T20 World Cup 2024: నెదర్లాండ్స్‌ బోణీ

టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌ బోణీ కొట్టింది. మంగళవారం నేపాల్‌తో గ్రూప్‌-డి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట నేపాల్‌ 19.2 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (35; 37 బంతుల్లో 5×4) టాప్‌ స్కోరర్‌.

Published : 05 Jun 2024 03:15 IST

మెరిసిన ఒడౌడ్, ప్రింగిల్, వాన్‌బీక్‌
నేపాల్‌పై గెలుపు 

డల్లాస్‌: టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌ బోణీ కొట్టింది. మంగళవారం నేపాల్‌తో గ్రూప్‌-డి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట నేపాల్‌ 19.2 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (35; 37 బంతుల్లో 5×4) టాప్‌ స్కోరర్‌. టిమ్‌ ప్రింగిల్‌ (3/20), వాన్‌బీక్‌ (3/18), మేకరన్‌ (2/19), డిలీడ్‌ (2/22) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఒడౌడ్‌ (54 నాటౌట్‌; 48 బంతుల్లో 4×4, 1×6), విక్రమ్‌జీత్‌ సింగ్‌ (22; 28 బంతుల్లో 4×4) రాణించడంతో లక్ష్యాన్ని నెదర్లాండ్స్‌ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. 

రాణించిన ఒడౌడ్, విక్రమ్‌: స్వల్ప ఛేదనలో నెదర్లాండ్స్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్లోనే లెవిట్‌ (1) ఔటయ్యాడు. ఈ స్థితిలో ఒడౌడ్, విక్రమ్‌జీత్‌ సింగ్‌తో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. నేపాల్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తుండడంతో భారీ షాట్లకు వెళ్లకుండా నెమ్మదిగా ఆడుతూనే ఈ జోడీ లక్ష్యాన్ని కరిగించింది. ఒడౌడ్, విక్రమ్‌జీత్‌ జంట రెండో వికెట్‌కు 40 పరుగులు జోడించింది. విక్రమ్‌జీత్‌ను దీపేంద్ర వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఈ జోడీని విడదీశాడు. సిబ్రాండ్‌ (14) ఎడ్వర్డ్స్‌ (5) వికెట్లు స్పల్ప వ్యవధిలో పడినా... కుదురుగా ఆడిన ఒడౌడ్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు. 2 ఓవర్లలో 13 పరుగులు అవసరమైన స్థితిలో ధాటిగా ఆడి డచ్‌ జట్టును గెలిపించాడు.

విజృంభించిన ప్రింగిల్, వాన్‌బీక్‌: మొదట నేపాల్‌ బ్యాటర్లకు నెదర్లాండ్స్‌ బౌలర్లు కళ్లెం వేశారు. పేసర్లు ప్రింగిల్, వాన్‌బీక్‌ విజృంభించడంతో ఆ జట్టు పవర్‌ప్లేలోనే 15 పరుగులకే 2 వికెట్లు చేజార్చుకుంది. ఈ స్థితిలో కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్, అనిల్‌ సాహ్‌ (11)తో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని ఆపాడు. 7.3 ఓవర్లకు 40/2తో నేపాల్‌ కాస్త కోలుకున్నట్లే కనిపించింది. కానీ అనిల్‌ను ప్రింగిల్‌ ఔట్‌ చేసి మళ్లీ వికెట్ల పతనానికి తెర తీశాడు. 26 పరుగుల తేడాతో 4 వికెట్లు పడడంతో నేపాల్‌ పరుగులు చేయడంలోనూ వెనుకబడింది. రోహిత్‌ నిలిచినా అతడికి సహకారం అందించేవాళ్లు కరువయ్యారు. రోహిత్‌ ఔటయ్యాక గుల్షాన్‌ (14), కరన్‌ (17) స్కోరుని 100 దాటించారు. ఇన్నింగ్స్‌లో మరో నాలుగు బంతులు ఉండగానే ఆ జట్టు ఆలౌట్‌ అయింది. ప్రింగిల్, వాన్‌బీక్‌లకు తోడు డిలీడ్‌ (2/22), మేకరన్‌ (2/19) నేపాల్‌ను కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించారు. 

సంక్షిప్త స్కోర్లు.. నేపాల్‌: 19.2 ఓవర్లలో 106 ఆలౌట్‌ (రోహిత్‌ పౌడెల్‌ 35, గుల్షాన్‌ 14, కరన్‌ 17; టిమ్‌ ప్రింగిల్‌ 3/20, వాన్‌బీక్‌ 3/18, మేకరన్‌ 2/19, బాస్‌ డిలీడ్‌ 2/22) నెదర్లాండ్స్‌: 18.4 ఓవర్లలో 109/4 (మ్యాక్స్‌ ఒడౌడ్‌ నాటౌట్‌ 54, విక్రమ్‌జీత్‌ సింగ్‌ 22)

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా గురువారం తన పోరాటాన్ని ఆరంభించనుంది. ఉదయం 5 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లో పాపువా న్యూగినీతో ఉగాండా తలపడనుండగా.. 6 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఒమన్‌ ఢీకొననుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని