం. షార్ట్‌ బంతులు, స్లో బౌన్సర్లను కూడా సమర్థంగా వేశారు. 2022 న్యూజిలాండ్‌పై అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్‌ ఇప్పటిదాకా 42 టీ20ల్లో 59 వికెట్లు,  6 వన్డేల్లో 10 వికెట్లు తీశాడు.

మరో వైపు 2022 వెస్టిండీస్‌పై అంతర్జాతీయ కెరీర్‌ మొదలుపెట్టిన అవేష్‌ 19 టీ20ల్లో 18, 8 వన్డేల్లో 9 వికెట్లు పడగొట్టారు. అయితే ఈ గణాంకాలు వాళ్ల ప్రతిభకు కొలమానం కాదు. ఎందుకంటే వాళ్ల అసలు కెరీర్‌ మొదలైంది తాజా దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనే అని చెప్పాలి. కెరీర్‌ ఆరంభంలో పరుగులు బాగా లీక్‌ చేసేసి ఇక వీళ్లు కష్టం అనుకునే స్థితికి వెళ్లారు అర్ష్‌దీప్, అవేష్‌. కానీ సఫారీ పర్యటన ఈ కుర్రాళ్ల కెరీర్‌లకు ఊపిరిలూదింది. క్లిష్టమైన పిచ్‌లను అర్థం చేసుకుంటూ తమ నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ వీళ్లు బౌలింగ్‌ చేసిన తీరు గొప్పగా ఉంది. సీనియర్‌ బౌలర్లు లేకపోయినా ఇక భవిష్యత్‌ సిరీస్‌లకు వీళ్లను తీసుకెళ్లొచ్చన్న భరోసా కలిగింది. ఐపీఎల్‌ పుణ్యమా అని గాయాలు వెంటాడుతున్న నేపథ్యంలో నటరాజన్‌ లాంటి బౌలర్లు అలా మెరిసి ఇలా మాయమవుతున్నారు. కానీ అర్ష్‌దీప్, అవేష్, ముకేశ్‌ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే కచ్చితంగా భారత్‌కు ఓ మంచి పేస్‌ త్రయం అందుబాటులో ఉన్నట్లే. 

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని