Surya Kumar Yadav: సూర్యా... నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది... ఇది ముగింపు కాకూడదు
Surya kumar yadav love story: సూర్య వెనుక దేవిషా శెట్టి పాత్ర కూడా ఉంది. ఈ నేపథ్యంలో మరి వాళ్ల ప్రేమ కథ తెలుసుకుందామా!
లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడురా.. సూర్య కుమార్ యాదవ్ గురించి ఎక్కడ చూసినా ఇదే మాట. టీమిండియా 360 ఆటగాడిగా క్రికెట్ ప్రేమికులతో పాటు మాజీ క్రికెటర్లనూ ఆకర్షిస్తున్నాడు. పదేళ్ల క్రితమే తన సొగసరి సిక్సర్‌తో ఒక అమ్మాయి హృదయాన్ని గెలుచుకున్నాడని తెలుసా? టాలెంట్ ఉన్నా... అవకాశాలు రాని సూర్యకు ఆమె ధైర్యాన్నిచ్చింది. ఇప్పుడు ఆకలిగొన్న పులిలా ఆడుతున్న సూర్య వెనుక దేవీషా శెట్టి పాత్ర చాలా ఉంది అంటుంటారు సన్నిహితులు. మరి వాళ్ల ప్రేమ కథ, సూర్య జీవితంలో ఆ ప్రేమ తీసుకొచ్చిన మార్పుల గురించి తెలుసుకుందామా!
అది 2012.. నూనూగు మీసాల 22 ఏళ్ల సూర్య కాలేజీలో తక్కువ, గ్రౌండ్‌లో ఎక్కువ ఉండేవాడు. పెన్ను, పుస్తకం కన్నా బ్యాటు, బంతితోనే ఎక్కువగా గడిపేవాడు. ‘సూర్య -దేవీషా’ ప్రేమ కథలో హీరో ఎంట్రీ ఇది. ఏంటీ సినిమా కథలా చెబుతున్నారు అనుకుంటున్నారా? సూర్య జీవితంలో జరిగింది అలాంటిదే. నెక్స్ట్ మీరు ఊహించినట్లే హీరోయిన్ దేవీషా ఎంట్రీ కాలేజీ ఫ్రెషర్స్ డే నాడే. దీనికి వేదిక ముంబైలోని ఆర్.ఏ పోదర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ & ఎకనామిక్స్ కళాశాల ఆడిటోరియం. దేవీషా డ్యాన్స్‌ను చూసిన సూర్య... అక్కడికక్కడే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత గ్రౌండ్‌లో సూర్య ప్రతాపం చూసి దేవీషా ఫిదా అయ్యింది. ఇంకేముంది ప్రేమ, పెళ్లి... అనేసుకుంటారామో! చెప్పాంగా ఇద్దరి ప్రేమ సినిమా స్టైల్ అని. చాలానే ట్విస్టులున్నాయి. అవి సినిమాలను మించే ఉన్నాయి.
ముంబయిలోని ఆర్.ఏ పోదర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ & ఎకనామిక్స్ కళాశాలలో సూర్య బీకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 19 ఏళ్ల దేవీషా అప్పుడే ఇంటర్ పూర్తి చేసి ఆ కాలేజీలోనే చేరింది. అప్పటికే దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు సూర్య. ఫ్రెషర్స్ పార్టీలో దేవీషాను చూడటం.. ఆ తర్వాత ఆమెను గ్రౌండ్‌లో సూర్యను చూడటం సినిమాటిక్‌గా సాగిపోయాయి. అక్కడికి కొద్ది రోజులకు సూర్య ఒక మిత్రుడి ద్వారా ఆమెకు పరిచయమయ్యాడు. సగటు యూత్‌లాగే ఇద్దరూ కాలేజీ బయట కలుసుకోవడం, మాట్లాడుకోవడం షురూ అయ్యాయి. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఫేస్‌బుక్, బీబీయమ్ (మెసేంజర్) ద్వారా మరింత దగ్గరయ్యారు. ఇక సరదాగా గొడవలు ఎలానూ ఉంటాయి. అలా నాలుగేళ్లపాటు వీరి ప్రేమాయణం సాగింది.
లీగ్‌లోకి అలా వచ్చి...
దేవీషా మంచి డ్యాన్స్ కోచ్‌గా పేరు సంపాదించుకుంది. మరోవైపు సూర్య జాతీయ జట్టులో స్థానం కోసం పోరాడుతూనే ఉన్నాడు. 2012లో భారత టీ20 లీగ్‌లోకి ప్రవేశించినా 2015లో గానీ సరైన గుర్తింపు రాలేదు. ఆ ఏడాది ముంబయితో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున ఆడి 20 బంతుల్లోనే 5 సిక్సర్లతో 46 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. దీంతో అప్పటి వరకు దేశవాళీ క్రికెట్‌లోనే ఎంత రాణించినా రాని పేరు ఒక్కసారిగా ఈ ఇన్నింగ్స్‌తో వచ్చింది. ఆ ఇన్నింగ్స్ ఆనందాన్ని సూర్య బాగా ఎంజాయ్ చేశాడు.
ఆ తర్వాత ఏడాదే.. సూర్య, దేవీషా వివాహ బంధంలో మొదటి అడుగుపడింది. మే 29, 2016న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది దేవీషా. వారి కుటుంబం దక్షిణ భారతదేశం నుంచి వచ్చి ముంబయిలో స్థిరపడింది. దీంతో 2016 జులై 7న దక్షిణ భారత సంప్రదాయం ప్రకారమే సూర్య - దేవీషా వివాహం జరిగింది. దేవీషాకు పెంపుడు కుక్కలు అంటే ఇష్టం. దీంతో పెళ్లయిన తరువాత వాటితో దిగిన ఫొటోలను, సూర్యతో గడిపిన మధురానుభూతులను ఎప్పటికప్పుడు దేవీషా సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటోంది.
క్రికెట్‌పై దృష్టిపెట్టు..
తన లైఫ్‌లో కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవీషా అండగా ఉందని ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ అనే ఎపిసోడ్‌లో సూర్య చెప్పాడు. ‘‘మా వివాహం తరవాత.. నేను ఒక రోజు దేవీషాతో నాకు క్రికెట్‌లో ఎదురైన కష్టాలు గురించి మాట్లాడాను. నేను కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, బుమ్రాతో కలిసి ఆడాం. వీళ్లంతా టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు... ’’ అంటూ దేవీషాకు సూర్య చెప్పబోయాడు. అయితే దేవీషా అక్కడితో సూర్య మాటలకు అడ్డుపడి... ‘సూర్యా.. నువ్వు అన్ని ఆటంకాల గురించి మర్చిపోయి ముందు క్రికెట్ పై దృష్టిపెట్టు’’ అని అందట. ఆ మాటలు తనలో బాగా నాటుకుపోయాయని, అప్పుడే ప్రేమ అంటే ఏంటో తన వల్లే తెలిసిందని సూర్య చెబుతుంటాడు.
సూర్య 2.0... అంతకుమించి
దేవీషా మాటలు సూర్యను ఎంతగా మార్చాయో తెలియాలంటే సూర్య 2.0 గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. 2016 నవంబర్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌తో ముంబై రంజీ మ్యాచ్ అది. ముంబయి బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరుతుంటే.. సూర్య పోరాటం మాత్రం ఆగలేదు. సెంచరీ ఒక్క పరుగు దూరంలో ఔటైనా... జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ సూర్య మళ్లీ రాణించి 91 పరుగులు చేశాడు. దీంతో ముంబయి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా సూర్య ఎంపికయ్యాడు.
అదే సమయంలో భారత టీ20 లీగ్‌లో కోల్‌కతా తరఫున సత్తాచాటి ఆ జట్టుకు వైస్ కెప్టెన్ కూడా అయ్యాడు. గౌతమ్ గంభీర్ అప్పటి నుంచే ‘SKY’ అనే పేరుతో సూర్యని పిలవడం మొదలుపెట్టాడు. ఆ తరవాత 2018 మెగా వేలంలో రూ.3.2 కోట్లకు ముంబయి కొనుగోలు చేసింది. అప్పటినుంచి ముంబై జట్టు టాప్ ఆర్డర్‌లో ఆడుతూ రెచ్చిపోయాడు. ఏటా నిలకడగా 400 పరుగులకుపైగా చేస్తూ వస్తున్నాడు. దీంతో 2021 వచ్చేసరికి సూర్య పేరు క్రికెట్ ప్రపంచానికి గట్టిగా వినిపించింది. అయితే ఇది సూర్య - దేవీషా లక్ష్యంలో కొంత భాగం మాత్రమే.
ఇది ఆరంభం మాత్రమే...
సూర్యకు సుదీర్ఘ పోరాటం తరవాత ఎట్టకేలకు 2021లో ఇంగ్లాండ్‌పై టీ20ల్లో భారత జాతీయ జట్టుకు అరంగేట్రం చేసే అవకాశం లభించింది. టీమ్‌ఇండియాకు సూర్య ఎంపికైనా తరవాత దేవీషా తనతో ఏం మాట్లాడిందో ‘ బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ ’అనే ఎపిసోడ్‌లోనే వివరించాడు. ‘‘మ్యాచ్ రోజు ఉదయం 4 గంటలకు.. దేవీషా నాకు ఒక సలహా ఇచ్చింది. నీ 10 సంవత్సరాల నిజమైన క్రికెట్ ప్రయాణం... ఇప్పుడే ప్రారంభమవుతోంది. ఇది ముగింపు పాయింట్ కాకూడదు’ అని దేవీషా చెప్పిందని సూర్య భావోద్వేగంగా తెలిపాడు. ఆ సమయంలో సూర్య కళ్లలో టీమ్ ఇండియా చరిత్రలో తన పేరున ఓ పేజీ రాసుకోవాలనే కసి కనిపించింది. ఇన్నేళ్ల నిరీక్షణ ఫలించిందనే సంతృప్తి కూడా కనిపించింది.
ఆర్చర్ బంతిని సిక్స్‌కి పంపి...
ఇంగ్లాండ్‌తోనే అదే ఏడాది మార్చి14న నాలుగో టీ20లో సూర్య అరంగేట్రం చేశాడు. అది ‘అరంగేట్రం అనడం కంటే ఊచకోత అనడం బెటరేమో’ అని తొలి బంతిని అతను ఎదుర్కొన్న విధానం చూసి క్రీడా పండితులు అన్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే మెరుపు వేగంతో బౌలింగ్ చేసే జోఫ్రా ఆర్చర్ బంతిని... అంతే వేగంతో ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ కొట్టాడు. ఆ మ్యాచ్ కామెంటరీ చెబుతున్న వాళ్లకు ఆ షాట్‌ను వర్ణించడానికి మాటలు కూడా రాలేదు. ఎందుకంటే ఆర్చర్‌ను తొలి బంతికే అలా ఎదుర్కోవడం సాధారణ ఆటగాళ్లకు సాధ్యం కాదు అనేది వారి విశ్లేషణ. ఆర్చర్ ఒక్కడే కాదు.. అలాంటి షాట్లతో సూర్య ప్రతి బౌలర్‌కు స్వాగతం పలుకుతుంటాడు.
సూర్య ఎంత కసితో, ఆత్మవిశ్వాసంతో ఉన్నాడో.. అరంగేట్ర మ్యాచ్‌లోనే చూపించాడు. అక్కడ నుంచి మళ్లీ వెనక్కి తిరిగిచూడలేదు. ఇప్పుడు టీమ్ఇండియాలో స్టార్ ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సూర్య ఇలా ఆడుతున్నాడు అంటే.. దేవీషా మాటలు ఎంతలా అతని మీద ప్రభావం చూపించాయో మనకు అర్థమవుతుంది. దేవీషా చెప్పినట్టుగా ఇది భారత క్రికెట్‌లో సూర్యకిది ఆరంభం మాత్రమే. టీమ్‌ఇండియాకు ఎన్నో విజయాలు అందించి మేటి ఆటగాడిగా ఎదగాలని ఆశిద్దాం.
ఆఖరిగా... ఆ మధ్య ఓ టీ20లీగ్ మ్యాచ్‌లో ముంబయిని ఓటమి నుంచి గట్టెక్కించి.. డగౌట్ వైపు చూస్తూ.. ‘నేనున్నాగా.. ఎందుకు కంగారు’ అంటూ సిగ్నల్ ఇచ్చాడు. ఆ రోజు అది ముంబయి వరకేమో అనుకున్నారంతా. కానీ, ఇప్పుడు టీమ్ ఇండియాకు కూడా అదే మాట చెప్పకనే చెబుతున్నాడు. అయితే అతని వెనుక ‘నేనున్నాగా’ అని ఎప్పుడూ స్ఫూర్తిని నింపేది దేవీషా శెట్టి.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/01/2023)
-
India News
Aero India Show: ఏరో ఇండియా షో.. నాన్‌వెజ్ అమ్మకాలపై నిషేధం.. ఎందుకో?
-
India News
Viral Video: ఉదయనిధి స్టాలిన్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి
-
India News
Boycott Culture: ‘బాయ్‌కాట్’ మంచి పద్ధతి కాదు..!: కేంద్ర మంత్రి ఠాకూర్
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
India News
Goa: ఆస్తి వివాదం.. గోవాలో ఫ్రెంచ్ నటి నిర్బంధం..!