Supriti Kachhap: తండ్రిని నక్సలైట్లు చంపినా.. గోల్డ్‌ మెడల్‌ సాధించిన సుప్రీతి

ఛాంపియన్లు ఎవరూ ఒక్క రోజులో తయారు కారు. కఠిన పరిస్థితులు, ముళ్ల దారులు దాటుకొని ఎన్నో ఏళ్లు శ్రమించి చివరికి విజేతలుగా ఎదుగుతారు...

Updated : 10 Jun 2022 12:20 IST

(Photo: Khelo India Twitter)

ఛాంపియన్లు ఎవ్వరూ ఒక్క రోజులో తయారు కారు. కఠిన పరిస్థితులు, ముళ్ల దారులు దాటుకొని.. ఎన్నో ఏళ్లు శ్రమించి చివరికి విజేతలుగా ఎదుగుతారు. అందరి హృదయాలు గెలిచి మంచి గుర్తింపు సాధిస్తారు. అలాంటి ఒక అమ్మాయే 19 ఏళ్ల సుప్రీతి కచ్చప్‌. నెలల పసిపాపగా ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయినా.. ఆమె తల్లి అండతో జాతీయ స్థాయిలో మేటి అథ్లెట్‌గా గుర్తింపు సాధించింది. ప్రస్తుతం జరుగుతోన్న ‘ఖేలో ఇండియా’ పోటీల్లో జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించి కొత్త చరిత్ర లిఖించింది. బంగారు పతకం సాధించి తల్లికి అమితానందాన్ని మిగిల్చింది.

కొత్త రికార్డు నెలకొల్పి..

హరియాణాలోని పంచకులలో ప్రస్తుతం జరుగుతోన్న ‘ఖేలో ఇండియా’ పోటీల్లో గురువారం ఉదయం సుప్రీతి జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించింది. గోల్డ్‌ మెడల్‌ సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది. మహిళల 3000 మీటర్ల పరుగు పందెంలో 9 నిమిషాల 46.14 సెకండ్లలోనే రేస్‌ను పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. ఇదివరకు ఈ కేటగిరీలో అత్యుత్తమ రికార్డు 9 నిమిషాల 50.54 సెకండ్లు. దాన్ని సుప్రీతి అధిగమించి బంగారు పతకం సాధించింది.

అప్పుడే తండ్రిని కోల్పోయి..

సుప్రీతి నెలల పసిపాపగా ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా బుర్హు అనే గిరిజన గ్రామం ఆమెది. సుప్రీతి తండ్రి రామ్‌సేవక్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌గా స్థానికంగా వైద్యం అందించేవాడు. అయితే, 2003లో ఒకసారి పక్క ఊరిలో ఎవరికో ఆరోగ్యం బాగోలేకపోతే చూసేందుకు వెళ్లాడు. మరునాడు ఆయన మృతదేహం ఓ చెట్టుకు కట్టేసి ఉంది. నక్సలైట్లు ఆయనను చంపేశారు. శరీరం మొత్తం బుల్లెట్‌ తూట్లతో కనిపించింది. ఈ ఘటనతో నలుగురు పిల్లలతో సుప్రీతి తల్లి బాల్మతి దేవి ఒంటరైపోయింది. నష్టపరిహారంగా ప్రభుత్వం ఆమెకు చిన్నపాటి ఉద్యోగం కల్పించింది.

ఆయన గుర్తించడం వల్లే..

సుప్రీతి తల్లికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆ కుటుంబం గుమ్లా జిల్లా కేంద్రానికి తరలిపోయింది. అక్కడే ప్రాథమిక విద్య అనంతరం సుప్రీతి స్కాలర్‌షిప్‌ సాయంతో సెంట్‌ పాట్రిక్స్‌ స్కూల్లో చేరింది. ఆ సమయంలో ఇంటర్‌ స్కూల్‌ కాంపిటీషన్‌ జరగడంతో పరుగు పందెంలో పాల్గొంది. అప్పుడే ఆమెలోని టాలెంట్‌ను గుర్తించిన కోచ్‌ ప్రభత్‌ రంజన్‌ తివారి ఆమె బాధ్యతలు తీసుకున్నాడు. ఝార్ఖండ్‌లోని క్రీడా శిక్షణ కేంద్రంలో చేర్పించాడు. అక్కడ ప్రత్యేక శిక్షణ ఇప్పించి జాతీయ ఛాంపియన్‌గా తీర్చిదిద్దాడు.

ఆమె గుండె వేగం పెరగదు..

కోచ్‌ ప్రభత్‌ రంజన్‌ సుప్రీతి గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఆమె మొదట్లో 400, 800 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనేదని, తాము శిక్షణ ఇవ్వడం ప్రారంభించాక 1500, 3000 వేల మీటర్ల దూరం పరిగెడుతుందని చెప్పారు. ఆ సమయంలో సుప్రీతికి నిర్వహించిన శారీరక పరీక్షల్లో గుండె కొట్టుకునే వేగం పెరిగిపోయేది కాదని తెలిపారు. దీంతో తాము అత్యధిక దూరం పరిగెత్తేలా శిక్షణ ఇచ్చామన్నారు. అలా ఎక్కువ దూరం పరిగెత్తేలా చేసి ఆమెను మానసికంగా, శారీరకంగా దృఢమయ్యేలా చేశామని వివరించారు.

సుప్రీతి ప్రయాణం ఇలా సాగింది..

* 2016లో విజయవాడలో జరిగిన జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో 1500 మీటర్ల పోటీల్లో తొలిసారి ఫైనల్‌కు చేరింది.

* తర్వాత ఆమె రాష్ట్ర, జాతీయ స్థాయిలో 3000 మీటర్ల పోటీలకు అర్హత సాధించింది.

* 2018లో భోపాల్‌లోని సాయ్‌ శిక్షణా కేంద్రంలో చేరి మాజీ జాతీయ ఛాంపియన్‌ ప్రతిభా టోప్పో వద్ద శిక్షణ పొందింది.

* అలా 2019లో తొలిసారి జాతీయ స్థాయిలో పతకం సాధించింది. అప్పుడు నేషనల్‌ క్రాస్‌ కంట్రీ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో 2000 మీటర్ల విభాగంలో వెండి పతకం కైవసం చేసుకుంది.

* 2019లోనే గుంటూర్‌లో జరిగిన జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో 3000 మీటర్ల పందెంలో రజత పతకం సొంతం చేసుకుంది.

* 2021లో భోపాల్‌లో నిర్వహించిన ఇండియన్‌ అండర్‌-20 ఫెడరేషన్‌ కప్‌లో 5000 మీటర్ల పందెంలో తొలిసారి పాల్గొని రజతం సాధించింది.

* అదే పోటీల్లో 3000 మీటర్ల పందెంలోనూ రజతం పొందింది.

* ఇక ఈ ఏడాది అండర్‌-20 ఫెడరేషన్‌ కప్‌లో 3000 మీటర్ల పందెంలో వెండి పతకం, ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ ఛాంపియన్‌షిప్‌లో 5000 మీటర్ల పోటీల్లో బంగారు పతకం సాధించింది.

* ఈ నేపథ్యంలోనే వచ్చే ఆగస్టులో కొలంబియాలో జరిగే అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించింది. అక్కడ కూడా సుప్రీతి విజయం సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆశిస్తోంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని