T20 League: టీ20 లీగ్‌.. గుజరాత్‌ గాండ్రింపా..? రాజస్థాన్‌ రాజసమా..?

 టీ20 టోర్నీలో మూడు ప్లేఆఫ్స్‌ బెర్తులు ఖరారు కాగా.. ఆఖరి దాని కోసం రెండు జట్లు బరిలో నిలిచాయి. అదీ ఇవాళ తేలిపోతుంది. అయితే తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు నాకౌట్‌ దశలో ఓడినా మరొక అవకాశం..

Published : 22 May 2022 01:59 IST

మే 24న తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌

ఇంటర్నెట్ డెస్క్: టీ20 టోర్నీలో మూడు ప్లేఆఫ్స్‌ బెర్తులు ఖరారు కాగా.. ఆఖరి దాని కోసం రెండు జట్లు బరిలో నిలిచాయి. అదీ ఇవాళ తేలిపోతుంది. అయితే తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు నాకౌట్‌ దశలో ఓడినా మరొక అవకాశం ఉంటుంది. మరి లీగ్‌ స్థాయిలో టాప్‌-2  జట్లేవి.. వాటి బలాలు, బలహీనతలు.. ఈ సీజన్‌లో ఆ రెండు టీమ్‌ల మధ్య జరిగిన పోరులో ఎవరు పైచేయి సాధించారనే విషయాలను తెలుసుకుందాం.. 

టీ20 లీగ్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ అద్భుత విజయాలతో నంబర్‌వన్‌ స్థానం దక్కించుకుంది. హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని టీమ్‌ 14 మ్యాచుల్లో 10 విజయాలతో 20 పాయింట్లు సాధించింది. ఇక ఆఖరి వరకు టాప్‌-4లో ప్లేస్‌ కోసం పోరాడిన రాజస్థాన్‌ ఏకంగా రెండో స్థానంలోకి దూసుకొచ్చింది. రాజస్థాన్‌, మరొక కొత్త జట్టు లఖ్‌నవూ కూడా తొమ్మిదేసి విజయాలతో ఉన్నప్పటికీ మెరుగైన నెట్‌రన్‌రేట్‌ కారణంగా సంజూ సేన ముందుకొచ్చింది. నెట్‌రన్‌రేట్‌ ఎంత కీలకమో దీనిని బట్టే అర్థవుతుంది కదా.. ఇక పోతే మే 24న తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. గుజరాత్‌, రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు డైరెక్ట్‌గా ఫైనల్‌కు చేరుకుంటుంది. తొలి క్వాలిఫయర్‌లో   ఓడిన జట్టుకు మరొక అవకాశం ఉంటుంది.  ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టుతో రెండో క్వాలిఫయర్‌లో తలపడవచ్చు. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ మే 25న, రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ మే 27న, ఫైనల్‌ మే 29న జరుగుతాయి. 

కొత్త జట్టు.. నూతన సారథ్యం

హేమాహేమీలు సారథులుగా ఉన్న టీ20 టోర్నీలో అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అనుభవం లేకుండా నాయకత్వ బాధ్యతలను చేపట్టి జట్టును నడపించడం తేలికైన విషయమేమీ కాదు. అయితే జట్టు సభ్యుల మద్దతు ఉంటే పెద్ద కష్టమేమీ కాదని నిరూపించాడు హార్దిక్‌ పాండ్య. గత సీజన్‌ వరకు ముంబయికి ఆడిన హార్దిక్‌ను మెగా వేలానికి ముందు గుజరాత్‌ తీసుకుంది. ఏకంగా కెప్టెన్‌ చేసేసింది. లీగ్‌ దశలో సాధించిన 10 విజయాల్లో ఏడుసార్లు ఛేజింగ్‌లోనే గెలిచింది. అన్ని మ్యాచ్‌లు చివరి ఓవర్‌ వరకూ వెళ్లడం గమనార్హం. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనప్పుడు మిడిలార్డర్‌ బ్యాటర్లు రాణిస్తుండటం గుజరాత్‌కు కలిసొచ్చింది. బ్యాటింగ్‌ టాపర్లలో హార్దిక్‌ పాండ్య 413 పరుగులతో ఏడో స్థానం, 403 రన్స్‌తో శుభ్‌మన్‌ గిల్ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. 

గత చివరి నాలుగు మ్యాచ్‌లను తీసుకుంటే ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహాలో ఒకరు మాత్రమే మంచి ఆరంభం ఇస్తున్నారు.  అయినప్పటికీ స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకుని ఒత్తిడిలోకి వెళ్తోంది. ఆఖర్లో డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్ ఖాన్‌ బ్యాటర్లు స్ట్రోక్‌ షాట్లు కొట్టడంతో విజయాలను నమోదు చేయగలిగింది.  అయితే షమీ, యాష్ దయాల్, అల్జారీ జోసెఫ్, రషీద్‌ ఖాన్‌, లాకీ ఫెర్గూసన్‌తో బౌలింగ్‌ దళం పటిష్ఠంగానే ఉంది. సాయికిశోర్‌ కూడా ఫర్వాలేదనిపించాడు. ఇక ఓడిపోయిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో గుజరాత్ తొలుత బ్యాటింగ్‌ చేసింది. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కాస్త జాగ్రత్త వహించాల్సిందే. లేకపోతే నాకౌట్‌ దశలో అన్నిసార్లూ అదృష్టం కలిసిరాకపోవచ్చు. అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-10 జాబితాలో రషీద్‌ ఖాన్‌ (18),  షమీ (18) చోటు సంపాదించారు. 


ఈసారైనా కప్‌ దిశగా.. 

దివంగత దిగ్గజ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ నేతృత్వంలోని రాజస్థాన్‌ తొలి సీజన్‌లోనే కప్‌ను కైవసం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఒక్కసారికూడానూ ఫైనల్‌కు చేరుకోలేదు. కేవలం మూడు సార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అదీ కూడా మూడో స్థానంతో, నాలుగో స్థానంతో వెళ్లింది. అయితే ఈసారి పాయింట్లపరంగా రెండో స్థానం దక్కించుకున్న రాజస్థాన్‌ తొలి క్వాలిఫయర్‌లోనే విజయం సాధించి ఫైనల్‌కు చేరుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే అదేమీ సులభమేమీ కాదు. ఎందుకంటే ఇక్కడ ఎదుర్కొనేది టాప్‌ టీమ్ గుజరాత్‌తో మరి. దీనికోసం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకోవాలి.  అయితే గుజరాత్‌కు అన్ని విభాగాల్లో రాజస్థాన్‌ సమవుజ్జీగానే ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే కాస్త మెరుగ్గానే ఉంది. అయితే యాజమాన్యం అనుకున్న ప్రణాళికలను ఆటగాళ్లు మైదానంలో అమలు చేస్తే సరిపోతుంది. 

ఓపెనర్‌ జోస్ బట్లర్‌ అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. 14 మ్యాచుల్లో మూడు శతకాలు, మూడు అర్ధశతకాలతో 629  పరుగులు సాధించాడు. అయితే గత ఐదు మ్యాచ్‌ల గణాంకాలను పరిశీలిస్తే కేవలం 63 పరుగులను మాత్రమే సాధించడం గమనార్హం. అంటే తొలి 9 మ్యాచుల్లో 566 రన్స్‌ చేసిన బట్లర్ ఆ తర్వాత నెమ్మదించాడు. అయితే కీలకమైన నాకౌట్‌ దశలో విజృంభించాల్సిందే. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, దేవదుత్ పడిక్కల్, రియాన్ పరాగ్‌ ఫర్వాలేదనిపిస్తున్నారు. రవిచంద్రన్ అశ్విన్‌ కూడా మంచి ఫామ్‌లోకి రావడం రాజస్థాన్‌కు అదనపు బలం. బౌలింగ్‌లోనూ ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ ఎలానూ ధాటిగా ఆడేస్తాడు. మరోవైపు బౌలింగ్‌లోనూ రాజస్థాన్‌ పటిష్ఠంగానే ఉంది. ట్రెంట్ బౌల్ట్‌, ప్రసిధ్‌ కృష్ణ ఆరంభ ఓవర్లలో వికెట్లను తీసి ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేయగలరు. ఇక స్పిన్‌ ద్వయం యుజ్వేంద్ర చాహల్, అశ్విన్‌ మధ్య ఓవర్లలో బ్యాటర్ల పని పడతారు. 

టాప్‌-2 మధ్య పోరు ఎలా ఉందంటే? 

ఈ సీజన్‌లో గుజరాత్‌, రాజస్థాన్‌ జట్ల మధ్య ఒకే మ్యాచ్‌ జరిగింది. అదీనూ గుజరాత్‌దే పైచేయి నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అయితే రాజస్థాన్‌ 155/9 స్కోరుకే పరిమితమై 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. యువ బౌలర్‌ కుల్‌దీప్‌ సేన్‌ (0/51) తేలిపోయాడు. చాహల్, అశ్విన్‌ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తర్వాత బ్యాటింగ్‌లో జోస్ బట్లర్ (54), హెట్‌మయేర్ (29) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. కాబట్టి ఫైనల్‌కు చేరుకుని కప్‌ను సాధించాలంటే ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పోరాడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని