T20 World Cup 2022: ముగిసిన టీ20 ప్రపంచకప్‌.. రికార్డులు ఏంటో చూసేద్దాం..!

ఇన్నాళ్లు అభిమానులను అలరించిన టీ20 ప్రపంచకప్‌ సమరం నేటితో ముగిసింది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిరెండోసారి టీ20 ప్రపంచకప్‌ని ముద్దాడింది.

Updated : 14 Nov 2022 20:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌‌: ఇన్నాళ్లు అభిమానులను అలరించిన టీ20 ప్రపంచకప్‌ సమరం ముగిసింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్‌ విజయం సాధించి టైటిల్‌ను ఎగరేసుకొనిపోయింది. ఇది ఇంగ్లాండ్‌కు రెండో టీ20 ప్రపంచకప్ కావడం విశేషం. ఈసారి మొత్తం 45 మ్యాచ్‌లు జరిగాయి. మరి హోరాహోరీగా సాగిన ఈ టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో నమోదైన పలు రికార్డులపై ఓ లుక్కేద్దాం.. 

  1. విరాట్ కోహ్లీ: టీ20 ప్రపంచకప్‌లో అత్యధికంగా పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 296 పరుగులు చేశాడు. కోహ్లీ తర్వాత నెదర్లాండ్స్‌ ఆటగాడు మాక్స్ ఓ డౌడ్ (242 పరుగులు 8 ఇన్నింగ్స్‌ల్లో), సూర్యకుమార్‌ యాదవ్‌ (239 పరుగులు 6 ఇన్నింగ్స్‌ల్లో) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే హాఫ్‌ సెంచరీల్లోనూ కోహ్లీ టాప్‌ (ఆరు ఇన్నింగ్స్‌ల్లో 4 అర్ధశతకాలు). ఆ తర్వాత సూర్యకుమార్‌ (3 అర్ధ సెంచరీలు) కావడం విశేషం. 
  2. హసరంగ: టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనతో శ్రీలంక బౌలర్‌ హసరంగ (15) అత్యధిక వికెట్లు తీశాడు. సామ్‌ కరన్‌ (13), బాస్ డి లీడే (13) తర్వాతి స్థానాల్లో నిలిచారు. టాప్‌ -10 బౌలర్లలో టీమ్‌ఇండియా నుంచి ఒక్క బౌలరూ లేకపోవడం గమనార్హం. యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ పది వికెట్లతో 11వ స్థానంలో నిలిచాడు.
  3. రిలీ రోసోవ్‌: టీ20ల్లో ధాటిగా ఆడటం చాలా ముఖ్యం. దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రూసో బంగ్లాదేశ్‌పై శతకం సాధించాడు. 109 పరుగులు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరర్‌గా తొలి స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్‌ ఫిలిప్స్‌(శ్రీలంకపై 104) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ప్రపంచకప్‌లో ఈ ఇద్దరే శతకాలు బాదారు. 
  4. సామ్‌ కరన్‌: ‘ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నమెంట్‌’గా ఎంపికైన సామ్‌ కరన్‌ (5/10) అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేశాడు. అఫ్గానిస్థాన్‌పై ఐదు వికెట్లు ప్రదర్శన చేశాడు.  కరన్‌ తర్వాత ఆన్రిచ్‌ నోకియా (4/10, బంగ్లాదేశ్‌పై), ట్రెంట్ బౌల్ట్‌ (4/13, శ్రీలంకపై) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
  5. సూర్యకుమార్‌ యాదవ్‌: అత్యధిక ఫోర్ల జాబితాలో మన ‘మిస్టర్‌ 360’ ఆటగాడు సూర్యకుమార్‌ టాప్‌లో ఉన్నాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 26 ఫోర్లు బాది మొదటి స్థానంలో ఉండగా..  విరాట్ కోహ్లీ 6 ఇన్నింగ్స్‌ల్లో 25 బౌండరీలు, జోస్‌ బట్లర్‌ 6 ఇన్నింగ్స్‌ల్లో 24 ఫోర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 
  6. సికందర్‌ రజా: జింబాబ్వే కీలక ఆటగాడు సికందర్‌ రజా (8 ఇన్నింగ్స్‌ల్లో 11 సిక్స్‌లు ) అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌ (6 ఇన్నింగ్స్‌ల్లో 10 సిక్స్‌లు) రెండో స్థానంలో, కుశాల్ మెండిస్‌ (8 ఇన్నింగ్స్‌ల్లో 10 సిక్స్‌లు) మూడో స్థానంలో ఉన్నాడు. 
  7. ఫ్రెడ్ క్లాసెన్: టీ20ల్లో పరుగు ఇవ్వకుండా బంతిని సంధించడం కత్తిమీద సామే. అలాంటిది నెదర్లాండ్స్‌ బౌలర్‌ ఫ్రెడ్ క్లాసెన్ ఏకంగా 93 డాట్‌ బాల్స్‌ వేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత రిచర్డ్ ఎన్‌గరవ (89),  పాల్ వాన్ మీకెరెన్ నెదర్లాండ్స్‌ (85) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 
  8. ఇంగ్లాండ్: టైటిల్‌ను నెగ్గిన ఇంగ్లాండ్‌ అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా అవతరించింది. ఆరు మ్యాచుల్లో 5 విజయాలు, ఒక ఓటమితో 83.3 శాతం సాధించి మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (75 శాతం) 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానం, భారత్‌ (66.667) 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, రెండు ఓటములతో మూడో ప్లేస్‌లో నిలిచాయి.  
  9. శ్రీలంక; నెదర్లాండ్స్‌: క్వాలిఫయిర్‌ మ్యాచ్‌లతో కలిపి శ్రీలంక ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. అందులో నాలుగు విజయాలు నమోదు చేయగా.. మరో నాలుగింటిలో ఓడింది. అలాగే  నెదర్లాండ్స్‌ కూడా  8 మ్యాచ్‌ల్లో నాలుగేసి గెలుపోటములతో నిలిచింది. అయితే దక్షిణాఫ్రికాపై కీలక విజయం సాధించిన నెదర్లాండ్స్‌ సంచలనం సృష్టించింది.
  10. ప్రైజ్‌మనీ: ఫైనల్‌లో పాక్‌పై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లాండ్‌కు రూ.13 కోట్ల ప్రైజ్‌మనీ దక్కగా.. రన్నరప్‌తో సరిపెట్టుకున్న పాకిస్థాన్‌కు రూ.6.5 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. అలాగే సెమీస్‌లో ఓడిన రెండు జట్లకు చెరో 3.25 కోట్ల చొప్పున దక్కడం విశేషం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని