T20 League: కుర్రాళ్లే.. కానీ కుమ్మేశారు.. టీమ్‌ఇండియా భవిష్యత్‌ స్టార్‌ క్రికెటర్లు వీరే!

 ఎంతో మంది యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చింది భారత టీ20 లీగ్‌. ప్రస్తుతం టీమ్‌ఇండియాలో కీలకంగా ఉన్న జస్ప్రీత్‌ బుమ్రా, రిషభ్‌ పంత్, శ్రేయస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్‌ ఈ వేదిక ద్వారానే తమ సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. 

Published : 31 May 2022 11:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంతో మంది యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చింది భారత టీ20 లీగ్‌. ప్రస్తుతం టీమ్‌ఇండియాలో కీలకంగా ఉన్న జస్ప్రీత్‌ బుమ్రా, రిషభ్‌ పంత్, శ్రేయస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్‌ ఈ వేదిక ద్వారానే తమ సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సీజన్‌లో కూడా కొంతమంది యువ క్రికెటర్లు అంచనాలకుమించి రాణించారు. ఈ ఆటగాళ్లు ఇదే ఊపుని కొనసాగిస్తే భవిష్యత్‌లో టీమ్‌ఇండియాకు కీలకంగా మారే అవకాశం ఉంది. మరి ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం.   

ఉమ్రాన్‌ మాలిక్

జమ్ముకశ్మీర్‌ యువ పేస్‌ బౌలింగ్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌ టీ20 లీగ్‌లో అదరగొట్టాడు. హైదరాబాద్‌ తరఫున ఆడిన ఉమ్రాన్‌.. 14 మ్యాచ్‌ల్లో 9.03 ఎకానమీతో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో అతడు ఓ మ్యాచ్‌లో 157 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. జూన్‌9 నుంచి దక్షిణాఫ్రికా, భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు ఉమ్రాన్‌ మాలిక్‌ ఎంపికయ్యాడు.

తిలక్‌ వర్మ

ఈ సీజన్‌లో మనకు దొరికిన మరో ఆణిముత్యం తిలక్ వర్మ. తెలంగాణకు చెందిన ఈ 19 ఏళ్ల కుర్రాడు ముంబయి జట్టులో నిలకడగా రాణించాడు. ఆడిన 14 మ్యాచ్‌ల్లో 36.09 సగటుతో 397 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలున్నాయి. తిలక్ వర్మ ఇలానే ఆడితే మరికొన్ని నెలల్లో టీమ్‌ఇండియాకు ఎంపికై కీలక ఆటగాడిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అర్ష్‌దీప్‌ సింగ్‌

ఎక్కువ వికెట్లు పడగొట్టకున్నా మంచి ఎకానమీతో బౌలింగ్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు అర్ష్‌దీప్‌ సింగ్‌. గత కొన్ని సీజన్ల నుంచి పంజాబ్‌ జట్టుకు ఆడుతున్న ఈ 23 ఏళ్ల ఫాస్ట్‌బౌలర్‌ డెత్‌ ఓవర్లలో ఒత్తిడికి గురికాకుండా పొదుపుగా బౌలింగ్‌ చేసి మాజీ ఆటగాళ్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 7.70 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. జూన్‌లో భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అర్ష్‌దీప్‌ సింగ్‌ ఎంపికయ్యాడు.

అభిషేక్‌ శర్మ

పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల అభిషేక్‌ శర్మ గత కొన్ని సీజన్ల నుంచి హైదరాబాద్‌కు ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో అతడు 14 మ్యాచ్‌ల్లో 30.43 సగటుతో 426 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్‌ సెంచరీలున్నాయి. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అభిషేక్‌ ఇదే ప్రదర్శనను భవిష్యత్‌లోనూ కొనసాగిస్తే భారత జట్టు స్టార్‌ ప్లేయర్‌గా మారే అవకాశం ఉంది.

మోసిన్‌ఖాన్‌

ఈ సీజన్‌లో వెలుగులోకి వచ్చిన మరో యువ క్రికెటర్‌ మోసిన్‌ఖాన్‌. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ 23 ఏళ్ల కుర్రాడు టీ20 లీగ్‌లో లఖ్‌నవూ జట్టుకు ఆడాడు. 9 మ్యాచ్‌ల్లో కేవలం 5.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టాడు. దిల్లీతో జరిగిన ఓ మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అతడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రానున్న రోజుల్లో దేశవాళీ టోర్నీల్లో కూడా మోసిన్‌ఖాన్‌ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం.   

రాహుల్‌ త్రిపాఠి

ఝార్ఖండ్‌కు చెందిన రాహుల్‌ త్రిపాఠి 2017 నుంచి టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు 76 మ్యాచ్‌లు ఆడిన త్రిపాఠి 1798 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన ఇతడు 14 మ్యాచ్‌ల్లో 37.55 సగటుతో 413 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలున్నాయి. త్రిపాఠి ఇలానే నిలకడగా రాణిస్తే త్వరలో టీమ్ఇండియాకు ఎంపిక కావొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని