Suryakumar - MS Dhoni: ధోనీ నాయకత్వంలో ఆడలేకపోయా.. ఇప్పటికీ చింతిస్తుంటా: సూర్యకుమార్‌

Eenadu icon
By Sports News Team Updated : 05 Oct 2025 13:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: రోహిత్, విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడిన సూర్యకుమార్‌ (Captain Suryakumar Yadav) ఇప్పుడు తానే కెప్టెన్‌గా మారాడు. అయితే, తన కెరీర్‌లో ఇప్పటికీ ఓ విషయంలో మాత్రం తీవ్రంగా చింతిస్తుంటానని వెల్లడించాడు. ప్రస్తుతం సూర్య ఆస్ట్రేలియాతో పొట్టి సిరీస్‌ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కెప్టెన్ కూల్‌’.. మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక సారథి ధోనీ నాయకత్వంలో సూర్య ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఐపీఎల్‌లోనూ ఇద్దరూ వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. 

‘‘ధోనీ భారత జట్టు సారథిగా ఉన్నప్పుడు ఒకటే కోరుకొనేవాడిని. అతడి నాయకత్వంలో ఒక్క మ్యాచ్‌లోనైనా ఆడాలనుకునేవాడిని. కానీ, ఆ అవకాశం రాలేదు. ఐపీఎల్‌లోనూ మేమిద్దరం ప్రత్యర్థులుగా తలపడ్డాం. ధోనీ ‘కూల్‌’గా ఉండటం ఆశ్చర్యమేసేది. స్టంప్స్‌ వెనుక అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాడో అర్థమయ్యేది కాదు. ధోనీకి ప్రత్యర్థిగా ఆడేటప్పుడు నేను నేర్చుకున్న ఒకే ఒక్క విషయం.. ఒత్తిడిలోనూ రిలాక్స్‌డ్‌గా ఎలా ఉండాలోనని. తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటాడు’’ అని సూర్య (suryakumar Yadav) కొనియాడాడు.

విరాట్ సారథ్యంపై..

‘‘విరాట్ కోహ్లీ (Virat Kohli) నాయకత్వంలోనే నేను భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చా. అతడు కష్టమైన టాస్క్‌లు ఇచ్చే మాస్టర్. పరిధిని నిర్దేశించి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఇతర సారథులూ బెస్ట్ ఆటనే రాబడతారు. కానీ, విరాట్ ప్రత్యేకత కలిగిన సారథి. మైదానంలో, ఆవల చాలా ఉత్సాహంగా ఉంటాడు. అందుకే, ఇతరులతో పోలిస్తే కాస్త భిన్నం’’ అని సూర్య తెలిపాడు.

రోహిత్‌తో అనుబంధంపై..

‘‘నేను ఎక్కువగా రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలోనే ఆడా. భారత జట్టుతోపాటు ఐపీఎల్‌లో కలిసి ఆడాం. తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కంఫర్ట్‌గా ఉన్నారా? లేదా? అని చూసుకుంటాడు. యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తాడు. కుర్రాళ్లకు అండగా ఉండేందుకు 24/7 తన తలుపులు తెరిచే ఉంటాయి’’ అని సూర్య వ్యాఖ్యానించాడు.

Tags :
Published : 05 Oct 2025 13:04 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు