Surya Kumar Yadav: ఆ ఒక్కటి మినహా.. అంతా మాకు కలిసొచ్చింది: సూర్య

ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే.. భారత్‌ 3-1 తేడాతో (IND vs AUS) కైవసం చేసుకుంది. నాలుగో టీ20లో విజయం సాధించడంపై సూర్యకుమార్ స్పందించాడు.

Published : 02 Dec 2023 02:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియాపై నాలుగో టీ20లో భారత్‌ (IND vs AUS) విజయం సాధించడంపై కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్‌లో మాకు టాస్‌ మినహా అంతా కలిసొచ్చింది. మ్యాచ్‌కు ముందు మాట్లాడుకొనేటప్పుడు ఎలా ఆడాలనేదానిపై చర్చించుకున్నాం. అక్షర్ పటేల్‌ను మరింత ఒత్తిడికి గురి చేస్తే అంత అద్భుతంగా బౌలింగ్‌ చేస్తాడు. డెత్‌ ఓవర్లలో యార్కర్లు వేయాలని ముందే అనుకున్నాం. దాంతో ఫలితం మాకు అనుకూలంగా వచ్చింది’’ అని సూర్య వెల్లడించాడు. 

స్పిన్‌ను సరిగా ఆడలేదు: వేడ్

‘‘భారత్ స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడ్డాం. చివర్లో వికెట్లను త్వరగా కోల్పోవడం కూడా మా ఓటమికి కారణం. మా ఆటగాళ్లు చాలా కష్టపడ్డారు. కానీ, దురదృష్టవశాత్తూ బ్యాటింగ్‌లో విఫమలయ్యాం. తప్పకుండా ఈ ఓటమి నుంచి నేర్చుకుని ముందుకు సాగుతాం. టీ20 వరల్డ్‌ కప్‌లో లోతైన బ్యాటింగ్‌ అవసరం చాలా ఉంటుంది. దానిపైనే దృష్టిపెడతాం’’ అని ఆసీస్‌ కెప్టెన్ మాథ్యూ వేడ్ వ్యాఖ్యానించాడు. 

మ్యాచ్‌కు సంబంధించి మరికొన్ని విశేషాలు..

  • ఈ సిరీస్‌కు ముందు ఆసీస్‌కు నిర్దేశించిన లక్ష్యాలను కాపాడుకోవడంలో భారత్‌ నాలుగు మ్యాచుల్లోనూ విఫలమైంది. కానీ, ఈ సిరీస్‌లో మూడింట్లో రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. ఒకసారి మాత్రమే ఓటమిని చవిచూసింది.
  • ఆసీస్‌పై అక్షర్‌ పటేల్ 7 మ్యాచుల్లో 13 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 3/16. అక్షర్‌ కంటే బుమ్రా మాత్రమే ఆసీస్‌పై 16 వికెట్లు తీసి ముందున్నాడు.
  • టీ20ల్లో భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్ మాథ్యూ వేడ్. ఇప్పటి వరకు 465 పరుగులు చేశాడు. అందరికంటే ఎక్కువగా విండీస్‌ బ్యాటర్ నికోలస్‌ పూరన్ 592 రన్స్‌ చేశాడు. 
  • టీ20ల్లో భారత్‌పై ఎక్కువ వికెట్లు తీసిన రెండో ఆసీస్ బౌలర్‌ బెహ్రాన్‌డార్ఫ్‌. ఇప్పటి వరకు 11 వికెట్లు పడగొట్టాడు. ఆడమ్ జంపా 12 వికెట్లు తీశాడు. జాసన్ భారత్‌పై 9 మ్యాచుల్లో 11 వికెట్లు తీయగా.. ఇతర జట్లపై నాలుగు మ్యాచుల్లో కేవలం రెండు వికెట్లను మాత్రమే తీయడం గమనార్హం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు